తలలోకి పేలు ఎలా వస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా.? చాలా మందికి తెలిసి ఉండ‌దు

Published : Nov 27, 2026, 04:04 PM IST

Head Lice: తలలో పేలు సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతుంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే అసలు పేలు ఎక్కడి నుంచి వస్తాయి? ఒకరి తల నుంచి మరొకరి తలకు ఎలా చేరుకుంటాయి? జుట్టులోనే ఎందుకు నివసిస్తాయి? తెలుసుకుందాం.

PREV
15
పేలు ఎలా పుడతాయి? వాటి జీవిత చక్రం ఇదే

తలలో పేలు వాటంతట అవే పుట్టుకురావు. ఆడ పేను పెట్టే గుడ్ల నుంచి కొత్త పేలు అభివృద్ధి చెందుతాయి. ఈ గుడ్లను నిట్స్ (Nits) అంటారు. ఇవి జుట్టు కుదుళ్లకు దగ్గరగా గట్టిగా అంటుకుని ఉంటాయి. సాధారణంగా 7 నుంచి 10 రోజుల్లో గుడ్ల నుంచి చిన్న పేలు బయటకు వస్తాయి. ఆ తర్వాత అవి క్రమంగా పెరిగి పెద్ద పేలుగా మారతాయి. ఒక ఆడ పేను రోజుకు సుమారు 6 నుంచి 10 గుడ్లు పెట్టగలదు. అందుకే ప్రారంభంలోనే గుర్తించి తొలగించకపోతే వాటి సంఖ్య వేగంగా పెరుగుతుంది. పేలు సాధారణంగా మనుషుల తలపై 30 రోజుల వరకు జీవించగలవు. ఈ సమయంలో తలపై గుడ్లు పెట్టి తమ సంతానాన్ని అభివృద్ధి చేస్తాయి.

25
మనిషి రక్తమే పేలకు ప్రధాన ఆహారం

పేలు చాలా చిన్న పరిమాణంలో ఉండే పరాన్నజీవులు. ఇవి మనిషి తల చర్మంపై నివసిస్తూ రక్తాన్ని పీల్చుకుని జీవిస్తాయి. రోజులో పలుమార్లు తల చర్మాన్ని కుట్టి రక్తాన్ని ఆహారంగా తీసుకుంటాయి. ఈ క్రమంలో వాటి లాలాజలం వల్ల కొందరిలో అలర్జీ ప్రతిచర్య ఏర్పడి దురద మొదలవుతుంది. పేలు ఎక్కువగా ఉన్నప్పుడు తలపై గోకడం వల్ల గాయాలు ఏర్పడవచ్చు. కొన్నిసార్లు ఆ గాయాలకు ఇన్ఫెక్షన్లు కూడా సోకే ప్రమాదం ఉంటుంది. అయితే పేలు ఉండటం అనేది వ్యక్తిగత పరిశుభ్రత లోపానికి సంకేతం కాదు. శుభ్రంగా ఉండేవారికి కూడా ఇవి వ్యాపించవచ్చు.

35
ఒకరి తల నుంచి మరొకరికి ఎలా వ్యాపిస్తాయి?

పేలు వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం తలలు లేదా జుట్టు నేరుగా తాకడం. ముఖ్యంగా పిల్లలు కలిసి ఆడుకునేటప్పుడు, ఒకరినొకరు దగ్గరకు తీసుకున్నప్పుడు ఇవి సులభంగా ఒకరి జుట్టు నుంచి మరొకరి జుట్టులోకి చేరుతాయి. పేలు ఎగరలేవు, దూకలేవు. వాటికి రెక్కలు కూడా ఉండవు. అయితే వెంట్రుకలను గట్టిగా పట్టుకుని పాకగలవు. అందువల్ల తలలు దగ్గరగా వచ్చినప్పుడు కొత్త వ్యక్తి జుట్టులోకి చేరుకుంటాయి. దువ్వెనలు, టోపీలు, తువ్వాళ్లు వంటి వస్తువులను పంచుకోవడం ద్వారా కూడా అరుదుగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. పిల్లలు పాఠశాలల్లో, ఆటస్థలాల్లో ఎక్కువమందితో కలిసిమెలిసి ఉండటం వల్ల వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే పొడవాటి జుట్టు ఉండటం ఒక్కటే పేలు రావడానికి కారణం కాదు.

45
పేలు మనుషుల తలపైనే ఎందుకు జీవిస్తాయి?

పేలు మనుషుల రక్తాన్ని ఆహారంగా తీసుకుంటూ జీవించడానికి ప్రత్యేకంగా అనుకూలంగా అభివృద్ధి చెందాయి. తలపై ఉండే ఉష్ణోగ్రత, జుట్టు మధ్య లభించే రక్షణ వీటి మనుగడకు అనుకూలంగా ఉంటాయి. అందుకే ఇవి మనిషి తలపై ఎక్కువగా కనిపిస్తాయి. పరిశోధనల ప్రకారం మానవ పరిణామ క్రమంలో పేల జాతులు కూడా మార్పులకు లోనయ్యాయి. కొన్ని పేల జాతులు శరీర వెంట్రుకలతో సంబంధం కలిగి ఉండగా, తల పేలు ప్రత్యేకంగా తల వెంట్రుకల్లో నివసిస్తాయి. గొరిల్లాలు, చింపాంజీల వంటి ప్రైమేట్లలోనూ వాటికి సంబంధించిన వేర్వేరు పేల జాతులు కనిపిస్తాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మనుషుల తల పేలు కుక్కలు, పిల్లులపై జీవించలేవు. అలాగే వాటి నుంచి మనుషులకు తల పేలు వ్యాపించవు. ఇవి ప్రధానంగా మనిషి నుంచి మనిషికే సంక్రమిస్తాయి.

55
తలలో పేలను పూర్తిగా తొలగించడం ఎలా?

పేలు సమస్యను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే చికిత్స తీసుకోవడం మంచిది. ఇందుకోసం చక్కటి పళ్లున్న పేల దువ్వెన (Fine-toothed nit comb) ఉపయోగపడుతుంది. తడి జుట్టుకు కండిషనర్ రాసి, చిన్న చిన్న భాగాలుగా విడదీసి కుదుళ్ల నుంచి చివర్ల వరకు జాగ్రత్తగా దువ్వాలి. ఇలా చేయడం వల్ల పేలు, వాటి గుడ్లను తొలగించవచ్చు. అవసరమైతే వైద్యులు సూచించిన ప్రత్యేక యాంటీ లైస్ లోషన్లు, షాంపూలను ఉపయోగించవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల తలలను కూడా పరిశీలించాలి. దువ్వెనలు, టోపీలు, తువ్వాళ్లను ఇతరులతో పంచుకోకూడదు. చికిత్స చేసిన తర్వాత కూడా పేలు ఉన్నాయేమో పరిశీలిస్తూ ఉండాలి. తీవ్రమైన దురద, గాయాలు లేదా చికిత్స చేసినా సమస్య తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలి.

Read more Photos on
click me!

Recommended Stories