అయ్యో పాపం..: బహిరంగ మూత్రవిసర్జన వద్దన్నందుకే ఇండియన్ కుర్రాడిని యూఎస్ లో చంపేశారా..!

Published : Sep 08, 2025, 01:17 PM IST

తాను పనిచేసే సంస్థ ప్రాంగణంలో బహిరంగ మూత్ర విసర్జన వద్దన్నాడని ఓ ఇండియన్ యువకుడిని అతి దారుణంగా కాల్చిచంపాడో అమెరికన్. ఈ ఘటనలో చనిపోయిన కపిల్ చాలా కష్టాలుపడి అమెరికా వెళ్లాడు. అతడి కన్నీటిగాథ మనతో కూడా కన్నీరు తెప్పిస్తుంది. 

PREV
15
అయ్యో పాపం...

Indian shot dead in USA : అమెరికాలో భారతీయులపై జాత్యహంకార దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం అమెరికాకు వచ్చే ఇండియన్స్ తమ అవకాశాలు దెబ్బతీస్తున్నారని యూఎస్ కొంతమంది భావిస్తున్నారు. దీంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారతీయులపై దాడులు జరిగిన సంఘటనలు చూశాం. కానీ ఇప్పుడు ఏకంగా మనవారి ప్రాణాలు తీస్తున్నారు. కేవలం బహిరంగ ప్రదేశంలో మూత్రవిసర్జన చేయరాదని చెప్పినందుకే ఇండియా యువకుడిని కాల్చిచంపాడో దుండగుడు. ఈ దారుణ ఘటన కాలిఫోర్నియాాలో జరిగింది.

25
అసలేం జరిగింది?

హర్యానాలోని జింద్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల కపిల్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. మంచి ఉపాధి లభిస్తుందని అక్రమ మార్గంలో (డంకీ రూట్) లో అమెరికాకు వెళ్ళిన అతడు నానా కష్టాలు పడ్డాడు. చివరకు పోలీసులకు పట్టుబడి దేశంకాని దేశంలో జైలుకు కూడా వెళ్లాడు. అయితే చివరకు అతడు శరణార్థిగా మారి జైలునుండి బయటకువచ్చాడు... తర్వాత ఓ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా చేరాడు.

అయితే శనివారం కపిల్ కాపలా ఉండే సంస్థ ప్రాంగణంలో ఓ అమెరికన్ మూత్ర విసర్జన చేస్తుండటంతో వద్దని చెప్పాడు. ఈ క్రమంలో కపిల్ తో వాగ్వాదానికి దిగిన సదరు వ్యక్తి ఆగ్రహంతో ఊగిపోయాడు. తీవ్ర దుర్భాషలాడుతూ తన దగ్గరున్న గన్ తో ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. దీంతో బుల్లెట్స్ కపిల్ శరీరంలోకి దూసుకెళ్ళి అతడు అక్కడిక్కడే మరణించాడు. ఈ మేరకు అమెరికా నుండి తమకు సమాచారం అందినట్లు మృతుడి స్వగ్రామం బరా కలాన్ సర్పంచ్ వెల్లడించారు.

35
కపిల్ కన్నీటిగాథ...

హర్యానా రాష్ట్రం బరా కలాన్ గ్రామంలో ఓ సామాన్య రైతు కుటుంబంలో కపిల్ జన్మించాడు. ఇతడి తండ్రి ఈశ్వర్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కపిల్ తో పాటు ఇద్దరు ఆడపిల్లలను తన రెక్కలకష్టంతో చదివించారు... ఇప్పటికే ఓ ఆడపిల్లకు పెళ్ళిచేసి పంపించారు. ఇక కొడుకు కూడా మంచి ఉద్యోగంలో సెటిల్ అయితే పెళ్లి చేయాలని ఆ తల్లిదండ్రులు భావించారు. కానీ కపిల్ మాత్రం విదేశాలకు వెళ్లాలని కలగన్నాడు... ఇది తనకు తలకుమించిన భారం అయినా కొడుకు ఇష్టపడుతున్నాడని పంపించేందుకు తండ్రి ఈశ్వర్ సిద్దమయ్యాడు.

45
డంకీ రూట్ లో అమెరికాకు కపిల్

అయితే కపిల్ అమెరికా వెళ్లేందుకు సిద్దమవగా అతడికి వీసా లభించలేదు. దీంతో 2022 లో అతడు 'డంకీ రూట్' లో అంటే అక్రమంగా యూఎస్ వెళ్లాడు. ఇందుకోసం అతడి కుటుంబం రూ.45 లక్షల వరకు ఖర్చు చేసిందట. అంతేకాదు ఎన్నో కష్టాలను భరిస్తూ అమెరికాకు వెళ్లిన కపిల్ అనేక ఇబ్బందులకు ఎదుర్కొన్నాడు... చివరకు పోలీసులకు పట్టుబడి జైలుజీవితం కూడా గడిపాడు.

చిన్నవయసులోనే చూడాల్సిన కష్టాలన్నీ చూసిన అతడు ఇటీవలే కాలిఫోర్నియాలోని ఓ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. ఎలాగయితేనేం తమ కొడుకు బాగున్నాడు... ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు అని ఆ తల్లిదండ్రులు అనుకుంటున్న సమయంలో అనుకోని సంఘటన జరిగింది. కేవలం తాను సెక్యూరిటీగా ఉన్న సంస్థ పరిసరాల్లో బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిని వద్దని వారించాడు కపిల్… దీంతో కోపంతో ఊగిపోయిన ఆ దుండగుడు అతి దారుణంగా కాల్చి చంపాడు.

55
కపిల్ స్వగ్రామంలో విషాదం

కపిల్ హత్య గురించి సమాచారం అందడంతో ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు... తోబుట్టువులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఒక్కగానొక్క కొడుకు అతి చిన్న వయసులోనే ఇలా మరణించడం ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు.. వారి బాధ గ్రామస్తులందరితో కన్నీరు పెట్టిస్తోంది. ఇలా బరా కలాన్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

తమ గ్రామానికి చెందిన యువకుడు కపిల్ విదేశాల్లో హత్యకు గురవడం బాధాకరమని... బాధలో ఉన్న అతడి కుటుంబానికి యావత్ గ్రామం మద్దతుగా నిలిచిందని బరా కలాన్ గ్రామ సర్పంచ్ సురేష్ కుమార్ గౌతమ్ తెలిపారు. కపిల్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని.. అతడి మృతదేహాన్ని ఇండియాకు తరలించే ఏర్పాట్లు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సర్పంచ్ కోరారు. గ్రామస్తులంతా కపిల్ కుటుంబసభ్యులను సహాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories