Water Tank: చలికాలంలో ఇంటి మీద ఉన్న వాటర్ ట్యాంక్ లోని నీళ్లు చల్లగా మారుతాయి. ఆ నీరు చల్లగా మారకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ఈ చిట్కాల ద్వారా నీళ్లు చల్లగా మారకుండా గోరువెచ్చగా ఉంటాయి.
చలికాలం వచ్చిందంటే చల్లటి నీటితో స్నానం చేయడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా ఇంటి పైకప్పుపై ఉండే వాటర్ ట్యాంకుల్లో నీళ్లు రాత్రికి బాగా చల్లగా మారుతాయి. ఉదయం నిద్రలేచిన తర్వాత ఆ నీటితో స్నానం చేయాలంటేనే భయపడతారు. గీజర్ లేని ఇళ్లలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. గీజర్ ఉన్నా ప్రతిరోజూ వాడితే కరెంట్ బిల్లు పెరుగుతుందని కొందరు ఆలోచిస్తారు. అయితే కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే వాటర్ ట్యాంకులోని నీళ్లు త్వరగా చల్లగా మారకుండా చూసుకోవచ్చు. ఇందుకోసం ఖరీదైన వస్తువులు కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతోనే ఈ పని చేయవచ్చు. ముందుగా వాటర్ ట్యాంక్ చుట్టూ థర్మాకోల్ షీట్లు అమర్చుకోవాలి. ఇవి బయట చల్లటి గాలి ప్రభావం ట్యాంకుపై పడకుండా కొంతవరకు అడ్డుకుంటాయి. ట్యాంకులో ఉన్న వేడి త్వరగా బయటకు పోకుండా తోడ్పడతాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.
23
బబుల్ ర్యాప్, పాత దుప్పట్లతో..
ఇంట్లో పార్సిల్ వస్తువులతో పాటు వచ్చే బబుల్ ర్యాప్ ఉంటే దాన్ని పడేయకండి. వాటర్ ట్యాంక్ చుట్టూ రెండు, మూడు పొరలుగా చుట్టవచ్చు. ఇందులో ఉండే చిన్న చిన్న గాలి పొరలు వేడి బయటకు వెళ్లకుండా అడ్డుకుంటాయి. దీంతో నీళ్లు ఎక్కువసేపు గోరువెచ్చగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ట్యాంక్ పైభాగంలో రాత్రిపూట పాత దుప్పటి, మందపాటి గుడ్డ లేదా టార్పాలిన్ కప్పవచ్చు. వీలైతే చిన్న షెడ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చల్లటి గాలి, మంచు ప్రభావం నేరుగా ట్యాంకుపై పడదు. అయితే ట్యాంక్ మూతను మాత్రం గట్టిగా మూసి ఉంచాలి. నీటిలోకి దుమ్ము, ఇతర వ్యర్థాలు చేరకుండా జాగ్రత్త పడాలి.
33
ట్యాంక్ రంగు కూడా..
వాటర్ ట్యాంక్ రంగు కూడా నీటి ఉష్ణోగ్రతపై కొంత ప్రభావం చూపుతుంది. నలుపు, ముదురు నీలం, ముదురు గోధుమ రంగులు సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహిస్తాయి. దీంతో పగటిపూట ట్యాంక్ కొంత వేడిని పొందుతుంది. ట్యాంక్ పెట్టే స్థలం మార్చుకునే అవకాశం ఉంటే రోజంతా ఎండ పడే చోట ఏర్పాటు చేసుకోవచ్చు. పగటిపూట సూర్యరశ్మి వల్ల నీరు కొంత వెచ్చబడుతుంది. రాత్రి ఆ వేడి త్వరగా తగ్గకుండా ఉండేందుకు ట్యాంకును మందపాటి గుడ్డతో కప్పాలి. అయితే ఈ చిట్కాలు నీటిని వేడి చేయవు. నీరు త్వరగా చల్లబడకుండా మాత్రమే తోడ్పడతాయి. మరీ వేడినీళ్లు కావాలంటే గీజర్ లేదా ఇతర సురక్షితమైన నీటి వేడి పరికరాలు వాడటం మంచిది.