కుల దేవుడిని మరువకూడదు..
గతంతో పోలిస్తే ఇప్పుడు వంశాలు, గోత్రాలను పట్టించుకోవడం తగ్గిపోయింది. కానీ గరుడ పురాణం ప్రకారం ప్రతి వంశానికి ఒక కులదేవత లేదా దేవుడు ఉంటారు. పూర్వీకుల కాలం నుంచి పూజిస్తున్న ఆ దైవాన్ని ఎన్నటికీ మరువకూడదు. ప్రతిరోజూ కులదేవుడిని మనస్ఫూర్తిగా ధ్యానం చేయాలి. ప్రతిసారీ మూలస్థానానికి వెళ్లడం కుదరకపోయినా, ఎక్కడ ఉన్నా ఆ దేవుడిని ప్రార్థించి తరచుగా దర్శనం చేసుకోవాలి. ఇలా కులదేవుడిని నిత్యం స్మరించుకోవడం వల్ల ఆ కుటుంబానికి, రాబోయే పిల్లలు, మనవళ్ల తరాలకు కూడా అంతా మంచి జరుగుతుందని, ఏడు తరాల వారు సంతోషంగా ఉంటారని గరుడ పురాణం చెబుతోంది.
దేవునికి నిత్య నైవేద్యం సమర్పించడం:
చాలా ఇళ్లలో ఇప్పటికీ దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాతే భుజించే ఆచారం ఉంది. భగవంతునికి నిత్యం అన్నం నైవేద్యంగా సమర్పించి, కుటుంబ సమేతంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల ఆ ఇంట్లో అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. దీనివల్ల ఇంట్లో తిండికి, ధనానికి ఎలాంటి లోటు ఉండదు. అలాగే వంటగదిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుతూ, సాత్విక ఆహారాన్ని తయారు చేసి దేవునికి అర్పించడం మంచిది.