
ఎన్ని నెలలున్నా పాడైపోకుండా ఉండే కూరగాయ ఏదైనా ఉందా అంటే అది ఒక్క బూడిద గుమ్మడికాయే అని చెప్పాలి. దీనిని శీతాకాలపు పుచ్చకాయ అని కూడా అంటారు. ఇవి సాధారణంగా సంవత్సరం పొడవునా కాస్తాయి. ఈ కూరగాయతో గుమ్మడికాయ కూర, సాంబార్, గుజ్జు వంటి వివిధ రకాల వంటకాలను తయారుచేసుకోవచ్చు.
దీని రుచి దోసకాయ లాగే ఉంటుంది. దీన్ని భారతదేశంతో పాటుగా చైనాలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. బూడిద గుమ్మడికాయలో పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. దీన్నిస్మూతీలు, జ్యూస్ లు, స్మూతీలు, సలాడ్ ల రూపంలో ఆహారంలో చేర్చుకోవచ్చు.
కొన్ని బూడిద గుమ్మడికాయ ఆరోగ్య ప్రయోజనాలు
పోషకాలు సమృద్ధిగా ఉంటాయి
దీనిలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే జింక్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి. విటమిన్ సి, నియాసిన్, రిబోఫ్లేవిన్, థయామిన్ వంటి విటమిన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంతేకాదే దీనిలో ఆల్కలాయిడ్లు,టానిన్లు, గ్లైకోసైడ్లు, ఫినాల్స్, ఫ్లేవనాయిడ్లు వంటి ఫైటోకెమికల్స్ కూడా అధికంగా ఉంటాయి.
బరువు తగ్గేందుకు సహాయపడుతుంది
దీనిలో నీటి కంటెంట్ ఎక్కువగా ఉండి.. కేలరీలు మాత్రం తక్కువగా ఉంటాయి. దీనిలో డైటరీ ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ ఫైబర్ కంటెంట్ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. ఆహార కోరికలను కూడా తగ్గిస్తుంది. దీంతో మీ బరువు తగ్గే ప్రాసెస్ వేగవంతం అవుతుంది.
జీర్ణక్రియకు మంచిది
బూడిద గుమ్మడి కాయ జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. దీనిలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది గట్ ఆరోగ్యానికి చాలా మంచిది. కరిగే ఫైబర్ వల్ల మంచి బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. అలాగే మలబద్దకం, అజీర్థ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. హేమోరాయిడ్స్ కూడా తగ్గుతాయి. అల్సర్లు, హైపర్ ఎసిడిటీ, డైస్పెప్సియా వంటి సమస్యలను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యానికి మంచిది
బూడిద గుమ్మడికాయలో పొటాషియం, సోడియం కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అయితే సోడియంతో పోలిస్తే పొటాషియమే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మెదడుకు మంచిది
ఆయుర్వేదం ప్రకారం.. బూడిద గుమ్మడి కాయ మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే దీనిలో ఉండే ఫోలేట్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి సహాయపడుతుంది. ఇది మెదడు ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా ఉంచుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలుంటాయని కొంతమంది రిశోధకులు కనుగొన్నారు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి.
మొత్తం మీద బూడిద గుమ్మడికాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఉండే ఎన్నో రకాల పోషకాలు ఎన్నో ఆరోగ్య రుగ్మతలకు చికిత్స చేయడానికి సహాయపడతాయి. ఇది డయాబెటీస్ పేషెంట్ల శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను నియింత్రణలో ఉంచుతుంది. అలాగే జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా జలుబు, ఆస్తమా, సైనసైటిస్ సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే దీనిలో శరీరాన్ని చల్లబరిచే గుణాలుంటాయి.