Best Night Foods: రాత్రిపూట తీసుకునే ఆహారం మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. చాలామంది రాత్రిపూట ఏదో ఒకటి తినేస్తుంటారు. కానీ పడుకునే ముందు తేలికగా జీర్ణమయ్యే ఫుడ్స్ తినడం మంచిది. ఆరోగ్యానికి మేలు చేస్తూ, మంచి నిద్రకు సహాయపడే బెస్ట్ ఫుడ్స్ ఏంటో చూద్దాం
మనలో చాలామంది ఉదయం, మధ్యాహ్నం ఆహారంపై శ్రద్ధ పెట్టినా, రాత్రిపూట ఏం తింటున్నామన్న విషయాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే నిపుణుల ప్రకారం రాత్రి సమయంలో తీసుకునే ఆహారం నిద్ర నాణ్యత, జీర్ణక్రియ, బరువు నియంత్రణ, హార్మోన్ల సమతుల్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే రాత్రి.. తేలికగా జీర్ణమై, శరీరానికి పోషకాలు అందించే ఆహారాలను ఎంపిక చేసుకోవడం ముఖ్యం. అలాంటి కొన్ని ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
25
ఇవి తింటే సమస్యలు
నిపుణుల ప్రకారం రాత్రి భోజనం ఎప్పుడూ మితంగా తినాలి. ముఖ్యంగా పడుకునే సమయానికి కనీసం రెండు గంటల ముందు భోజనం పూర్తి చేయడం మంచిది. రాత్రి ఎక్కువగా మసాలా, ఆయిల్, ఫ్రై చేసిన పదార్థాలు తీసుకుంటే అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు రావచ్చు. నిద్ర కూడా సరిగా పట్టకపోవచ్చు. అందుకే రాత్రిపూట శరీరానికి తేలికగా ఉండే ఆహారాలకే ప్రాధాన్యం ఇవ్వాలి.
గోరువెచ్చని పాలు
రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం మంచి నిద్రకు సహాయపడుతుంది. అలాగే పాలలో చిటికెడు పసుపు కలిపి తాగితే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. రాత్రి సమయంలో ఒక అరటి పండు తినడం కూడా మంచిదే. ఇందులో ఉండే మెగ్నీషియం, పొటాషియం కండరాలను రిలాక్స్ చేసి నిద్రను మెరుగుపరుస్తాయి.
35
ఓట్స్
ఓట్స్ కూడా రాత్రిపూట తీసుకోవడానికి మంచి ఆహారంగా నిపుణులు సూచిస్తున్నారు. ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్ కడుపు నిండిన భావన కలిగిస్తాయి. దీంతో అర్ధరాత్రి ఆకలి వేయడం తగ్గుతుంది. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రణలో ఉంటాయి. కొద్దిగా పాలు, డ్రై ఫ్రూట్స్‌తో ఓట్స్ తీసుకుంటే మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది.
పెరుగు
రాత్రి సమయంలో పెరుగు కూడా శరీరానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే పెరుగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే చల్లగా కాకుండా సాధారణ ఉష్ణోగ్రతలో తీసుకోవడం మంచిది. కొద్దిగా జీలకర్ర పొడి కలిపి పెరుగు తింటే గ్యాస్ సమస్యలు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
సూప్స్ కూడా రాత్రి భోజనానికి మంచి ఎంపిక. ముఖ్యంగా వెజిటబుల్ సూప్ లేదా చికెన్ సూప్ తేలికగా జీర్ణమవుతూ శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. క్యారెట్, బీన్స్, టమాట, పాలకూర వంటి కూరగాయలతో చేసిన సూప్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవి తక్కువ కేలరీలతో ఉండటం వల్ల బరువు నియంత్రణకు కూడా సహాయపడతాయి.
డ్రై ఫ్రూట్స్
డ్రై ఫ్రూట్స్‌లో బాదం, వాల్ నట్స్ కూడా రాత్రి సమయంలో పరిమిత మోతాదులో తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే మంచి కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.
55
జంక్ ఫుడ్స్ వద్దు
కొంతమంది రాత్రి సమయంలో ఆకలి వేస్తే జంక్ ఫుడ్, చిప్స్, కూల్‌డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి ఆరోగ్యానికి హానికరం. వీటిలో ఉండే అధిక ఉప్పు, చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్ బరువు పెరగడమే కాకుండా గుండె సమస్యలకు కూడా కారణమవుతాయి.
అలాగే కాఫీ, టీ వంటి కెఫిన్ అధికంగా ఉండే డ్రింక్స్ ని రాత్రి ఆలస్యంగా తీసుకోవద్దని సూచిస్తున్నారు. ఇవి నిద్రను భంగం చేసే అవకాశం ఉంది. అలాగే రాత్రిపూట ఎక్కువగా తినడం కూడా మంచిది కాదు. తక్కువగా కానీ పోషకంగా తినాలి. ముఖ్యంగా డయాబెటిస్, బీపీ, థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నవారు తమ ఆహారపు అలవాట్లపై మరింత శ్రద్ధ పెట్టాలి. అవసరమైతే డైటీషియన్ సలహా తీసుకుని వ్యక్తిగత డైట్ ప్లాన్ ఫాలో అవడం మంచిది.