అత్యంత ధనిక రాజకుటుంబం
తన సుదీర్ఘ పాలనతో పాటు అసాధారణ ఆస్తి, విలాసవంతమైన జీవనశైలికి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారు బ్రూనై సుల్తాన్ హస్సనల్ బోల్కియా. సుమారు $50 బిలియన్ల ఆస్తి, 7,000 కంటే ఎక్కువ లగ్జరీ కార్ల కలెక్షన్‌తో, భూమిపై అత్యంత ధనిక రాజకుటుంబాలలో ఒకరిగా ఉన్నారు. 1984లో బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత బ్రూనై గద్దెనెక్కారు. ప్రపంచంలో మిగిలి ఉన్న కొద్దిమంది రాజులలో ఒకరిగా ఉన్నారు.
తన విలాసవంతమైన జీవనశైలికి పేరుగాంచిన సుల్తాన్ హస్సనల్ బోల్కియా 1946 జూలై 15న సుల్తాన్ హాజీ ఒమర్ అలీ సైఫుద్దీన్ III, రాణి పత్ని పెంగిరాన్ అనక్ దామిత్ దంపతులకు జన్మించారు. చిన్న వయస్సులోనే తన తండ్రి వారసుడిగా ఎంపికయ్యారు. ఆగస్టు 1968లో బ్రూనై 29వ సుల్తాన్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ఆయన వయస్సు 21 సంవత్సరాలు. దశాబ్దాలుగా తన ఆస్తి, శక్తి, విలాసవంతమైన జీవనశైలికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
సుల్తాన్ బ్రూనై ప్రధానమంత్రిగా కూడా పనిచేస్తున్నారు. దీంతో పాటు అనేక ఇతర ఉన్నత ప్రభుత్వ పదవుల్లోనూ ఉన్నారు. బ్రూనై ఆగ్నేయాసియాలోని బోర్నియో ద్వీపంలో ఉన్న ఒక చిన్న దేశం. ఈ దేశం చమురు వనరులతో నిండి ఉంది. సుల్తాన్ ఆస్తి కూడా అదే విధంగా పెరిగింది. దేశం చిన్నదే అయినప్పటికీ తన చమురు నిల్వల కారణంగా ఆర్థికంగా బలంగా ఉంది. బ్రూనై ప్రపంచంలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న టాప్ 5 దేశాలలో ఒకటి.
దేశాభివృద్ధి కోసం విద్యా, ఆరోగ్యం, సామాజిక అభివృద్ధి వంటి వాటికి భారీగా ఖర్చు చేస్తారు. ఇక్కడ ప్రజలకు ఆరోగ్య సేవలు పూర్తిగా ఉచితం. ఇక్కడ 400 మిలియన్ డాలర్లు కేవలం ఆరోగ్య సంరక్షణపైనే ఖర్చు చేస్తారు. ఇక్కడి ప్రజలు వ్యక్తిగతంగా ఎంత సంపాదించినా పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ పన్ను ఉంది. అందులో కూడా విదేశీ పెట్టుబడులపై పన్ను ఉంది. రాయితీ కూడా ఇస్తారు.
సుల్తాన్ ఆస్తికి అత్యంత ప్రసిద్ధ చిహ్నం ఇస్తానా నూరుల్ ఇమాన్ ప్యాలెస్. దీనిని నిర్మించడానికి దాదాపు 2550 కోట్లు ఖర్చయ్యాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైన ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నివాస ప్యాలెస్. ఈ ప్యాలెస్‌లో 1,778 గదులు, 257 బాత్రూమ్‌లు, ఐదు స్విమ్మింగ్ పూల్స్, ఒక గ్రాండ్ మసీదు, ఒక పోలో మైదానం, 110 కార్లు ఉంచగలిగే ఒక పెద్ద గ్యారేజ్ కూడా ఉన్నాయి.
సుల్తాన్ బోల్కియాకు కార్లంటే మహా పిచ్చి. ఆయన వ్యక్తిగత సేకరణలో 7,000 కంటే ఎక్కువ కార్లు ఉన్నాయి. అందులో 500 రోల్స్ రాయిస్ కార్లు మాత్రమే ఉన్నాయి. దీనితో పాటు ఆయన వద్ద 300 ఫెరారీ, బెంట్లీ, BMW, మెర్సిడెస్, జాగ్వార్ కార్లు ఉన్నాయి. ఇప్పటివరకు తయారైన ఐదు మెక్‌లారెన్ F1 LM కార్లలో మూడు అరుదైన మోడళ్లు కూడా ఉన్నాయి. సుల్తాన్ వ్యక్తిగత రోల్స్ రాయిస్ బంగారంతో తయారై ఉంటుంది. అది రోజంతా 24 గంటలు ఆన్‌లోనే ఉంటుంది.
కార్లతో పాటు సుల్తాన్ వద్ద ప్రైవేట్ విమానాల సముదాయం కూడా ఉంది. అందులో బోయింగ్ 747-400 కూడా ఉంది. దీన్ని కూడా బంగారంతో చేయించారు. ప్రైవేట్ జెట్, హెలికాప్టర్లు ఆయన విలాసవంతమైన జీవనశైలికి మరో ఉదాహరణ.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాజు తన జుట్టు కత్తిరించుకోవడానికి లండన్ నుంచి బ్రూనైకి తన అభిమాన క్షౌరకుడిని విమానంలో పిలిపిస్తారు. దీనికి ఒక్కోసారి దాదాపు 20,000 డాలర్లు ఖర్చు చేస్తారు. దీనితో పాటు సుల్తాన్‌కు ఒక ప్రైవేట్ జూ కూడా ఉంది. అందులో 30 బెంగాల్ టైగర్లు ఉన్నాయి. వివిధ రకాల పక్షి జాతులు కూడా ఉన్నాయి.
ఒకసారి సుల్తాన్ తన భార్య పుట్టినరోజును ఘనంగా జరిపారు. దీని కోసం ఆయన ఎయిర్‌బస్‌ను కొనుగోలు చేశారు. కుమార్తె పుట్టినరోజును కూడా ఘనంగా జరిపారు. విదేశీ అతిథులు వచ్చి కార్యక్రమాలు చేశారు. వారికి కోట్లాది రూపాయలు ఇచ్చారు. అంతేకాదు కుమార్తె పెళ్లి రెండు వారాల పాటు జరిగింది. పెళ్లి కోసం దేశమంతటా సెలవు ప్రకటించారు. మైఖేల్ జాక్సన్, బ్రిట్నీ స్పియర్స్ వంటి అనేక మంది కళాకారులు కార్యక్రమాలు చేశారు.
2014లో షరియా చట్టం గురించి శిక్షాస్మృతిని విధించడంపై వివాదం తలెత్తింది. అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు రావడంతో చట్టాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇలాంటి చిన్న చిన్న వివాదాలు ఉన్నప్పటికీ ఈ దేశం తన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూ వస్తోంది. ఇక్కడి ప్రజలు ఉన్నత స్థాయి జీవితాన్ని గడుపుతున్నారనడంలో సందేహం లేదు.