
వయసు పెరుగుతున్న కొద్దీ జీవక్రియ మందగిస్తుది. కండరాల బలం తగ్గిపోతుంది. ముఖ్యంగా హార్మోన్లలో హెచ్చు తగ్గులు వస్తాయి. ఫలితంగా శరీర బరువు పెరగడం, మూడ్ స్వింగ్స్ వంటి ఎన్నో అనారోగ్య సమస్యలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కొవ్వుకు కరిగించే సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి, శరీర శక్తి స్థాయిలను పెంచడానికి, ఎన్నో రోగాల ప్రమాదాల్ని తగ్గించుకోవడానికి కొన్ని ఆహారాలు మీకు ఎంతో సహాయపడతాయి.
యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న ఆహారాలను తినడం వల్ల మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆకలి, ఆకలి కోరికలను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, కంటినిండా నిద్రపోవడం, ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉండదు. 40 ఏండ్లు వచ్చాక ఎక్కడలేని రోగాలన్నీ చుట్టుకుంటాయి. అందుకే ఈ వయసులో మీ ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాలనే తినాల్సి ఉంటుంది. ఈ 40 ఏండ్ల వయసులో ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ వయసులో ఆరోగ్యకరంగా బరువు తగ్గుతూ.. ఆరోగ్యకరమైన ఆహారాలను తింటూ.. లైఫ్ స్టైల్ మెరుగ్గా ఉండాలంటే ఏం చేయాలంటే జస్ట్ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలనే తినాలి. ఇందుకోసం మీరు ఎన్నో పరిమితులను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సమతుల్య ఆహారం తింటే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. ముఖ్యంగా పోషకాలు ఎక్కువగా ఉండే వాటినే తినాలి. పోషకాల లోపంతోనే సర్వ రోగాలు వచ్చే అవకాశం ఉంది. మీ ఆహారంలో తప్పకుండా ఉండాల్సిన పోషకాలు ఏంటంటే..
ప్రోటన్
మన శరీరానికి ప్రోటీన్లు అవసరం కాదు అత్యవసరం. ఇవి కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. ఎందుకంటే ఇవి ఫైబర్ మాదిరిగానే.. మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. తొందరగా ఆకలి కానీయవు. ఇందుకోసం గుడ్లు, మాంసం, పౌల్ట్రీ, పాడి, బీన్స్, చిక్కుళ్లు వంటివి తినండి. వీటిని మీరోజు వారి ఆహారంలో చేర్చుకుంటే మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.
విటమిన్లు, ఖనిజాలు
విటమిన్లు, ఖనిజాలు లేకుండా మీ శరీరం సరిగ్గా పనిచేయదు. అందుకే పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, బీన్స్, గుడ్లు, తృణధాన్యాలు, చేపలు, షెల్ఫిష్ వంటి ఆహారాలను తినండి. వీటిద్వారా మీ శరీరానికి అవసరమైన సూక్ష్మపోషకాలు అందుతాయి.
ఆరోగ్యకరమైన కొవ్వులు
మన శరీరం సరిగ్గా పనిచేయడానికి పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు చాలా చాలా అవసరం. ఇవి గుండె జబ్బులు, డయాబెటీస్, ఊబకాయంతో సహా ఎన్నో రోగాల ప్రమాదాల్ని తగ్గిస్తాయి. ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు ఆలివ్ ఆయిల్, కొవ్వు చేపలు, అవకాడోలు, ఆలివ్, గింజలు, గింజల నూనెలో పుష్కలంగా ఉంటాయి. శరీరం ద్వారా విటమిన్ల శోషణను నిర్ధారించడానికి ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవడం చాలా ముఖ్యం.
ఫైబర్
ఫైబర్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ఇది జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. వీటిని తినడం వల్ల మీ కడుపు తొందరగా నిండుతుంది. అలాగే ఆకలి కోరికలు కూడా తగ్గుతాయి. మొత్తంగా ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లుు, బీన్స్, తృణధాన్యాలు, ఇతర ఆహారాల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.