Nalla Fry: పండగలు వచ్చాయంటే గొర్రెలు, మేకలను దేవతలకు బలి ఇస్తారు. గొర్రె లేదా మేక రక్తంతో వేపుడు చేసుకుని తింటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని భావిస్తారు. మరి మేక రక్తం లేదా గొర్రె రక్తం వేపుడు మన ఆరోగ్యానికి ఏం చేస్తుంది?
నల్ల ఫ్రై.. దీన్నే మేక రక్తం వేపుడు లేదా గొర్రె రక్తం వేపుడు అని పిలుస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని చాలా ఇష్టంగా తింటారు. రాగిసంకటితో నల్లఫ్రై కాంబినేషన్ అదిరిపోతుందని చెప్పుకుంటారు. ఈ నల్ల ఫ్రై తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు లేదా ఆరోగ్య లాభాలు ఉంటాయో మాత్రం చాలా మందికి తెలియదు. నిజానికి ఇలా మేక రక్తం లేదా గొర్రె రక్తం తినడం ఆరోగ్యానికి మంచిదే. దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి హిమోగ్లోమిన్ స్థాయిలను పెంచి రక్తహీనత సమస్య రాకుండా అడ్డుకుంటుంది. అలాగే ప్రోటీన్, విటమిన్ బి 12, జింక్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఇందులో అధికంగా ఉంటాయి.
24
ఈ సమస్యలు ఉన్న వారు తినాలి
రక్తహీనత, తీవ్రంగా అలసి పోయేవారు, నీరసంగా ఉండేవారు, బలహీనంగా ఉండేవారు, తీవ్ర ఇనుము లోపంతో ఉన్న మహిళలు ఇలా నల్ల ఫ్రై చేసుకుని తింటే మంచిదని అంటారు. ఇది శరీరానికి శక్తిని అందించడంతోపాటు కండరాలను కూడా బలోపేతం చేస్తుంది. పూర్వకాలంలో అధికంగా శ్రమ చేసే రైతులు, కూలీలు ఇలా నల్ల ఫ్రై వండుకొని తినేవారని అంటారు. అప్పట్లో పండుగల సమయంలో కచ్చితంగా దీన్ని వండుకుని తింటారు. ఇది ప్రత్యేక వంటకంగా కూడా చెప్పుకుంటారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని తినేవారు ఎంతో మంది ఉన్నారు.
34
ఎలా వండాలి?
మేక రక్తాన్ని ఎలా వండాలి అన్నది కూడా తెలుసుకోవాలి. దీన్ని బాగా ఉడికించిన తర్వాతే తినాలి. పచ్చి రక్తం శరీరంలోకి చేరడం చాలా ప్రమాదకరం. ఈ రక్తంలో ఉప్పు, మిరియాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి సహజ మసాలాలను వేసి వండితే రుచిగా ఉంటుంది. అంతేకాదు త్వరగా జీర్ణం అవుతుంది. అయితే దీంతో పాటు అతిగా నూనె లేదా కారం వాడకుండా ఉండడం మంచిది. అలా అని అధికంగా మాత్రం తినకూడదు. మేక రక్తంలో ఇనుము అత్యధికంగా ఉంటుంది. కాబట్టి నల్ల ఫ్రై అధిక మొత్తంలో తీసుకుంటే శరీరంలో ఇనుము మోతాదు పెరిగిపోతుంది. దీనివల్ల కడుపునొప్పి, మలబద్ధకం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. కొందరిలో అలెర్జీ కూడా కనిపించవచ్చు. మితంగా తింటే ఔషధంలా భావించే ఈ నల్ల ఫ్రై అప్పుడప్పుడు మాత్రమే తినాలి.
దీన్ని కొంతమంది తినడం మంచిది కాదు. మేక రక్తం అందరికీ సరిపడదు. బీపీ, గుండె జబ్బులు సమస్యలతో ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండే వారు కూడా మేక రక్తం తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాలేయం సంబంధిత వ్యాధులు ఉన్నవారు కూడా దీనికి దూరంగా ఉండాలి. ఇక చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు కూడా తినకపోవడం మంచిది. యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడే వారికి ఈ మేక రక్తం హానికరంగా మారే అవకాశం ఉంది. అయితే దీన్ని రోజు తినడం ఏ మాత్రం మంచిది కాదు. నాకు రక్తం అనేది ఒక సాంప్రదాయ ఆహారం. దీన్ని చాలా తక్కువగా తింటేనే ఉత్తమం. కొన్నిసార్లు మీకున్న ఆరోగ్య సమస్యలను బట్టి వైద్యుల సలహా తీసుకొని ఆ తర్వాత తింటే మంచిది.