Law: ఒక్కో దేశంలో చట్టం ఒక్కోలా ఉంటుంది. భారత్ వంటి దేశాల్లో సహ జీవనాన్ని చట్టం అంగీకరిస్తుంది. అయితే సహ జీవనం ఇకపై నేరమని ఓ దేశం తేల్చి చెప్పింది. కొత్త శిక్షాస్మృతిని అమల్లోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఆ దేశం ఏంటి.? ఏంటా కథ.?
ప్రపంచవ్యాప్తంగా పర్యాటక స్వర్గధామంగా పేరొందిన ఇండోనేషియా తాజాగా తీసుకొచ్చిన కొత్త చట్టంతో అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాలుగా అమల్లో ఉన్న డచ్ వలస కాలపు చట్టాలకు ముగింపు పలుకుతూ, స్వదేశీ నూతన శిక్షాస్మృతిని ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా అమలు చేసింది. ఈ చట్టంలో వ్యక్తిగత జీవనశైలికి సంబంధించిన కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
25
పెళ్లికి ముందు శారీరకంగా కలవడం ఇక నేరం
కొత్త శిక్షాస్మృతి ప్రకారం వివాహం చేసుకోకుండా శారీరకంగా కలవడం నేరంగా పరిగణిస్తారు. అలాగే పెళ్లి కాకుండా జంటలు ఒకే ఇంట్లో కలిసి ఉండటం కూడా చట్ట విరుద్ధం. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే గరిష్ఠంగా ఏడాది జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇండోనేషియాలో ప్రీ మ్యారిటల్ సెక్స్‌పై ఎలాంటి చట్టపరమైన నిషేధం లేకపోవడంతో ఈ మార్పు పెద్ద చర్చకు దారి తీసింది.
35
ఎవరు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేస్తారా.?
ఈ చట్టంలో ఒక కీలక పరిమితి కూడా ఉంది. పెళ్లికి ముందు శారీరకంగా కలవడం కేసుల్లో ఎవరైనా ఫిర్యాదు చేయలేరు. బాధితుల జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు లేదా పిల్లలు ఫిర్యాదు చేసినప్పుడే పోలీసులు కేసు నమోదు చేస్తారు. మూడో వ్యక్తులు లేదా పొరుగువారు చేసే ఫిర్యాదులను అధికారులు స్వీకరించరు. సహజీవనం కేసుల్లో మాత్రం ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని చట్టం స్పష్టం చేస్తోంది.
ఈ నూతన నిబంధనలు ఇండోనేషియా పౌరులకే కాకుండా అక్కడికి వచ్చే విదేశీ పర్యాటకులకు కూడా వర్తిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా బాలి వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు వచ్చే విదేశీయుల్లో ఆందోళన పెరిగింది. హోటల్ రంగం, ట్రావెల్ ఇండస్ట్రీ ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ చట్టం వల్ల పర్యాటకుల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని, విదేశీ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని వ్యాపార వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
55
స్వేచ్ఛలపై ఆందోళన
కొత్త శిక్షాస్మృతిలో శారీరకంగా కలవడం అనే నిబంధనలతో పాటు దేశాధ్యక్షుడిపై విమర్శలు చేయడం, ప్రభుత్వ సంస్థలను అవమానించడం, జాతీయ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడటం కూడా నేరాలుగా చేర్చారు. మానవ హక్కుల సంఘాలు దీనిని పౌర స్వేచ్ఛలపై దాడిగా అభివర్ణిస్తున్నాయి. 2019లో ఇదే తరహా చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నించినప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. అప్పట్లో వెనక్కి తగ్గిన ప్రభుత్వం, సుదీర్ఘ చర్చల తర్వాత కొన్ని మార్పులతో ఇప్పుడు ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది.