US Green Card: అమెరికా హెచ్-1బీ వీసాలు, గ్రీన్ కార్డ్ నిబంధనల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ఇకపై అదృష్టం ఆధారంగా కాకుండా నైపుణ్యం, అధిక వేతనం ఉన్నవారికి మాత్రమే ప్రాధాన్యం. ఈ మార్పులు భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్‌పై తీవ్ర ప్రభావం చూపించనున్నాయి.
ప్రపంచ దేశాల్లో అమెరికాకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ దేశంలో పని చేయాలని, అక్కడే స్థిరపడాలని ఎంతో మంది కలలు కంటారు. ప్రతి ఏడాది లక్షలాదిమంది అమెరికాకు వలస వెళ్తుంటారు. అయితే, అమెరికాలో శాశ్వత నివాసం పొందాలంటే గ్రీన్‌కార్డ్ తప్పనిసరి. అమెరికా ప్రభుత్వం మాత్రం చాలా తక్కువ సంఖ్యలో గ్రీన్‌కార్డులు జారీ చేస్తోంది.
ముఖ్యంగా భారత్, చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్ దేశాల వారికి గ్రీన్‌కార్డు పొందడం అంత తేలిక కాదు. ఈ దేశాల వారు ఇప్పటికే ఏళ్ల తరబడి వెయిటింగ్ లిస్టులో ఉండాలి. ఇక ఈ నిబంధనలు మరింత తీవ్రం కానున్నాయి. ఇంతకీ ఆ రూల్స్ ఏంటీ? వాటి వల్ల ప్రవాస భారతీయులు ఎదుర్కొనే సమస్యలేంటీ?
25
లాటరీ విధానం రద్దు
ప్రతి ఏడాది అమెరికాకు వెళ్తున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కానీ గ్రీన్‌కార్డు కోటా పరిమితంగా ఉండటంతో, వారిలో చాలా మందికి శాశ్వత నివాసం కల కలగానే మిగిలిపోతోంది. ఇప్పటికే అమెరికాలో ఐటీ, మెడికల్, ఇంజనీరింగ్ రంగాల్లో పనిచేస్తున్న వేలాది మంది భారతీయులు గ్రీన్‌కార్డు కోసం దీర్ఘకాలంగా వేచి చూస్తున్నారు .
ఈ నేపథ్యంలో అమెరికా వీసా వ్యవస్థలో మరోసారి సంచలనాత్మక మార్పులు రాబోతున్నాయి. హెచ్-1బీ(H-1B) వీసాలు, గ్రీన్ కార్డ్ విషయంలో ప్రస్తుత లాటరీ విధానాన్ని రద్దు చేసి, నైపుణ్యం, వేతనం ఆధారంగా మాత్రమే వీసాలు మంజూరు చేయాలని అగ్ర రాజ్యం అమెరికా భావిస్తోంది.
35
అమెరికన్స్ ఫస్ట్
ఇటీవల అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రస్తుత లాటరీ పద్ధతి రద్దవుతుందని, ఇకపై నైపుణ్యం, వేతనం ఆధారంగానే వీసాలు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. అర్హత కంటే అదృష్టం ఆధారంగా అవకాశాలు రావడం అమెరికా ఉద్యోగ మార్కెట్‌ను దెబ్బతీస్తోందని, దీనివల్ల తక్కువ వేతనం పొందే ఉద్యోగులు ఎక్కువగా ఎంపిక అవుతున్నారని లుట్నిక్ ఆరోపించారు. కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై అధిక వేతనాలు, ఉన్నత నైపుణ్యం ఉన్నవారికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వనున్నారు.
ప్రస్తుత H-1B విధానం అమెరికన్ అవకాశాలు తగ్గుతున్నాయని లుట్నిక్ తీవ్ర విమర్శలు చేశారు. "ఇది ఒక స్కామ్‌గా మారింది. అమెరికన్ ఉద్యోగాలను ముందుగా అమెరికన్లకే ఇవ్వాలి" అని షాకింగ్ కామెంట్స్ చేశారు. గ్రీన్ కార్డ్ వ్యవస్థలో కూడా లోపాలున్నాయని, సగటు అమెరికన్ $75,000 సంపాదిస్తుంటే గ్రీన్ కార్డ్ హోల్డర్ ఆదాయం కేవలం $66,000 మాత్రమేనని తెలిపారు. తక్కువ వేతనం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా 'గోల్డ్ కార్డ్' అనే కొత్త వీసా పథకం కూడా సిద్ధమవుతోందని లుట్నిక్ తెలిపారు. అమెరికాలో కనీసం $5 మిలియన్లు పెట్టుబడి పెట్టే విదేశీయులకు మాత్రమే శాశ్వతంగా ఉండేలా గ్రీన్ కార్డ్ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ గోల్డ్ కార్డు కోసం 2.5 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. దీని ద్వారా $1.25 ట్రిలియన్ల పెట్టుబడులు అమెరికాకు రావచ్చని అంచనా.
55
భారతీయులపై ప్రభావం
H-1B విధానంలో మార్పులు చేస్తే.. భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం జారీ చేసే హెచ్-1బీ వీసాలలో దాదాపు 70% భారతీయులకే దక్కుతాయి. ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం ఎక్కువ వేతనం ఆఫర్ చేసే ఉద్యోగులకు మాత్రమే వీసా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో మిడిల్-లెవల్ ఐటీ ఉద్యోగులు, స్టార్టప్‌లలో పనిచేసే భారతీయులకు ఇది పెద్ద దెబ్బ అనే చెప్పాలి.
నైపుణ్యం ఆధారంగా వీసాలు జారీ చేయడం వల్ల అమెరికాకు ఆర్థికంగా మేలు చేస్తుందనడంలో సందేహం లేదు. కానీ, తక్కువ వేతనంతో అయినా అవకాశం కోసం అమెరికాకు వెళ్ళే వేలాది మంది భారతీయ కుటుంబాలు ఈ కొత్త రూల్స్ వల్ల నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఏళ్ల తరబడి గ్రీన్ కార్డ్ వెయిటింగ్ లిస్టులో ఉన్న భారతీయులు ఇప్పుడు మరింత కష్టాల్లో పడబోతున్నారనే చెప్పాలి.