Iran: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌.. ఎవరీ మోజ్తబా ఖమేనీ? షాక్ లో ట్రంప్ !

Published : Mar 04, 2026, 06:51 PM IST

Iran's Next Supreme Leader: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత, ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ నూతన అధిపతిగా ఎన్నికైనట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.

PREV
15
ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా మోజ్తబా ఖమేనీ

ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ చరిత్రలో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత, ఆయన కుమారుడు మోజ్తబా హోస్సేనీ ఖమేనీ దేశ తదుపరి అత్యున్నత నాయకుడిగా ఎన్నికైనట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇరాన్ ఇంటర్నేషనల్, ది న్యూయార్క్ టైమ్స్ రిపోర్టుల ప్రకారం.. ఇరాన్‌లోని 88 మంది సభ్యులతో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ మోజ్తబాను ఈ పదవికి ఎంపిక చేసింది. ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మరణించిన కొన్ని రోజుల్లోనే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం.

25
ఖమేనీ మరణం.. యుద్ధ మేఘాలు

గత శనివారం అమెరికా, ఇజ్రాయెల్ దళాలు టెహ్రాన్‌లోని ఇరాన్ సుప్రీం లీడర్ నివాసంపై భారీ వైమానిక దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 86 ఏళ్ల అయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇరాన్ అణు, క్షిపణి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఖమేనీ మరణంతో ఇరాన్‌లో పెను రాజకీయ శూన్యత ఏర్పడింది. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ అత్యవసరంగా సమావేశమై వారసుడిని ఎంపిక చేసింది.

35
ఎవరీ మోజ్తబా ఖమేనీ?

1969లో మషాద్‌లో జన్మించిన మోజ్తబా ఖమేనీ, అలీ ఖమేనీకి రెండో కుమారుడు. ఆయన తన తండ్రి నీడలోనే రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. టెహ్రాన్‌లోని అల్వీ హైస్కూల్‌లో చదువుకున్న మోజ్తబా, అనంతరం కోమ్ నగరంలో మతపరమైన విద్యను అభ్యసించారు. అయితే, ఆయనకు అయతుల్లా అనే ఉన్నత మతపరమైన హోదా లేదు. ఇది ఆయన నియామకంపై కొంత చర్చకు దారితీసింది. ఇరాన్-ఇరాక్ యుద్ధంలో పాల్గొన్న ఆయనకు, ఇరాన్ భద్రతా, ఇంటెలిజెన్స్ విభాగాలతో బలమైన సంబంధాలు ఉన్నాయి.

45
ఐఆర్జీసీ (IRGC) కీలక పాత్ర

మోజ్తబా నియామకంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) అత్యంత కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మోజ్తబాకు ఐఆర్జీసీ అధికారులతో దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కొంతమంది మత పెద్దలు ఆయన ఎన్నికపై అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ఐఆర్జీసీ ఒత్తిడి మేరకు వారంతా ఏకగ్రీవంగా సపోర్టు తెలిపారని రిపోర్టులు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికాతో యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో, దృఢమైన నాయకత్వం కావాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

55
వారసత్వ రాజకీయాలపై చర్చ

ఇరాన్ ఇస్లామిక్ విప్లవం 1979లో రాజరికాన్ని అంతం చేస్తూ ఏర్పడింది. అటువంటి దేశంలో తండ్రి తర్వాత కొడుకు సుప్రీం లీడర్ కావడం వారసత్వ పాలనను తలపిస్తోందని విమర్శలు వస్తున్నాయి. గతంలో అలీ ఖమేనీ స్వయంగా తన వారసుల జాబితాలో కుమారుడి పేరు చేర్చలేదు. కానీ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా, మోజ్తబాను ఏకైక ప్రత్యామ్నాయంగా అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ గుర్తించింది. ఈ నియామకం ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో ఎటువంటి మార్పులకు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories