Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. 132 మందికి పైగా మృతి.. వేల మందికి గాయాలు

Published : Aug 11, 2026, 09:06 AM IST

Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. 132 మంది మృతి చెందారు. మరణాలు మరింత పెరిగే అవకాశముంది. వేల మంది గాయపడగా, వీరిలో 570 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించింది.

PREV
15
సెకన్లలో కూలిపోయిన బిల్డింగ్స్.. కొలంబియాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం

కొలంబియా దేశంలో సోమవారం ఉదయం ఒక పెద్ద విషాదం జరిగింది. పశ్చిమ కొలంబియా ప్రాంతాన్ని 7.4 తీవ్రతతో భారీ భూకంపం తీవ్రంగా కుదిపేసింది. దశాబ్ద కాలంలో ఈ స్థాయిలో భూకంపం రావడం ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు కనీసం 132 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది గాయపడ్డారు. వీరిలో 570 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని కొలంబియన్ అసోసియేషన్ ఆఫ్ క్యాపిటల్ సిటీస్ ఈ అధికారిక లెక్కలను వెల్లడించింది.

భూకంపం ధాటికి అనేక భవనాలు క్షణాల్లో నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద ఇంకా అనేకమంది చిక్కుకుపోయారు. వారిని కాపాడటానికి రెస్క్యూ టీమ్‌లు, స్థానిక ప్రజలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పరిస్థితుల తీవ్రతను అర్థం చేసుకున్న ప్రభుత్వం దేశంలో నేషనల్ డిజాస్టర్ ప్రకటించింది. ఆర్మీ సైనికులను రంగంలోకి దించి రెస్క్యూ ఆపరేషన్లను వేగవంతం చేసింది.

25
భూకంప కేంద్రం ఎక్కడ? ఎంత దూరం వ్యాపించింది?

ఈ భారీ భూకంప కేంద్రం పశ్చిమ కొలంబియాలోని శాన్ జోసే డెల్ పాల్మర్ ప్రాంతంలో ఉంది. ఇది రాజధాని బొగోటాకు దాదాపు 150 మైళ్ల దూరంలో ఉండే ఒక వెనుకబడిన ప్రాంతం. అయితే, దీని ప్రభావం రాజధాని బొగోటాలో కూడా చాలా తీవ్రంగా కనిపించింది. పెద్ద శబ్దంతో సైరన్లు మోగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు తీశారు.

ఈ భూకంపం వల్ల దేశంలో 5 ప్రధాన నగరాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా దాదాపు 86 భారీ భవనాలు పూర్తిగా కూలిపోయాయి. అంతేకాకుండా, భద్రతా కారణాల వల్ల 7 విమానాశ్రయాల్లో విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసారు. 20కి పైగా మున్సిపాలిటీలపై ఈ ప్రభావం పడింది. పొరుగున ఉన్న ఈక్వెడార్, పనామా దేశాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి.

35
ఆసుపత్రి భవనాలు ధ్వంసం.. పెరీరా నగరంలో శవాల దిబ్బ

ఈ భూకంపంలో కాలి అనే నగరంలో ఒక ప్రధాన ఆసుపత్రికి చెందిన పిల్లల, నవజాత శిశువుల వార్డులు ఉన్న భవనం కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాలి నగరంలో ముందస్తు జాగ్రత్తగా ప్రముఖ పెట్రోనియో అల్వారెజ్ ఫెస్టివల్‌ను కూడా వాయిదా వేశారు.

అలాగే, పెరీరా నగరంలో పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. అక్కడ ప్లాజా బొలీవర్ వద్ద ఉన్న ఏడు అంతస్తుల భవనం నేలమట్టమైంది. కార్లు శిథిలాల కింద నలిగిపోయాయి. ఒక్క పెరీరా నగరంలోనే 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అధికారులు స్పష్టం చేశారు.

45
కేబుల్ కార్లలో 6 గంటల పాటు చిక్కుకున్న ప్రయాణికులు

పెరీరా నగరంలో కొండ ప్రాంతాల నుంచి సిటీ సెంటర్‌కు ప్రయాణించడానికి కేబుల్ కార్లు వాడుతుంటారు. భూకంపం వచ్చిన సమయంలో కేబుల్ కార్లు గాల్లోనే ఆగిపోయాయి. దాంతో అందులో ఉన్న 16 మంది ప్రయాణికులు సుమారు 6 గంటల పాటు గాల్లోనే భయం భయంగా చిక్కుకుపోయారు.

సహాయక బృందాలు మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. భద్రతా తనిఖీలు పూర్తయ్యే వరకు కేబుల్ కార్ సేవలన్నీ నిలిపివేశారు. మానిజాలెస్ నగరంలో కూడా కేబుల్ కార్ వ్యవస్థ దెబ్బతినడంతో సేవలు ఆపివేశారు.

55
అంతర్జాతీయ సాయం.. సెలబ్రిటీల స్పందన

కొలంబియాలో సహాయక చర్యల కోసం అమెరికా ప్రభుత్వం 15.5 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఆహారం, తాత్కాలిక నివాసాలు, రక్షణ కొరకు ఈ నిధులను ఉపయోగిస్తారు. కొలంబియన్ ప్రెసిడెంట్ అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లా నేరుగా అత్యవసర చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

ప్రసిద్ధ గాయని కరోల్ జి తన 'కాన్ కోరా' ఫౌండేషన్ ద్వారా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. మరో అంతర్జాతీయ పాప్ స్టార్ షకీరా కూడా విచారం వ్యక్తం చేస్తూ బాధితులకు తన సానుభూతి తెలిపారు.

కొలంబియా భూకంపం: జియాలజిస్టులు ఏమంటున్నారు?

భూగర్భ శాస్త్రవేత్తల ప్రకారం.. పసిఫిక్ మహాసముద్రంలోని నాజ్కా ప్లేట్, సౌత్ అమెరికన్ ప్లేట్ కిందకు నెట్టబడటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇది భూమి అంతర్భాగంలో 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతులో జరిగింది. గతంలో వెనిజులాలో వచ్చిన భూకంపాల కంటే ఇది పూర్తిగా వేరైన భూగర్భ ప్రక్రియ అని నిపుణులు వివరించారు.

Read more Photos on
click me!

Recommended Stories