ఈ వ్యాధులు ఉంటే అమెరికాకు నో ఎంట్రీ.. ట్రంప్ మ‌రో వినూత్న నిర్ణ‌యం

Published : Nov 08, 2025, 07:50 AM IST

USA: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ వలసదారులపై కఠిన చర్యలకు దిగారు. ఈసారి ఆరోగ్య పరంగా కొత్త అడ్డంకులను సృష్టిస్తూ వీసా నియమాలను సవరించారు. కొన్ని ర‌కాల వ్యాధులతో బాధపడుతున్న వారికి వీసా జారీని నిరాకరించే నిబంధనలు సిద్ధం చేశారు. 

PREV
15
కొత్త మార్గదర్శకాలతో వీసా ప్రక్రియలో మార్పులు

అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ఎంబసీలు, కాన్సులర్‌ కార్యాలయాలకు కొత్త ఆరోగ్య మార్గదర్శకాలను పంపింది. ఇప్పటివరకు వీసా దరఖాస్తుదారులలో కేవలం అంటు వ్యాధులు ఉన్నాయో లేదో మాత్రమే పరిశీలించేవారు. అయితే ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులను కూడా ఈ జాబితాలో చేర్చారు. దరఖాస్తుదారుల ఆరోగ్య చరిత్రను లోతుగా పరిశీలించి, వారు అమెరికాలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వనరులపై ఆధారపడే అవకాశముందా లేదా అన్నది ఆపై నిర్ణయిస్తారు.

25
ప్రభుత్వానికి ఆర్థిక భారం అన్నదే ప్రధాన కారణం

అధికార వర్గాల ప్రకారం, శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులు, క్యాన్సర్‌, డయాబెటిస్‌, మానసిక వ్యాధులు వంటి సమస్యలతో బాధపడేవారిని చికిత్స చేయడానికి అమెరికా ప్రభుత్వం సంవత్సరానికి లక్షల డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. అంతేకాదు, ఒబెసిటీ కారణంగా ఆస్తమా, హై బీపీ, స్లీప్‌ ఆప్నియా వంటి వ్యాధులు పెరుగుతున్నాయని కూడా నివేదికలు చెబుతున్నాయి. అందుకే ప్రభుత్వంపై అదనపు భారంగా మారే వలసదారులను ముందుగానే నిరోధించాలన్నదే కొత్త పాలసీ ఉద్దేశ్యం.

35
వీసా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు

కొత్త నిబంధనల ప్రకారం వీసా అధికారులు ఇప్పుడు దరఖాస్తుదారుల ఆర్థిక సామర్థ్యాన్ని కూడా పరిశీలించాలి. అంటే — వారు ప్రభుత్వ సాయం లేకుండా వైద్య చికిత్సలు, మందులు, బీమా వంటి ఖర్చులను భరించగలరా లేదా అన్నది నిర్ధారించాలి. దరఖాస్తుదారుల కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా సమీక్షించాలనే ఆదేశాలు ఉన్నాయి. హెల్త్‌ రిస్క్‌ ఉన్నట్లయితే వీసా తిరస్కరణ తప్పదని సూచించారు.

45
వలసదారుల ఆందోళన పెరుగుతోంది

ఇప్పటికే ట్రంప్‌ ప్రభుత్వం వలస విధానాలను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థుల “డ్యురేషన్‌ ఆఫ్‌ స్టే”పై పరిమితి, హెచ్-1బీ వీసాల రుసుమును పెంచడం, గ్రీన్‌ కార్డ్‌ ప్రక్రియను కఠినతరం చేయడం వంటి చర్యలు వలసదారుల్లో భయం, ఆందోళన కలిగించాయి. ఇప్పుడు ఆరోగ్యంపై ఆధారపడి వీసా తిరస్కరణ నిర్ణయం మరింత ప్రతికూలతను కలిగిస్తోంది.

55
అధికారిక స్పందన ఇంకా రాలేదు

ఈ మార్గదర్శకాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. అమెరికా విదేశాంగ శాఖ ఇప్పటివరకు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం, అమెరికాలో వలస వ్యవస్థ మరింత కఠిన దిశగా సాగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories