
ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలడం, తెల్ల వెంట్రుకలు, డ్రై హెయిర్ వంటి వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ జుట్టు సమస్యలను తగ్గించేందుకు నూనెలను, షాంపూలను మార్చడం, ఇంటి చిట్కాలను ఫాలో అవ్వడం చేస్తుంటారు. నిజానికి జుట్టు సమస్యలు రావడానికి ప్రధాన కారణం సంరక్షణ సరిగ్గా లేకపోవడమే అంటున్నారు నిపుణులు.
జుట్టు సంరక్షణ విషయానికి వస్తే నూనె చాలా రకాల జుట్టు సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. నూనె వల్ల జుట్టుకు పోషణ అందుతుంది. దీంతో జుట్టు మూలాలు బలంగా అయ్యి వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. పొడుగ్గా పెరుగుతుంది కూడా. అయితే కొంతమంది జుట్టుకు కొబ్బరి నూనె బెస్ట్ అంటే మరికొంతమంది ఆముదం నూనెనే బెస్ట్ అని అంటుంటారు.
నేటికీ జుట్టుకు కొబ్బరి నూనెను వాడేవారు చాలా మంది ఉన్నారు. మార్కెట్ లోకి రకరకాల నూనెలు వస్తున్నా.. కొబ్బరి నూనెనే వాడుతున్నారు. ఎందుకంటే ఇది మన జుట్టుకు అంత మేలు చేస్తుంది. ఈ నూనెలో లారిక్ యాసిడ్, విటమిన్ ఇ, విటమిన్ కె, ఐరన్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా మెండుగా ఉంటాయి.
జుట్టు బాగా పెరుగుతుంది: కొబ్బరి నూనె జుట్టు పొడుగ్గా పెరగడానికి కూడా సహాయపడుతుంది. ఇందుకోసం కొబ్బరి నూనెను తలకు పెట్టి కొద్దిసేపు బాగా మర్దన చేయాలి. దీన్ని కొద్దిసేపు వదిలేయాలి. దీంతో నెత్తిమీద రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది మీ జుట్టు పొడుగ్గా పెరగానికి సహాయపడుతుంది.
జుట్టు ఊడిపోయే సమస్య నుంచి బయటపడటానికి కూడా కొబ్బరి నూనె సహాయపడుతుంది. ఇందుకోసం కొబ్బరి నూనెను వేడి చేయండి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకి బాగా పట్టించి కాసేపు మసాజ్ చేయాలి.
గంట తర్వాత తలస్నానం చేయండి. కొబ్బరి నూనె మన జుట్టుకు పోషణను అందించి జుట్టును బలంగా చేయడానికి సహాయపడుతుంది. అలాగే దీనిలోని లక్షణాలు జుట్టును సాఫ్ట్ గా, ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే జుట్టు పొడిబారే అవకాశం కూడా తగ్గుతుంది.
కొబ్బరి నూనెను జుట్టుకు పెట్టడం వల్ల జుట్టు నేచురల్ గా మెరుస్తుంది. అలాగే చుండ్రు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ నూనె సన్నగా ఉన్న జుట్టుకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టును బలంగా చేయడానికి సహాయపడుతుంది.
ఆముదం నూనెను ఎన్నో ఏండ్ల నుంచి జుట్టుకు వాడుతున్నారు. కానీ చాలా తక్కువ మంది దీన్ని పెట్టుకుంటారు. కానీ ఈ నూనె జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. దీనిలో రిసినోలిక్ యాసిడ్, విటమిన్-ఇ , ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి నెత్తిమీద రక్తప్రసరణను మెరుగుపరిచి జుట్టు సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి.
పొడవైన జుట్టు
ఆముదం నూనెను ఉపయోగించి పొట్టి జుట్టును పొడుగ్గా పెరిగేలా చేయొచ్చు. ఈ నూనె తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీంతో జుట్టు మూలాలు బలంగా అవుతాయి. దీనివల్ల మీ జుట్టు ఫాస్ట్ గా పెరగడం మొదలవుతుంది.
జుట్టు రాలడం తగ్గుతుంది
ఆముదం నూనె జుట్టు రాలడాన్ని తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి నెత్తిమీద అలెర్జీ, వాపు వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఆముదం నూనెను జుట్టుకు పెట్టడం వల్ల తేమగా ఉంటుంది.
అలాగే సాఫ్ట్ గా అవుతుంది. ఈ నూనెతో పొడి జుట్టు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు తల చర్మాన్ని శుభ్రంగా ఉంచేందుకు సహాయపడతాయి. స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. చాలా సన్నగా, దెబ్బతిన్న జుట్టు ఉన్నవారికి ఆముదం నూనె బెస్ట్.
బలహీనమైన జుట్టు, వెంట్రుకలు ఎక్కువగా రాలే సమస్యలు ఉన్నవారికి కొబ్బరి నూనె మంచిది. జుట్టు పొడుగ్గా పెరగాలనుకునే వారికి ఆముదం నూనె మంచిది. నిజానికి ఈ రెండు నూనెల్లో ఉండే లక్షణాలు జుట్టుకు ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు ఈ రెండు నూనెలను మిక్స్ చేసి కూడా పెట్టొచ్చు. ఇలా పెట్టినా మీ జుట్టు బలంగా ఉంటుంది. పొడుగ్గా, మందంగా పెరుగుతుంది.