స్క్వోర్ట్సోవా ప్రకారం, ప్రస్తుతం గ్లియోబ్లాస్టోమా (వేగంగా పెరుగుతున్న మెదడు క్యాన్సర్), మెలనోమా వంటి తీవ్రమైన చర్మ క్యాన్సర్లకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ల అభివృద్ధి కూడా జరుగుతోంది. వీటిలో ఓక్యులార్ మెలనోమా (కళ్లలో ఏర్పడే మెలనోమా) కూడా ఉంది.
‘ఎంటరోమిక్స్’ వ్యాక్సిన్ ప్రస్తుతం రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. ఆమోదం లభించిన వెంటనే వైద్యరంగంలో వినియోగం ప్రారంభమవుతుంది. రష్యా టుడే ప్రకారం, ఇప్పటికే కొన్ని ఆంకాలజీ కేంద్రాల్లో ఇది పరిమిత వాడుకలో ఉంది.
క్యాన్సర్ వ్యాక్సిన్ల అభివృద్ధి ఇప్పటివరకు ప్రయోగ దశలో ఉన్నప్పటికీ, రష్యా ఈ రంగంలో ముందడుగు వేసింది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నివేదిక ప్రకారం, ప్రోస్టేట్, బ్లాడర్ వంటి కొన్ని క్యాన్సర్లకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, కొత్త ప్రయోగాలు ఆన్కాలజీలో (Oncology) కొత్త దిశలు తెరుస్తున్నాయి.
ప్రస్తుతం క్యాన్సర్‌పై పోరాటంలో రష్యా ప్రకటించిన ఈ వ్యాక్సిన్ ఒక కీలక మైలురాయి అని చెప్పవచ్చు. అంతర్జాతీయంగా ఆమోదం లభించిన తర్వాత, కోట్లాది రోగులకు ఇది ఒక కొత్త ఆశగా మారే అవకాశముంది.