దగ్గు, జలుబు రాకూడదన్నా.. అవి తొందరగా తగ్గాలన్నా.. ఈ చిట్కాలు తప్పక పాటించండి..

First Published Oct 23, 2022, 12:52 PM IST

మారుతున్న సీజన్ లో దగ్గు, జలుబు, జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్లు రావడం సర్వ సాధారణం. అయితే కొన్ని ఆహారాలను తీసుకుంటే ఈ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఒకవేళ ఇవి వచ్చినా.. తొందరగా తగ్గిపోతాయి.  

చలికాలం స్టార్ట్ అయ్యింది. ఇంకేముంది ఇక ఇప్పటి నుంచి వైరల్ ఇన్ఫెక్షన్లు సోకడం షురూ అవుతాయి. వీటిని ఆపకపోతే దగ్గు, జబులు, వైరల్ ఫీవర్ తో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. వీటిని నివారించడానికి ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ.. కొన్ని ఆహారాలను తిన్నా దగ్గు, జలుబు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఒక వేళ ఇవి ఉన్నా.. తొందరగా తగ్గిపోతాయి. 

మారుతున్న ఈ సీజన్ లో వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించాలంటే.. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండాలి. ఇందుకోసం  పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినాలి. ఇవే దగ్గు, జలుబుతో పోరాడటానికి సహాయపడతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఎలాంటి ఆహారాలను తినాలో తెలుసుకుందాం పదండి. 

సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్లను తింటే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిని రెగ్యులర్ గా తిన్న వారికి వైరస్ తో పోరాడే శక్తి  లభిస్తుంది. ఇందుకోసం నిమ్మరసం, ఆరెంజ్, బొప్పాయి పండ్లతో పాటుగా సీజనల్ పండ్లను కూడా తినండి. పుల్లగా ఉండే ఈ పండ్లలో విటమిన్ సి తో పాటుగా విటమిన్ బి కూడా పుష్కలంగా ఉంటుంది. దానిమ్మ, జామ పండ్లను తప్పకుండా తినండి. 
 

పాలు

గుడ్లలాగే పాలు కూడా సంపూర్ణ ఆహారం. ఎందుకంటే దీనిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ప్రతిరోజూ రెండు గ్లాసుల వేడి పాలను తాగితే వైరల్ సంక్రామ్యత తగ్గుతుంది. పాలలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. దీనిలో ప్రోటీన్లు, ఫాస్పరస్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటే సంక్రమణ ప్రమాదం అంత తక్కువగా ఉంటుంది. 

గుడ్లు

గుడ్డును సూపర్ ఫుడ్ అంటారు. ఎందుకంటే గుడ్డులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ డి, మైక్రో న్యూట్రియంట్స్, విటమిన్ బి 12, మాంగనీస్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఎముకలను కూడా బలంగా ఉంచుతాయి. ఇవి శరీర బలాన్ని కూడా పెంచుతాయి. రోజూ రెండు ఉడకబెట్టిన గుడ్లను తింటే దగ్గు, జలుబు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఒకవేళ ఇవి ఉన్నా.. తొందరగా తగ్గిపోతాయి. 
 

click me!