చలికాలంలో మిమ్మల్ని వెచ్చగా ఉంచే ఆహారాలు ఇవే..! తప్పక తినండే..

First Published Dec 16, 2022, 12:07 PM IST

చలికాలంలో  చాలా మంది  తరచుగా ఆర్థరైటిస్, చర్మ వ్యాదులతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు. అయితే ఈ సీజన్ లో గుడ్లను, వేరుశెనగ వెన్న, చిరుధాన్యాలు, గింజలు వంటి ఆహారాలను తింటే మీ శరీరం వెచ్చగా, ఆరోగ్యంగా ఉంటుంది. 

winter food

చలికాలంలో ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే చల్లటి గాలుల వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి, సైనస్, జ్వరం, ఇన్ఫెక్షన్లు వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. చల్లని వాతావరణంలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలంటే కొన్ని రకాల ఆహారాలను తప్పకుండా తీసుకోవాలి. ఇవి మన శరీరాల్ని వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మాన్ని కాపాడుతాయి. ఇందుకోసం ప్రోటీన్లు, కొవ్వు కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. ఇవి కాలానుగుణంగా వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. 

చలికాలంలో ఆర్థరైటిస్, డ్రై స్కిన్, తామర, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులతో పాటుగా ఎన్నో రకాల రోగాలు వస్తాయి. అయితే ఈ సీజన్ లో కొన్ని రకాల ఆహారాలను తింటే ఇలాంటి సమస్యలొచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అవేంటంటే..

గుడ్లు

గుడ్లు మన శరీర కణజాలాలను రిపేర్ చేయడానికి ఎంతో సహాయపడతాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. సాధారణంగా పెద్దలు రోజుకు రెండు గుడ్లను తినొచ్చు. గుడ్లు కూడా ఒక డైట్ ఫుడ్ యే. వీటిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గుడ్లను తింటే భోజనాల మధ్య మీ కడుపు నిండుగా ఉంటుంది. అలాగే అదనపు కేలరీలను తగ్గించడానికి సహాయపడుతుంది. 
 

peanut butter

వేరుశెనగ లేదా ఇతర గింజల వెన్న

వేరుశెనగ లేదా ఇతర గింజల వెన్నలు తక్షణ శక్తిని ఇస్తాయి. ఎందుకంటే వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఇలాంటి ఆరోగ్యకరమైన కొవ్వులను జీర్ణం చేయడానికి మన శరీరం ఎక్కువ సమయం తీసుకుంటుంది. వేరుశెనగ లేదా ఇతర గింజల వెన్నలో వివిధ రకాల పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. కానీ కేలరీలు, కొవ్వు కూడా ఎక్కువగానే ఉంటాయి. వేరుశెనగ వెన్నలోని ఆరోగ్యకరమైన కొవ్వులు పోషకమైనవే. కాని దీన్ని మితంగా తినాలి. 
 


చిలగడదుంపలు

చిలగడదుంపలను చలికాలంలో తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అందుకే ఈ సీజన్ లో వీటిని తప్పకుండా తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో చిలగడదుంపలు పుష్కలంగా లభిస్తాయి. వీటిలో ఫైబర్, విటమిన్ ఎ, పొటాషియంతో పాటుగా ఇతర పోషకాలు, ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. అలాగే మంటను తగ్గిస్తుంది. ఇది మలబద్దకాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇది మన శరీరానికి అవసరమైన విటమిన్ సి పొందడానికి సహాయపడుతుంది. 
 


చిరుధాన్యాలు

చిరుధాన్యాల్లో వివిధ రకాల పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. చిరుధాన్యాల్లో  గ్లైసెమిక్ సూచిక తక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. సాధారణంగా చలికాలంలో లభించే అన్నిరకాల చిరుధాన్యాలను తినాలి. వీటిలో రాగి ఉత్తమ శీతాకాల చిరుధాన్యం. ఎందుకంటే ఇది చలికాలం నుంచి బయటపడటానికి తగినంత వెచ్చదనాన్ని అందిస్తుంది. దీనిలో అమైనో ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని అరికట్టడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రాగి జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది.ఎందుకంటే దీనిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.  చిరుధాన్యాలు నిద్రలేమి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. ఫైబర్, విటమిన్ బి అధికంగా ఉండే బజ్రా కూడా చలికాలంలో మన శరీరాల్ని వెచ్చగా ఉంచడానికి సహాయపడుతుంది. 

nuts


గింజలు

శీతాకాలంలో, గింజలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే గింజలకు వేడిచేసే గుణముంటుంది. ఇవి నాడీ వ్యవస్థను చురుకుగా ఉంచుతాయి. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతాయి. బాదం, వాల్ నట్స్ వంటి గింజలను తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. ఇన్ఫ్లమేషన్  తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. బాదంలో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం లు పుష్కలంగా ఉంటాయి. వాల్ నట్స్ లో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఇనుము, ఫైబర్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది సహజ స్వీటెనర్ గా కూడా పనిచేస్తుంది. ఉదయం, సాయంత్రం స్నాక్స్ కు గింజలను జోడించడం వల్ల మీ బాడీ వెచ్చగా ఉంటుంది. శరీర శక్తి స్థాయిలు కూడా పెరుగుతాయి. 

click me!