పోర్చుగీస్ కజు మన దేశంలోకి వచ్చే సరికి తెలుగు, హిందీలో కాజుగా మారిపోయింది. కానీ, ప్రాంతాన్ని బట్టి దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి.
కేరళలో: 'పరంజి ఆండి' (Parangi Andi), అంటే విదేశీ లేదా పోర్చుగీస్ కాయ అని అర్థం.
బెంగాల్‌లో: దీనిని 'హిజ్లీ బాదం' (Hijli Badam) అని పిలిచేవారు. పోర్చుగీసు వారు మొదట ఈ కాయను నాటిన రేవు పట్టణం పేరుమీద దీనికి ఆ పేరు పెట్టారు.
తమిళనాడులో: దీనిని 'ముందిరి' (mundiri) అని పిలుస్తారు.
ఫ్రెంచ్‌లో: 'అకాజు' అనే పేరు ఉండగా, అది తర్వాత ఇంగ్లీషులో 'కాష్యూ' గా మారింది.
ఒకప్పటి పేదవాడి పంట.. ఇంత ఖరీదైనదిగా ఎలా మారింది?
మొదటి 100 ఏళ్ల పాటు జీడిపప్పును ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. అది బంజరు భూముల్లో పెరిగేది కాబట్టి, అదొక 'పేదవాడి పంట' గానే పరిగణించేవారు. కేవలం నేల కోతను ఆపడానికి మాత్రమే దీనిని ఉపయోగించేవారు. కాలం గడుస్తున్నకొద్దీ... ఆ చెట్ల కాయల నుంచి వచ్చిన గింజ ఎంత రుచిగా ఉందో ప్రపంచానికి తెలిసింది. అలా అడవిలో పుట్టి.... మన మట్టిని కాపాడిన ఈ కాయ.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల స్వీట్లు, వంటల్లో చేరింది. వాటికి రుచితో పాటు... రిచ్ నెస్ కూడా తీసుకువచ్చింది. దాదాపు 450 ఏళ్ల క్రితం బ్రెజిల్ నుంచి మన దేశంలోకి అడుగుపెట్టిన ఈ విదేశీ మొక్క ఇప్పుడు.. మన దేశం మొత్తం పాతుకుపోయింది. అన్ని రకాల వంటల్లోనూ భాగమైంది.