మురికి కాలువ కోసం భూమి తవ్వుతుండ‌గా అద్భుతం.. బ‌య‌ట‌ప‌డ్డ‌ రూ. 98 కోట్ల నిధి

Published : Aug 16, 2026, 07:03 PM IST

Viral News: బెల్జియంలో ఓ 18 ఏళ్ల యువకుడికి ఊహించని అదృష్టం ఎదురైంది. సాధారణంగా చేపట్టిన మురుగునీటి కాలువ పనుల్లో భాగంగా భూమిని తవ్వుతుండగా భారీ మొత్తంలో బంగారం, అరుదైన నాణేలు బయటపడ్డాయి. ఇప్పుడీ వార్త నెట్టింట వైర‌ల్ అవుతోంది.

PREV
14
కాలువ తవ్వుతుండగా బయటపడిన భారీ సంపద

బెల్జియంలోని సింట్-గిల్లిస్-డెండర్‌మొండే ప్రాంతంలో మురుగునీటి పైపులను మార్చే పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతం రాజధాని బ్రస్సెల్స్‌కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిర్మాణ పనుల్లో భాగంగా కార్మికులు భూమిని తవ్వుతుండగా అనుకోకుండా ఓ భారీ నిధి బయటపడింది. ఈ సంపదలో బంగారు నాణేలు, బంగారు ముక్కలు, నంబర్లు ఉన్న బంగారు బార్లు ఉన్నాయి. వీటి మొత్తం విలువ సుమారు 9 మిలియన్ యూరోలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సంపద బయటపడటంలో ప్రధాన పాత్ర పోషించింది 18 ఏళ్ల కోబే అనే యువకుడు. సెలవుల్లో తాత్కాలికంగా నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న అతడు.. మంగళవారం తవ్వకాలు జరుగుతున్న సమయంలో ఈ నిధిని గుర్తించాడు.

24
మొదట నాణేలనుకున్నాడు.. చివరకు బంగారు బార్లు అని తెలిసింది

భూమిలో ఏదో వస్తువు కనిపించడంతో కోబే తొలుత వాటిని సాధారణ నాణేలుగా భావించాడు. దగ్గరగా పరిశీలించిన తర్వాత అక్కడ బంగారు బార్ కూడా ఉన్నట్లు గుర్తించాడు. అప్పుడే అక్కడ బయటపడింది సాధారణ వస్తువు కాదని అతడికి అర్థమైంది. ఈ విషయాన్ని అతడు బెల్జియం మీడియాతో పంచుకున్నాడు. మొదట కనిపించినప్పుడు అవి ఒక యూరో నాణేలేమో అనుకున్నానని.. ఆ తర్వాత బంగారు బార్ కనిపించడంతో విషయం చాలా పెద్దదని తెలిసిందని చెప్పాడు. కోబే తన సహచరులతో కలిసి అక్కడ పనిచేస్తున్నాడు. ఇంత భారీ సంపద తమ కళ్ల ముందుకు రావడం వారికి కూడా ఊహించని అనుభవంగా మారింది.

34
19వ శతాబ్దం నాటి భవనం కింద దాచారా?

బయటపడిన నిధి ఓ పురాతన భవనంతో సంబంధం కలిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో 19వ శతాబ్దం చివర్లో బీరు తయారీ వ్యాపారి థియోఫిలస్ వాన్ అస్చే కోసం ఓ భారీ భవనం నిర్మించారు. ఆ భవనంలోని ఓ గోడలో ఇటుకలతో మూసివేసిన నేలమాళిగ ప్రాంతంలో ఈ సంపద దొరికింది. ఓ సంచిలో భద్రపరిచి, గోడలో దాచినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఎవరైనా కావాలనే ఈ బంగారాన్ని అక్కడ రహస్యంగా ఉంచి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతంలో బీరు తయారీ కార్యకలాపాలు 1899లో ప్రారంభమయ్యాయి. అవి 1970 వరకు కొనసాగాయి. ప్రస్తుతం ఆ పురాతన భవనాన్ని పూర్తిగా పునరుద్ధరిస్తున్నారు. సామాజిక సంక్షేమ సంస్థ CAW ఊస్ట్‌-వ్లాండెర్న్ అక్కడ కొత్త కార్యాలయాలు, నివాస సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు పనులు చేపట్టింది.

ఇంత‌కీ బంగారం ఎవ‌రిది.?

భారీ నిధి బయటపడటంతో అధికారులు వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బంగారం, నాణేలను సురక్షిత ప్రాంతానికి తరలించి భద్రపరిచారు. ఇప్పుడు ఈ సంపద అసలు ఎక్కడి నుంచి వచ్చింది? గతంలో ఎవరైనా దాన్ని దొంగిలించి అక్కడ దాచారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంపదపై హక్కు ఎవరికి ఉంటుందన్నది కూడా పెద్ద ప్రశ్నగా మారింది. నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు, ప్రస్తుతం భవనాన్ని పునరుద్ధరిస్తున్న సంక్షేమ సంస్థ, గతంలో ఆ భవనాన్ని కలిగి ఉన్న వాన్ అస్చే కుటుంబ వారసులు.. ఇలా పలువురు తమ హక్కును కోరే అవకాశం ఉంది. అయితే బంగారం నేరాలకు సంబంధించినదా? దొంగతనంతో సంబంధం ఉందా? అనే విషయాలు ముందుగా తేలాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాతే చట్టపరంగా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

44
యువకుడికి మొత్తం బంగారం దక్కుతుందా?

ఇంత భారీ సంపద దొరికిందని తెలిసిన వెంటనే.. దాన్ని గుర్తించిన 18 ఏళ్ల కోబేకు మొత్తం బంగారం దక్కుతుందా అనే ఆసక్తి మొదలైంది. అయితే బెల్జియం చట్టాల ప్రకారం ఈ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోలేరు. నిధికి అసలు యజమాని ఎవరైనా ఉంటే వారు ముందుకు వచ్చేందుకు కనీసం ఐదేళ్ల వరకు వేచి చూడాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆ గడువులో సరైన యజమాని లేదా వారసులు ఎవరూ ముందుకు రాకపోతే తదుపరి చట్టపరమైన ప్రక్రియ ప్రారంభమవుతుంది. తనకు దొరికిన సంపదను దాచుకునే ఉద్దేశం లేదని కోబే కూడా చెప్పాడు. ఇంత పెద్ద మొత్తంలో బంగారం దొరికినప్పుడు దాన్ని అధికారులకు అప్పగించాల్సిందేనని తమకు తెలుసని పేర్కొన్నాడు. అయితే భవిష్యత్తులో తనకు ఏదైనా ఫైండర్ రివార్డ్ లభిస్తుందేమోనని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Read more Photos on
click me!

Recommended Stories