బరువు తగ్గాలని నానా ప్రయత్నాలు చేసే వారు చాలా మందే ఉన్నారు. రోజుకు ఒకపూట మాత్రమే తినడం, ఇష్టమైన ఆహారాలకు దూరంగా ఉండటం, జిమ్ముల్లో గంటల తరబడి వ్యాయామం చేయడం లాంటి పనులను చేస్తుంటారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు వ్యాయామంతో పాటుగా పుష్కలంగా పోషకాహారం తీసుకుంటూ.. పరిగడుపున జీరా వాటర్ ను తాగితే తొందరగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.
జీలకర్రలో వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా అనేక పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. జీలకర్ర కలిపిన నీటిని ఉదయం పరిగడుపున తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ వాటర్ జీర్ణక్రియ పనితీరును మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. కడుపునకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్య నుంచి బయటపడటానికి ఇది దివ్య ఔషదంలా పనిచేస్తుంది.
జీరా వాటర్ గ్యాస్ట్రిక్, పొత్తికడుపు నొప్పి వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. వ్యాయామంతో పాటుగా ప్రతిరోజూ జీరా వాటర్ ను తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ తొందరగా తగ్గిపోతుంది.
టీస్పూన్ జీలకర్రలో.. సుమారు 20 నుంచి 21 గ్రాముల జీలకర్ర ఉంటుంది. దీనిలో కేవలం 8 కేలరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి జీలకర్ర వాటర్ ను తాగడం వల్ల మీ శరీరంలోకి అదనపు కొవ్వులు ప్రవేశించే అవకాశమే ఉండదు. జీలకర్రలో ఆల్డిహైడ్, థైమోల్, ఫాస్ఫరస్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించే కారకాలుగా పనిచేస్తాయి. జీరా వాటర్ బరువున తగ్గించడంతో పాటుగా శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది.
మసాలా దినుసుల్లో ఒకటైన జీలకర్రను మనం ప్రతి వంటలోనూ ఉపయోగిస్తుంటాం. ఇది కూరలను రుచిగా చేయడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది.
జీలకర్రలో ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ జీలకర్ర నీటిని తాగడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అయితే చాలా మంది ఐరన్ లోపంతో రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. అయితే ప్రతిరోజూ ఈ జీరా వాటర్ ను తాగడం వల్ల రక్తహీనత సమస్య కొంత వరకు తగ్గుతుంది.
జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ రక్షణకు సహాయపడతాయి. జీరావాటర్ ను తాగడం వల్ల ముఖంపై ఉండే నల్లని మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి. అంతేకాదు చర్మాన్ని కూడా మృదువుగా చేయడంలో సహాయపడుతుంది.