
ప్రస్తుత కాలంలో చాలా మంది డయాబెటీస్ బారిన పడుతున్నారు. ఈ వ్యాధిని అలాగే వదిలేస్తే ఎన్నో ప్రమాదకరమైన రోగాలొచ్చే అవకాశం ఉంది. గుండెజబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధులు, దృష్టి సమస్యలు మొదలైన అనేక వ్యాధులు రావడానికి మధుమేహం కూడా ఒక కారణమేనంటున్నారు నిపుణులు.
అయితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల కొంతమందిలో మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. శరీరంలోని కణాలు రక్తంలో గ్లూకోజ్ ను ఉపయోగించకుంటే మూత్రపిండాలు రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇది ఏండ్ల తరబడి కొనసాగితే.. మూత్రపిండాలు దెబ్బతింటాయి. అందుకే మధుమేహులు తమ మూత్రపిండాల ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే.. అది ఇతర అవయవాల పనితీరును ప్రభావితం చేస్తుంది. షుగర్ పేషెంట్లు తమ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
రక్తంలో చక్కెర నియంత్రణ
రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే మూత్రపిండాల వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గేందుకు ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. మెడిసిన్స్ ను వాడాలి. క్రమం తప్పకుండా షుగర్ లెవెల్స్ ని చెక్ చేసుకోవాలి. ఇది చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే ప్రతి మూడు నెలలకు ఒకసారి వైద్యుడిని సంప్రదించాలి.
రక్తపోటు నియంత్రణ
చాలా మంది షుగర్ పేషెంట్లకు రక్తపోటు కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఈ అధిక రక్తపోటు మూత్రపిండాల వ్యాధి వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. అందుకే డయాబెటీస్ పేషెంట్లు బీపీ నియంత్రణలో ఉంచుకోవాలి. 130/80 కంటే తక్కువ బీపీ ఉంటే ఎలాంటి సమస్యా రాదు.
పొగాకు దూరంగా ఉండాలి
ధూమపానం శరీరాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పొగాకు ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మూత్రపిండాలకు రక్త ప్రవాహం నెమ్మదిస్తుంది. పొగాకు వాడకం వల్ల గుండె జబ్బులు వస్తాయి. మూత్రపిండాల వ్యాధి కూడా వస్తుంది. అందుకే పొగాకు ఉత్పత్తులను ఉపయోగించకండి.
ఉప్పు
ఉప్పును మోతాదుకు మించి తీసుకుంటే అధిక రక్తపోటు నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది బరువును కూడా పెంచుతుంది. అంతేకాదు ఉప్పు మూత్రపిండాలను కూడా దెబ్బతీస్తుంది. ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది.అందుకే ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి. అప్పుడే మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
శీతల పానీయాలు
సాధ్యమైనంత వరకు కోలాలతో సహా కృత్రిమ శీతల పానీయాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు స్వీట్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. మీ రోజు వారి ఆహారంలో ఎక్కువ శాఖాహార ఆహారాలను చేర్చుకోండి. క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కూడా మూత్రపిండాల ఆరోగ్యం బాగుంటుంది.
శారీరక శ్రమ ఎన్నో అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది . ప్రతిరోజూ కాసేపు వ్యాయామం చేయడం వల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.