
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంతపని చేశారు. ప్రపంచ దేశాలతో పాటు భారత్ పై కూడా సుంకాలను విధించారు... ఆగస్ట్ 1 నుండి పెంచిన సుంకాలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. భారత్ పై 25శాతం టారీఫ్స్ విధిస్తున్నట్లు తాజాగా అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.
అయితే భారత్ పై సుంకాలు పెంచడానికి గల కారణాలను ట్రంప్ సోషల్ మీడియా వేదికన వెల్లడించారు. అమెరికా వస్తువలపై భారత్ లో అధిక సుంకాలున్నాయని... అందుకే ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ఇప్పటికే ట్రంప్ పలుమార్లు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రష్యాతో వ్యాపారాన్ని కొనసాగించడం కూడా భారత్ పై సుంకాలు విధించడానికి కారణమని ట్రంప్ ప్రకటించారు.
'ఇండియా మాకు మిత్రదేశమే అయినప్పటికీ బిజినెస్ సంబంధాలు చాలా తక్కువ... సంవత్సరాలు ఈ దేశంతో తక్కువగానే బిజినెస్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రపంచ దేశాలతో పోలిస్తే అక్కడ టారీఫ్స్ చాలా ఎక్కువ. వాణిజ్యపరంగా ఇవి అడ్డంకిగా మారాయి'' అని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికన ప్రకటించారు.
''భారత్ రక్షణా పరికరాలను రష్యానుండి ఎక్కువగా కొనుగోలు చేస్తోంది. చైనాతో పాటు భారత్ కూడా రష్యానుండి భారీగా ఇందనాన్ని దిగుమతి చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్ తో యుద్దాన్ని ఆపాలని ప్రపంచమంతా రష్యాను కోరుతున్నాయి... ఇలాంటి సమయంలో ఆ దేశంతో వాణిజ్యం మంచిదికాదు. అందువల్లే ఇండియాపై 25 శాతం టారీఫ్స్ విధిస్తున్నాం. అలాగే పెనాల్టీలు కూడా ఉంటాయి. ఆగస్ట్ 1 నుండి ఇవి అమలులోకి వస్తాయి'' అని ట్రంప్ ప్రకటించారు.
భారత్ పై అమెరికా సుంకాల పెంపు భారత వాణిజ్యంపై ప్రభావం చూపించనుంది... ముఖ్యంగా అమెరికాకు ఎగుమతయ్యే వస్తువుల ధరలు పెరిగి డిమాండ్ తగ్గుతుంది. ఇది ఇక్కడ ఉత్పత్తిదారులను దెబ్బతీస్తుంది... ఇలా ఆంధ్ర ప్రదేశ్ ఆక్వా రైతులపై కూడా ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ గట్టిగానే ఉండనుంది.
ఏపీలో ఆక్వా రంగం బాగా విస్తరించి ఉంది... ఇక్కడి నుండి అమెరికాకు చేపలు, రొయ్యలు ఎగుమతి అవుతాయి. అయితే తాజాగా సుంకాల పెంపుతో ఈ ఆక్వా ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతాయి. తద్వారా డిమాండ్ తగ్గే అవకాశాలున్నాయి. దీంతో ఎగుమతులు కూడా ప్రభావితమై ఏపీ ఆక్వా రైతులు నష్టాలను చవిచూసే అవకాశాలున్నాయి.
ఇక అమెరికాకు ఇండియా నుండి భారీగా ఎలక్ట్రానిక్స్ ఎగుమతి అవుతాయి. అలాగే ఐటీ సేవలు కూడా ఎక్కువే. సుంకాల పెంపుతో ఇవి కాస్ట్లీ అవుతాయి. తద్వారా ఈ రంగాల్లో ఉద్యోగాలపై ప్రభావం పడే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఐటీ రంగంలో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి... ఇప్పుడు ఈ టారీఫ్స్ దెబ్బకు ఇవి మరింత పెరిగే అవకాశాలుంటాయి.
అమెరికాకు హైదరాబాద్ నుండి భారీగా ఐటీ సర్విసెస్ ఎగుమతి అవుతాయి. తాజా టారీఫ్స్ పెంపుతో దీనిపై ప్రభావం పడుతుంది. తద్వారా ఐటీ కంపెనీలు కాస్ట్ కటింగ్ లో భాగంగా ఉద్యోగులను తొలగించే అవకాశాలు ఉంటాయి. తద్వారా ఐటీ ఉద్యోగాలు చేసే తెలుగువారికి ఇబ్బందులు కలగవచ్చు.
యాపిల్ వంటి సంస్థలు చైనాపై అధిక సుంకాలు విధించడంతో ఇండియాలో పెట్టుబడులకు సిద్దమయ్యాయి. ఇప్పుడు ఇక్కడ కూడా టారీఫ్స్ పెంచారు.. అంటే ఇండియా నుండి ఎగుమతయ్యే మొబైల్స్ ధరలు భారీగా పెరగనున్నాయి... కాబట్టి ఈ రంగంలోనూ ఉద్యోగాలు తగ్గుతాయి. జువెల్లర్స్, ఫార్మా రంగాలపై ఈ టారీఫ్స్ పెంపు ప్రభావం ఉంటుంది.
మనతో ఇతరులు ఎలా ఉంటారో మనంకూడా వారితో అలాగే ఉండాలని అనుకుంటాం. గౌరవిస్తే తిరిగి గౌరవిస్తాం, అవమానిస్తే తిరిగి అవమానిస్తాం. మనసు నొప్పించడం,బాధపెట్టడం చేస్తే ప్రతీకారంతో రగిలిపోతాం. అయితే మనుషుల మధ్యనే కాదు దేశాల మధ్య కూడా ప్రతీకారం ఉంటుంది. తాజాగా ట్రంప్ అధికారంలోకి వచ్చాక ప్రతీకార సుంకాలు అనే పదం బాగా వాడుకలోకి వచ్చింది.
అసలు ఈ ప్రతీకార సుంకం అంటే ఏంటంటే... ఒక దేశం తమ వస్తువలపై ఏ దేశం ఎంత పన్ను విధిస్తుందో అదే స్థాయిలో పన్నులను ఆ దేశ వస్తువులపై విధించడమే ప్రతీకార పన్ను. ఉదాహరణకు భారత్ ఎలాగైతే అమెరికా వస్తువులపై పన్నులు విధిస్తుందో సేమ్ అమెరికా కూడా భారత వస్తువలపై అదేస్థాయిలో పన్నులు విధిస్తుంది. ఇలా ఒకరిపై ఒకరు ప్రతీకారం తీర్చుకునేలా విధించే పన్నుల విధానాన్నే ప్రతీకారం సుంకం అంటారు.