
రోజూ గ్లాస్ పాలు తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు మటుమాయం అవుతాయని నిపుణులు సలహానిస్తుంటారు. క్రమం తప్పకుండా పాలను తాగడం వల్ల ఎముకలు, దంతాలు బలంగా తయారవుతాయి. అయితే రోజూ పాలను తాగడం అంటే కాస్త విసుగ్గా అనిపిస్తుంది. అందుకే పాలను టేస్ట్ గా మార్చడానికి ఎన్నో సిరప్ లను మిక్స్ చేస్తుంటారు. అయితే వాటికి బదులుగా పాలకు అల్లాన్ని జోడించడం వల్ల పాలు రుచిగా అవడంతో పాటుగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. పాలలో అల్లాన్ని మిక్స్ చేసి తాగడం వల్ల ఎన్నో రోగాలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండేనే.. ఎన్నో రోగాల ప్రమాదం తగ్గుతుంది. ఒక రకంగా చెప్పాలంటే శరీరానికి ఇవి రక్షణ కవచంగా పనిచేస్తాయి. కాగా అల్లం రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. కొంత మొత్తంలో రోజూ అల్లాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు.
అల్లం పాలు రోగనిరోధక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపడం వల్ల శరీరానికి హాని చేసే బ్యాక్టీరియా నశిస్తుంది. అల్లం పాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అంతర్గత ఫ్రీ రాడికల్స్ నుంచి మనల్ని రక్షిస్తాయి. దీంతో మీరు ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంటారు.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది
అల్లం జీర్ణవ్యవస్థకు మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అల్లం గ్యాస్, ఎసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్, మలబద్దకం, కడుపు నొప్పి ఎన్నో సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అల్లం పాలను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకుంటే జీర్ణ సమస్యలన్నీ తగ్గిపోతాయి.
బోలు ఎముకల వ్యాధి ప్రమాదం తగ్గుతుంది
వయసు పెరిగే కొద్ది ఎముకల బలం తగ్గుతుంది. అయితే అల్లం పాలు తాగితే ఎముకల బలం పెరుగుతుంది. పాలలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఎముక బలహీనతను తొలగించడానికి సహాయపడుతుంది.
పాలలో అల్లాన్ని కలిపి తాగడం వల్ల ఎముకలకు అదనపు బలం వస్తుంది. వాపు సమస్యలు కూడా తగ్గిపోతాయి. ముఖ్యంగా అంటువ్యాధులు సోకే ప్రమాదం తగ్గుతుంది. 40 సంవత్సరాల వయస్సు దాటిన వారు ప్రతి రోజూ అల్లం పాలను తాగడం వల్ల బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది
ఏండ్ల నుంచి అల్లం ను నొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తూ వస్తున్నారు. మోకాలికి ఆస్టియో ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించే గుణం అల్లంలో ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అల్లం టీ తాగితే కండరాల నొప్పులు, పీరియడ్స్ తిమ్మిరి, తలనొప్పి, వంటి ఇతర నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.
గొంతు నొప్పి నుంచి ఉపశమనం
గొంతునొప్పి ని తగ్గించడంలో అల్లం పాలు బాగా పనిచేస్తాయి. జ్వరం, జలుబు, దగ్గు వంటివి గొంతు సంక్రామ్యత, నొప్పికి దారితీస్తాయి. దీంతో తినడానికి, తాగడానికి, మాట్లాడటానికి ఇబ్బంది కలుగుతుంది. అందుకే గొంతు నొప్పి ఉన్న వాళ్లు అల్లం పాలను తీసుకుంటే ఉపశమనం పొందుతాయి.
ఒక గ్లాస్ అల్లం పాలను తాగితే ఎలాంటి గొంతు సమస్యలైనా తొలగిపోతాయి. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను ఈ సమస్యను తొలగించడానికి సహాయపడతాయి. అందుకే అల్లం పాలను క్రమం తప్పకుండా తాగుతుండూ ఉండండి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.