Iran: అస‌లు ఇరాన్‌లో ఏం జ‌రుగుతోంది.? నిజంగానే 12 వేల మంది మ‌ర‌ణించారా.?

Published : Jan 13, 2026, 04:46 PM IST

Iran: ఇరాన్‌లో తీవ్ర అశాంతి నెల‌కొన్న విష‌యం తెలిసిందే. తీవ్ర అంత‌ర్గ‌త సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న ఇరాన్‌లో వేలాది మంది మ‌ర‌ణిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఇరాన్‌లో ఏం జ‌రుగుతోంది తెలుసుకుందాం. 

PREV
15
ఇరాన్‌లో కొనసాగుతున్న ఆందోళనలు

ఇరాన్ దేశంలో గత కొన్ని సంవత్సరాల్లో లేనంత పెద్ద స్థాయిలో ప్రజా నిరసనలు మూడు వారాలుగా కొన‌సాగుతున్నాయి. మొదట ఆర్థిక సమస్యలపై మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు నేరుగా పాలక వ్యవస్థకు వ్యతిరేకంగా మారింది. రాజధాని టెహ్రాన్‌తో పాటు అనేక నగరాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. విశ్లేషకుల మాటల్లో ఇది ఇస్లామిక్ రిపబ్లిక్‌కు ఎదురైన అత్యంత తీవ్రమైన అంతర్గత సవాలు.

25
12,000 మంది మృతి చెందారా.?

ఇరాన్‌కు వెలుపల పనిచేస్తున్న ప్రతిపక్ష వెబ్‌సైట్ Iran International సంచలన ఆరోపణ చేసింది. తాజా నిరసనల సమయంలో ఇరాన్ భద్రతా బలగాలు కనీసం 12,000 మందిని హతమార్చాయి అని తెలిపింది. ఇది ఇరాన్ ఆధునిక చరిత్రలోనే అతిపెద్ద హత్యాకాండగా పేర్కొంది. మానవ హక్కుల సంస్థలు ఇప్పటివరకు చెప్పిన అంచనాల ప్రకారం వందల సంఖ్యలోనే మరణాలు ఉన్నట్టు సమాచారం ఉంది. ఆ దృష్ట్యా 12,000 అనే సంఖ్య ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

35
ఈ వివ‌రాలు ఎలా లెక్కించారు.

ఈ వెబ్‌సైట్ తన సమాచారం అనేక వర్గాల నుంచి సేకరించామని వెల్లడించింది. ఇందులో సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు దగ్గరగా ఉన్న వ్యక్తులు, ఇరాన్ అధ్యక్ష కార్యాలయ వర్గాలు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) సభ్యులు, వైద్య అధికారులు, ప్రత్యక్ష సాక్షులు అందించిన వివరాలు ఉన్నాయని తెలిపింది. ఈ డేటాను అనేక దశల్లో పరిశీలించి ధృవీకరించిన తర్వాతే ప్రకటించామని పేర్కొంది.

వీటిలో ఎక్కువ హత్యలు జనవరి 8, 9 తేదీల రాత్రి సమయంలో జరిగాయని తెలిపింది. ఈ చర్యలు యాదృచ్ఛికంగా జరిగిన ఘర్షణలు కాదని, పక్కా ప్రణాళికతో చేపట్టిన దాడులని ఆరోపించింది. ఈ ఆదేశాలు సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖామెనీ నుంచి వచ్చాయని కూడా పేర్కొంది. మరణించిన వారిలో ఎక్కువ మంది 30 ఏళ్ల లోపు యువతేనని తెలిపింది.

45
ఇంటర్నెట్‌పై ఆంక్షలు

ఇరాన్ ప్రభుత్వం ఈ ఆరోపణలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను కొంత‌మొత్తంలో నిలిపివేయ‌డంతో నిజాలను నిర్ధారించడం కష్టంగా మారింది. మునుపటి ఉద్యమాల సమయంలో బయటకు వచ్చిన వీడియోలు, ఫోటోలు ఈసారి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. దీనితో అసలు పరిస్థితిపై అనేక సందేహాలు నెలకొన్నాయి. మానవ హక్కుల సంస్థలు వందల మంది మృతి చెందినట్టు చెబుతున్నప్పటికీ, ఖచ్చితమైన సంఖ్యపై స్పష్టత లేదు.

55
ప్ర‌భుత్వంపై ప్ర‌భావం ప‌డుతుందా.?

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం పెద్ద స్థాయిలో నిరసనలు కొనసాగుతున్నా, అవి పాలనను కూల్చే స్థాయికి చేరాలంటే కీలక మార్పులు అవసరమ‌ని అంటున్నారు. ముఖ్యంగా సైన్యంలో చీలికలు రావడం, ఉన్నత స్థాయి నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడటం, చమురు, రవాణా వంటి కీలక రంగాల్లో సమ్మెలు వంటివి జ‌ర‌గ‌క‌పోతే పాలక వ్యవస్థ నిలబడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయంగా కూడా పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. గతంలో ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధం ఖామెనీ బలహీనతలను బయటపెట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మొత్తం మీద ఇరాన్ ప్రస్తుతం తీవ్ర అణచివేత ఒకవైపు, పెరుగుతున్న ప్రజా ఆగ్రహం మరోవైపు ఉన్న సంక్షోభ దశలో ఉంది. ఈ ఉద్యమం చరిత్ర మలుపు తిప్పుతుందా? లేక ప్రభుత్వ నియంత్రణలోనే ఆగిపోతుందా? అనే ప్రశ్నకు ఇప్పట్లో స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు.

Read more Photos on
click me!

Recommended Stories