రోజంతా అలసిపోకుండా పనిచేయాలంటే.. ఉదయం ఈ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లను తప్పకుండా తినండి..

First Published Oct 18, 2022, 9:54 AM IST

రోజంతా పనిచేయాలంటే ఒంట్లో శక్తి ఉండాలి. ముఖ్యంగా మీరు తినే బ్రేక్ ఫాస్ట్ లో ఎక్కువ పోషకాలు ఉండాలి. అప్పుడే మీరు రోజంతా తాజాగా ఉంటూ.. ఎనర్జిటిక్ గా పనిచేస్తారు.
 

కొంతమంది రాత్రిళ్లు కడుపు నిండా తిన్నా.. ఉదయం నిద్ర లేవగానే బద్దకంగా, అలసిపోయినట్టుగా భావిస్తారు. దీనికి కారణం మీరు తినే ఆహారంలో పోషకాలు లేకపోవడం. పోషకాల లోపంతోనే ఒంట్లో శక్తి కరువు అవుతుంది. ఇక పొద్దు పొద్దున్నే అలసిపోయినట్టుగా ఉంటే.. ఏ పనిచేయాలనిపించదు. ఇలా కాకూడదంటే.. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ ఫుడ్, నెమ్మదిగా శోషించుకోబడిన పిండి పదార్థాలు, పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ హెల్తీది అయి ఉండాలి. అంటే మీరు తినే ఫుడ్ లో పోషకాలు ఎక్కువగా ఉండాలి. ఇవే మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుతాయి. ఇందుకోసం ఎలాంటి బ్రేక్ ఫాస్ట్ లు తినాలో తెలుసుకుందాం పదండి.. 

బాదం వెన్న ఓట్  మీల్

బాదంలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. వీటిలో కొవ్వు ఉన్నప్పటికీ.. హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఇది. బాదం వెన్నలో మోనోశాచురేటెడ్ కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. అయితే దీన్ని కొనేటప్పుడు వీటిలో ట్రాన్స్ ఫ్యాట్స్, చక్కెరలు ఉన్నాయేమో చూడండి. ఒకవేళ ఉంటే కొనకండి. 

ఓట్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అలాగే రోజంతా మిమ్మల్ని యాక్టీవ్ గా కూడా ఉంచుతుంది. ఇది మీరు బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. 


గ్రీకు పెరుగు పార్ఫైట్స్

గ్రీకు పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియ సరిగ్గా పనిచేయని వారికి ఇది బాగా పనిచేస్తుంది. ఇది బద్దకాన్ని వదిలిస్తుంది. గ్రీకు పెరుగులో మీ గట్ ఆరోగ్యాన్ని మెరుపరిచే బ్యాక్టీరియా ఉంటుంది. గ్రీకు పెరుగులో ఓట్స్, రకరకాల బెర్రీలు, గ్రానోలా, బాదం, పియర్స్, విత్తనాలు, పైనాపిల్, అరటి, కొబ్బరి మొదలైనవి వేసుకుని తింటే.. మీకు ఎన్నో పోషకాలు అందుతాయి. ఇవి మీ కడుపును నింపడమే కాదు.. మిమ్మల్ని హెల్తీగా, ఎనర్జిటిక్ గా ఉంచుతాయి. 
 

egg

గుడ్లు

బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లను తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే గుండ్లలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఒక గుడ్డులో 75 కేలరీలు, 5 గ్రాముల మంచి కొవ్వు, 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. గుడ్డుకంటే బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఏదీ లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. దీన్ని ఉడికించి లేదా కూరగాయలతో ఆమ్లేట్ వేసుకుని తినొచ్చ. లేదంటే మీకు నచ్చిన విధంగా చేసుకుని తిన్నా మంచిదే.
 

బెర్రీ స్మూతి

బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ, రాస్ప్బెర్రీ, స్ట్రాబెరీలతో చేసిన సూపర్ ఫుడ్ యే బెర్రీ స్మూతి. వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బెర్రీల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎంత తిన్నా ఏమీ కాదు. అయితే తక్కువ కార్బ్, కీటోజెనిక్ ఆహారాన్ని తీసుకునే వాళ్లు బెర్రీలు మితంగా తినొచ్చు. అయితే ఇవి మిడ్ మార్నింగ్ స్నాక్స్ గా కూడా ఉపయోగపడతాయి. బెర్రీ స్మూతీ కోసం బెర్రీలు, ప్రోటీన్ పౌడర్, అరటిపండ్లు, కొన్ని పాలతో తయారుచేయండి. 

చియా ఫుడ్డింగ్

చియా విత్తనాల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. చియా విత్తనాల్లో జిగట ఫైబర్ ఉంటుంది. అంటే ఇవి నీటిని పీల్చుకుని ఉబ్బుతాయి. ఈ ఫైబర్ మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల చియా విత్తనాలను తీసుకోండి. అయితే చియా విత్తనాలను పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు. 

అవొకాడో టోస్ట్

అవొకాడోల్లో విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ సి, ఫోలేట్, విటమిన్ బి, విటమిన్ కె, పొటాషియం కూడా ఉంటాయి. అవొకాడోను హోల్ గ్రెయిన్ టోస్ట్ మీద స్ప్రెడ్ చేయొచ్చు. లేదంటే ఆమ్లెట్ లో కూడా వేయొచ్చు. 

click me!