Iran Israel war: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడితో మరోసారి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో వరుస పేలుళ్లతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య గొడవ ఎలా మొదలైంది? ఎందుకు ఇప్పటికీ కొనసాగుతోంది?
ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఇరాన్‌పై "ముందస్తు దాడి" చేపట్టినట్లు ప్రకటించాయి. ఇరాన్ నుంచి క్షిపణి లేదా డ్రోన్ దాడులు జరిగే ప్రమాదం ఉందనే సమాచారం ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపాయి. టెహ్రాన్ నగరంలోని కొన్ని కేంద్ర ప్రాంతాల్లో పేలుళ్లు చోటుచేసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. కొన్ని భవనాలు దెబ్బతిన్నట్లు సమాచారం. పేలుళ్ల తర్వాత నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పొగ మేఘాలు కనిపించాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇరాన్ కూడా దాడి జరిగినట్లు ధృవీకరించింది. అయితే నష్టం వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఇజ్రాయెల్ చర్యకు ప్రతీకారం తప్పదని సంకేతాలు ఇస్తోంది.
25
1979 విప్లవంతో మారిన సంబంధాలు
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు ఒకప్పుడు ప్రత్యక్ష శత్రువులు కావు. 1979 వరకు ఇరాన్‌లో రాజ్యాంగ రాజ్యం ఉండగా ఈ రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు కొనసాగేవి. 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొత్త ఇస్లామిక్ ప్రభుత్వం ఇజ్రాయెల్‌ను శత్రు దేశంగా ప్రకటించింది. దౌత్య సంబంధాలు తెంచుకుంది. టెహ్రాన్‌లో ఉన్న ఇజ్రాయెల్ రాయబారి కార్యాలయాన్ని మూసివేసి పాలస్తీనా సంస్థకు అప్పగించింది. ఈ ఘటన తర్వాతే రెండు దేశాల మధ్య విభేదాలు తీవ్రంగా మారాయి. ఇజ్రాయెల్‌ను అంగీకరించని దేశంగా ఇరాన్ మారింది.
35
"షాడో వార్"గా మారిన ఘర్షణ
ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష యుద్ధం చాలా అరుదుగా జరిగినా, పరోక్షంగా దాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితిని విశ్లేషకులు "షాడో వార్"గా పేర్కొంటారు. విదేశాల్లో జరిగిన పేలుళ్లు, హత్యలు, సైబర్ దాడులు, నౌకలపై దాడులు వంటి ఘటనల్లో రెండు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇరాన్‌కు మద్ధతుగా పనిచేసే మిలిటెంట్ గ్రూపులు కూడా ఈ ఘర్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సిరియా అంతర్యుద్ధం కూడా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచింది. ఇరాన్ మద్ధతు ఉన్న దళాలపై ఇజ్రాయెల్ తరచుగా దాడులు చేస్తూ వచ్చింది.
ఇరాన్ అణు కార్యక్రమం ఈ ఘర్షణలో ప్రధాన కారణంగా మారింది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసే దిశగా ముందుకు వెళ్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇరాన్ మాత్రం తాము అణు కార్యక్రమాన్ని విద్యుత్ ఉత్పత్తి వంటి శాంతియుత అవసరాల కోసమే నిర్వహిస్తున్నామని చెబుతోంది. కానీ ఇరాన్ వద్ద అణు ఆయుధాలు ఉంటే అది తమ భద్రతకు పెద్ద ముప్పుగా మారుతుందని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇరాన్ అణు ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ గతంలో సైబర్ దాడులు, రహస్య ఆపరేషన్లు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇరాన్ అణు శాస్త్రవేత్తల హత్యల వెనుక కూడా ఇజ్రాయెల్ ఉందని టెహ్రాన్ అనుమానిస్తోంది.
55
పూర్తి స్థాయి యుద్ధం జరిగితే..
ప్రస్తుతం టెహ్రాన్‌పై జరిగిన దాడి తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరాన్ ప్రతీకారంగా క్షిపణులు లేదా డ్రోన్ దాడులు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటే ఈ ఘర్షణ పూర్తి స్థాయి యుద్ధంగా మారే ప్రమాదం ఉంది. అలా జరిగితే మధ్యప్రాచ్య ప్రాంతం మొత్తం అస్థిరంగా మారే అవకాశం ఉంది. ఇజ్రాయెల్‌కు అమెరికా సపోర్ట్ ఉండగా, ఇరాన్‌కు కొన్ని ప్రాంతీయ మిలిటెంట్ సంస్థలు మద్ధతుగా నిలుస్తున్నాయి. ఈ పరిస్థితి పెద్ద ప్రాంతీయ యుద్ధానికి దారితీసే అవకాశాన్ని పెంచుతోంది.