శరీరంలో విటమిన్ డి స్థాయి పెరగాలంటే ఏం చేయాలి?

First Published Dec 1, 2022, 11:50 AM IST

విటమిన్ డి ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచుతుంది. అలాగే  ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. విటమిన్  డి లోపం వల్ల ఎన్నో రకాల రోగాలొస్తాయని నిపుణులు అంటున్నారు. 
 

మన శరీరానికి విటమిన్ డి చాలా చాలా అవసరం. ఇది మన శరీరంలో ఎముకలను, దంతాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా ఎన్నో విధులను నిర్వహించడానికి సహాయపడుతుంది. మన దేశంలో విటమిన్ డి కి ఎలాంటి లోటు లేకపోయినా.. దేశంలో చాలా మంది ఈ విటమిన్ డి లోపంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ  విటమిన్ డి లోపం ఒక అంటువ్యాధిగా మారిందంటున్నారు నిపుణులు. 

విటమిన్ డి ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే రోగనిరోధక  శక్తిని పెంచడంతో పాటుగా ఇతర విధులను నిర్వహించడానికి శరీరంలో కాల్షియం, భాస్వరంలను ఉపయోగిస్తుంది. అయితే పలు సర్వేల ప్రకారం.. ఈ విటమిన్ డి లోపం మగవారికంటే ఆడవారిలోనే ఎక్కువగా ఉందని ఉందని కనుగొన్నారు. 
 

విటమిన్ డి లోపం వల్ల తరచుగా అంటువ్యాధుల బారిన పడుతుంటారు. అలాగే ఎముక సాంద్రత కోల్పోతుంది. రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా తయారవుతుంది. బోలు ఎముకల వ్యాధి వస్తుంది. అలసట, నిద్రలేమి వంటి సమస్యలకు విటమిన్ డి లోపం కారణమతుందని నిపుణులు చెబుతన్నారు. తరచుగా అలసిపోవడం, నిరాశ వంటి సమస్యలకు విటమిన్ డిలోపం కూడా ఒక కారణమేనంటున్నారు నిపుణులు. 


శరీరంలో తక్కువ విటమిన్ డి ఉన్న ఆడవారు ఎక్కువగా నిరాశ, తీవ్రమైన అలసట సమస్యలను ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు. 
 


విటమిన్ డి ఎందుకు ముఖ్యమైంది

ఈ విటమిన్ డి ఎముకల ఆరోగ్యంతో పాటుగా గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలను రక్షించడానికి కండరాలను బలోపేతం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విటమిన్ మన మానసిక స్థితిని కూడా మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుంది. ఇది పేగుల నుంచి కాల్షియం శోషించుకోబడి.. ఎముకకు తీసుకెళ్తుంది. అక్కడ అది పేరుకుపోతుంది. దీంతో ఎముక బలంగా మారుతుంది. ఇది ఎముక కణజాలాలను, బలమైన ఎముకలను తయారుచేయడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
 

Vitamin D

విటమిన్ డి దంతాల అభివృద్ధికి కూడా సహాయపడుతుంది. అలాగే గుండెకు సంబంధించిన వ్యాధులు, బోలు ఎముకల వ్యాధులు వంటి కొన్ని రకాల వ్యాధులను నిరోధిస్తుంది. బహుళ సోరియాసిస్, డయాబెటీస్ మెల్లిటస్ వంటి సమస్యలను కూడా నివారిస్తుంది. 

ప్రస్తుతం వాయు కాలుష్యం దారుణంగా పెరిగిపోతోంది. దీనివల్ల శ్వాసనాళ సంక్రామ్యత, బ్రోన్కైటిస్, న్యూమోనియా వంటి ఎన్నో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ ఇన్ఫెక్షన్లు విటమిన్ డిలోపం వల్ల కూడా రావొచ్చంటున్నారు నిపుణులు. ఈ విటమిన్ లోపం వల్ల ఆడవారిలో  మూడ్ స్వింగ్స్, హార్మోన్లలో హెచ్చుతగ్గులు కూడా రావొచ్చు. 
 

30 ఏండ్ల తర్వాత శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే ఎన్నో తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడొచ్చు. రుతువిరతి సమయంలో లేదా రుతువిరగా దాటిన 10  ఏండ్ల తర్వాత.. ఆడవారిలో ఎముకల నష్టం వేగంగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం హార్మోన్లు. దీనికి తోడు విటమిన్ డిలోపం ఉంటే ఈ సమస్య మరింత దిగజారుతుంది. ఇది ఒక్క ఆడవారిలోనే కాదు వృద్ధుల్లో కూడా కలుగుతుందని  నిపుణులు చెబుతున్నారు. ఇది వీరిలో కండరాల బలాన్ని నియంత్రిస్తుంది. 

గర్భిణుల్లో విటమిన్ డి లోపం ఉంటే.. వారిలో రక్తపోటు దారుణంగా పెరుగుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ డయాబెటీస్ కు దారితీస్తుంది. ఈ విటమిన్ డి లోపం సెరోటోనిన్, ఆడ్రినలిన్ వంటి వంటి మెదడు హార్మోన్లను నియంత్రిస్తుంది. మన శరీరంలో విటమిన్ స్థాయిలు పెరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఉదయాన్నే ఒక 30 నిమిషాల పాటు సూర్యరశ్మిలో కూర్చుంటే విటమిన్ డి అందుతుంది. సూర్యరశ్మి నుంచి చర్మం తగినంత విటమిన్ డిని శోషించుకోవడానికి లేతరంగు దుస్తులను ధరించాలని నిపుణులు చెబుతున్నారు. 

సాల్మన్, పాల ఉత్పత్తులు, పుట్టగొడుగులు, ట్యూనా, కాడ్ లివర్ ఆయిల్, గుడ్డులోని పచ్చసొన, రొయ్యలు, కొన్ని రకాల తృణధాన్యాల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకుంటే మీ శరీరానికి అవసరైన విటమిన్ డి అందుతుంది. 

మీ శరీరంరలో విటమిన్ స్థాయిని తెలుసుకోవడానికి సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా చెకప్ చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.  

click me!