Bathukamma 2023
పూల పండుగ బతుకమ్మ పండుగ ఆడవారికి ఎంతో ప్రత్యేకమైంది. ఈ పండుగకు ఆడవాళ్ల సంబురం అంతా ఇంతా ఉండదు. తీరొక్క పూలతో ఆడపిల్లలను ముస్తాబు చేసినట్టే బతుకమ్మను ఎంతో ఒద్దికగా బతుకమ్మను తీర్చిదిద్దుతారు. ఈ పండుగను తెలంగాణలో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగకు రాష్ట్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. సంవత్సరాలుగా తెలంగాణ సాంస్కృతిక గుర్తింపుతో ఈ పండుగను విడదీయరాని సంబంధం ఉంది. బతుకమ్మ అంటే 'అమ్మవారు సజీవంగా వస్తుంది' అని అర్థం.
Bathukamma 2023
బతుకమ్మ పండుగను వర్షాకాలం చివరలో జరుపుకుంటారు. ప్రకృతి అందించే సమృద్ధికి ఈ పండుగ సంకేతం. మహాలయ అమావాస్య రోజున ప్రారంభమయ్యే ఈ పండుగను తొమ్మిది రోజుల పాటు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. సద్దుల బతుకమ్మగా పిలువబడే బతుకమ్మ చివరి రోజు దసరకు రెండు రోజుల ముందే వస్తుంది. సద్దుల బతుకమ్మ రోజు ఆడవారంతా పెద్ద పెద్ద బతుకమ్మలను తయారుచేసి దగ్గరలోని చెరువులో నిమజ్జనం చేస్తారు.
ఈ పండుగ మొదలైన ఐదు రోజుల్లో ఆడవారంతా వాకిలిని ఆవుపేడతో అలుకుతారు. బియ్యం పిండితో అందమైన ముగ్గులను వేసి రంగులు వస్తారు. ఇక సద్దుల బతుకమ్మ రోజైతే మగవారు బయటకు వెళ్లి గునుగు, 'తంగేడు, చామంతి వంటి తీరొక్క పువ్వులను తీసుకొస్తారు. వీటితో తాంబాలంలో గోపురాకారంలో బతుకమ్మను పేర్చుతారు. బతుకమ్మను తయారు చేయడం ఒక జానపద కళ. దీనిని ఎంతో జాగ్రత్తగా తయారు చేస్తారు. ఆ తర్వాత ఇంటి దేవత ముందు పెట్టి పూజ చేస్తారు. సాయంత్రం ఆడవాళ్లు కొత్తబట్టతో అందంగా ముస్తాబయ్యి బతుకమ్మను ఇంటి ముందు పెట్టి బతుకమ్మ పాటలు చెప్పుకుంటూ ఆడుతారు. ఆ తర్వాత బతుకమ్మలను తలపై పెట్టుకుని దగ్గరలోని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత రకరకాల నైవేద్యాలను కూడా ఒకరికొకరు పంచుకుంటారు.
అయితే ఇప్పటికే బతుకమ్మ మొదలయ్యి మూడు రోజులు గడిపోయింది. ఇప్పటికి మనం ఎంగిలి బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మను జరుపుకున్నాం. ఈ రోజు నాలుగో రోజు. కాబట్టి ఈ రోజు మనం నానెబియ్యం బతుకమ్మను జరుపుకోబోతున్నాం. ఈ రోజు గునును పూలు, తంగేడు, బంతి అంటూ రకరకాల పువ్వులతో బతుకమ్మను తయారుచేస్తారు. ఈ రోజు నానబెట్టిన బియ్యం, బెల్లంతో లేదా చక్కెరతో చేసిన ముద్దలను వాయనంగా పెడతారు.అందుకే ఈ రోజుకు నానెబియ్యం బతుకమ్మ అని పేరు వచ్చిందంటారు.