
మన ఆరోగ్యాన్ని నిర్ణయించేది మనం తీసుకునే ఆహారమే. ఈ సంగతి దాదాపుగా అందరికీ తెలుసు. కానీ నిర్లక్ష్యంగా నాకేమవుతుందిలే అని అనారోగ్యకరమైన ఆహారాలను తింటే ఎన్నో రోగాలు, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందులోనూ కొన్ని రోగాలకు నేటికీ మందులే లేవు. అందులో క్యాన్సర్ ఒకటి. దీని నుంచి ప్రాణాలతో బయటపడటం అంత సులువు కాదు. అయితే కొన్ని రకాల ఆహారాలు మాత్రం ఎన్నో రోగాల ప్రమాదాలను తగ్గిస్తాయి. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది కూడా.
Breast Cancer India ప్రకారం.. భారతీయ మహిళలు చాలా మటుకు రొమ్ము క్యాన్సర్ మహమ్మారి బారిన పడుతున్నారు. కాగా ప్రతి 4 నిమిషాలకు ఒకరు రొమ్ము క్యాన్సర్ బారిన పడితే.. ప్రతి 8 నిమిషాలకు ఒకరు రొమ్ము క్యాన్సర్ తో చనిపోతున్నారట.
కుటుంబ చరిత్ర, జన్యు పరంగా, ఊబకాయం, ఇతర మార్పు చెందని ప్రమాద కారకాలతో పాటుగా జీవన శైలి కూడా రొమ్ము క్యాన్సర్ బారిన పడేస్తుందని పరిశోధనలో తేలింది. అందులోనూ కొన్ని రకాల ఆహారాలు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని 20 శాతం పెంచుతాయని తాజా అధ్యయనం తేల్చేసింది.
అనారోగ్యకరమైన మొక్కల ఆధారిత ఆహారం తినే మహిళలలే ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని ఫ్రెంచ్ వైద్యులు చెబుతున్నారు.
Nutrition 2022 Live Online లో ప్రదర్శించిన ఈ అధ్యయనం ప్రకారం.. అనారోగ్యకరమైన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ పరిశోధన 20 సంవత్సరాలకు పైగా 65,000 మందిపై జరిపి ఒక నిర్ధారణకు వచ్చారు.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 14 శాతం తక్కువగా ఉందని తేలింది. అలాగే అనారోగ్యకరమైన ఆహారాలను తినే మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 20 శాతం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
అనారోగ్యకరమైన ఆహారాల్లో కూరగాయలు కూడా ఉన్నాయి. తగినన్ని పోషకాలు లేని, హాని చేసే కూరగాయలు, మాంసాహారం వంటివి అనారోగ్యకరమైన ఆహారాల జాబితాలోకి వస్తాయి. వీటిని తినడం తగ్గిస్తే చాలా వరకు రొమ్ము క్యాన్సర్ ను నివారించిన వారవుతారు. ముఖ్యంగా కార్భోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం తగ్గించాలి. బంగాళాదుంపలు, స్వీట్ ఐటమ్స్, కొన్ని రకాల పండ్ల రసాలు కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
ఇక కార్బోహైడ్రేట్స్ విషయానికొస్తే.. ఇది ఎక్కువగా ఉండే ఆహారాలను తగ్గించడం వల్ల రొమ్ము క్యాన్సర్ నివారించడంలో సహయపడుతుందని అధ్యయనం తెలియజేస్తుంది.
అయితే కార్భోహైడ్ర్లు మన శరీరానికి చాలా అవసరం. ఇవి కండరాలను సంరక్షించడానికి సహాయపడతాయి. శరీరానికి శక్తిని అందిస్తాయి. జీర్ణవ్యవస్త ఆరోగ్యానికి సహాయపడుతుంది. కొన్ని రకాల కార్భోహైడ్రేట్లు డయాబెటీస్ ను, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
కార్భోహైడ్రేట్ల విషయానికొస్తే.. పిండి పదార్థాలు మూడు రకాలుగా ఉంటాయి. చక్కెరలు, పిండి పదార్థాలు, ఫైబర్. దీనిలో చక్కెరను ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఇక పిండి పదార్థాలను మోతాదులో తీసుకోవాలి. ఫైబర్ అనేది కార్బ్. ఇది శరీరానికి చాలా అవసరం. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది.
డైటరీ సప్లిమెంట్లతో పాటు, కొన్ని జీవనశైలి కారకాలు కూడా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, దీర్ఘకాలిక స్తన్యం ఇవ్వడం, బరువును నియంత్రించడం, మద్యపానాన్ని నియంత్రించడం, ధూమపానం మానేయడం, రేడియేషన్ తగ్గించడం ఇవన్నీ రొమ్ము క్యాన్సర్ ను నిరోధించగలవు.
రొమ్ము క్యాన్సర్ సకాలంలో నిర్దారన అయితే దీనిని చికిత్సతో పూర్తిగా తగ్గించుకోవచ్చు. కానీ ఈ వ్యాధి అంత సులువుగా బయటపడదు. కాబట్టి రొమ్ము క్యాన్సర్ ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో రోగులు, మరణాల రేటుతో క్యాన్సర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ తో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు కనీసం ఒక కొత్త రోగి పుట్టుకొస్తున్నాడని ప్రతి ఎనిమిది నిమిషాలకు కనీసం ఒక రోగి రొమ్ము క్యాన్సర్ తో మరణిస్తున్నారని అంచనా.