Tuition Banned: చాలా దేశాల్లో ప్రైవేట్ ట్యూషన్లు పెద్ద పరిశ్రమగా మారిపోయాయి. పిల్లలు మంచి మార్కులు సాధించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఓ దేశంలో మాత్రం ప్రైవేట్ ట్యూషన్లు పూర్తిగా నిషేధించారు. ఇంతకీ ఆ దేశం ఏంటంటే.?
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చైనా ప్రైవేట్ ట్యూషన్లను నిషేధించింది. 2021లో చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బిలియన్ల డాలర్ల విలువైన ప్రైవేట్ ట్యూషన్ పరిశ్రమపై కఠిన చర్యలు తీసుకుంది. ముఖ్యంగా లాభాల కోసం నడిచే ట్యూషన్ సంస్థలను నియంత్రించేలా చట్టాలు తీసుకొచ్చింది. ప్రభుత్వం అభిప్రాయం ప్రకారం, ప్రైవేట్ ట్యూషన్ సంస్థలు విద్యను ఒక భారీ పోటీగా మార్చాయి. ఫలితంగా తల్లిదండ్రులు పిల్లల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని తగ్గించడానికి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.
25
“డబుల్ రిడక్షన్” పాలసీ అమలు
ఈ నిర్ణయం డబుల్ రిడక్షన్ అనే విద్యా సంస్కరణలో భాగంగా తీసుకున్నారు. విద్యార్థులకు ఎక్కువ హోంవర్క్ తగ్గించడం, స్కూల్ బయట జరిగే ట్యూషన్ క్లాసులను నియంత్రించడం, పిల్లలకు చదువు ఒత్తిడిని తగ్గించడం వంటివి ఈ పాలసీ ప్రధాన లక్ష్యాలు. దీంతో విద్యార్థులకు చదువు మాత్రమే కాకుండా ఇతర కార్యకలాపాలకు కూడా సమయం లభించాలని ప్రభుత్వం భావించింది.
35
తగ్గుతున్న జనన రేటుపై ఆందోళన
చైనాలో జననాల సంఖ్య తగ్గిపోవడం ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. పిల్లలను పెంచడం చాలా ఖర్చుతో కూడుకున్నదిగా మారింది. ప్రత్యేకంగా నగరాల్లో తల్లిదండ్రులు ప్రైవేట్ ట్యూషన్ల కోసం భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఈ పరిస్థితి కారణంగా యువ దంపతులు పిల్లలను కనడానికి వెనుకంజ వేస్తున్నారని అధికారులు గుర్తించారు. అందుకే ట్యూషన్ ఖర్చులు తగ్గించి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించాలని ప్రభుత్వం భావించింది.
చైనాలో చాలా మంది విద్యార్థులు ఉదయం స్కూల్‌కు వెళ్లి, సాయంత్రం ట్యూషన్ క్లాసులకు వెళ్లడం సాధారణంగా మారిపోయింది. వీకెండ్లు, సెలవులు కూడా ట్యూషన్లలోనే గడుస్తున్నాయి. దీంతో పిల్లలకు విశ్రాంతి, ఆటలు, స్నేహితులతో గడిపే సమయం లాంటివి చాలా తగ్గిపోయాయి. ఈ పరిస్థితిని అధికారులు “ర్యాట్ రేస్”గా అభివర్ణించారు.
55
వీకెండ్లు, సెలవుల్లో ట్యూషన్లకు పూర్తిగా నిషేధం
నిబంధనల ప్రకారం స్కూల్ ప్రధాన సబ్జెక్టులు అయిన మ్యాథ్స్, సైన్స్, భాషలు వంటి విషయాలకు వీకెండ్లు, పబ్లిక్ హాలిడేలు, వేసవి–చలికాల సెలవుల్లో ప్రైవేట్ ట్యూషన్లు నిర్వహించడాన్ని పూర్తిగా నిషేధించారు. ఇదే కాకుండా విద్యా రంగంలో విదేశీ పెట్టుబడులపై కూడా కఠిన నియంత్రణలు అమలు చేశారు. ట్యూషన్ కంపెనీలలో విదేశీ పెట్టుబడులు పెట్టడాన్ని నిషేధించారు. విదేశీ టీచర్లు ఆన్‌లైన్ ద్వారా క్లాసులు నిర్వహించడంపై కూడా నియంత్రణలు విధించారు.