India Oman: గల్ఫ్ దేశాలతో ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఒమన్‌తో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై సంతకం చేసింది. ఒమాన్ పర్యటనలో ఉన్న మోదీ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.
మస్కట్‌లో కుదిరిన భారత్–ఒమాన్ కీలక వాణిజ్య ఒప్పందం
భారత్, ఒమాన్ దేశాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై సంతకాలు చేశాయి. మస్కట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఒమాన్ వాణిజ్య మంత్రి కైస్ బిన్ మహమ్మద్ అల్ యూసఫ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నుంచి ఇది అమల్లోకి రానుంది.
25
భారత ఎగుమతులకు భారీ లాభం
ఈ ఒప్పందంతో ఒమాన్ తన టారిఫ్ లైన్లలో 98 శాతం పైగా వస్తువులకు సున్నా సుంకం వర్తిస్తుంది. దీని ద్వారా భారత ఎగుమతుల విలువలో 99 శాతం కంటే ఎక్కువ భాగానికి పన్ను రహిత ప్రవేశం లభిస్తుంది. టెక్స్టైల్స్, జెమ్స్ జువెలరీ, లెదర్ ఉత్పత్తులు, ఫుట్‌వేర్, స్పోర్ట్స్ గూడ్స్, ప్లాస్టిక్స్, ఫర్నిచర్, వ్యవసాయ ఉత్పత్తులు, ఇంజినీరింగ్ గూడ్స్, ఫార్మాస్యూటికల్స్, మెడికల్ డివైజెస్, ఆటోమొబైల్స్ రంగాలకు ఇది పెద్ద ఊతం అవుతుంది. ఇప్పటివరకు ఒమాన్‌లో ఈ ఉత్పత్తులపై సుమారు 5 శాతం దిగుమతి సుంకం ఉండేది.
35
ఒమాన్ ఉత్పత్తులపై భారత్ ఇచ్చిన సడలింపులు
భారత్ తన మొత్తం టారిఫ్ లైన్లలో దాదాపు 78 శాతానికి సుంక సడలింపులు ఇవ్వడానికి అంగీకరించింది. దీని వల్ల ఒమాన్ నుంచి వచ్చే దిగుమతుల విలువలో 94 శాతం పైగా భాగం కవర్ అవుతుంది. ఖర్జూరాలు, మార్బుల్స్, పెట్రోకెమికల్ ఉత్పత్తుల విషయంలో భారత్ టారిఫ్ రేట్ కోటా విధానం ద్వారా పరిమిత సడలింపులు ఇచ్చింది. రైతులు, చిన్న వ్యాపారుల ప్రయోజనాలను కాపాడేందుకు పాల ఉత్పత్తులు, టీ, కాఫీ, రబ్బర్, పొగాకు, బంగారం, వెండి బులియన్, జువెలరీ, ఫుట్‌వేర్, స్పోర్ట్స్ గూడ్స్ వంటి వాటిని మినహాయింపు జాబితాలో ఉంచింది.
సేవల రంగంలో ఒమాన్ విస్తృత కమిట్మెంట్లు ఇచ్చింది. కంప్యూటర్ సేవలు, ప్రొఫెషనల్ సేవలు, బిజినెస్ సేవలు, ఆడియో–విజువల్ రంగం, పరిశోధనాభివృద్ధి, విద్య, ఆరోగ్య సేవలు ఇందులో ఉన్నాయి. ఒమాన్ సేవల దిగుమతుల మార్కెట్ విలువ 12.5 బిలియన్ డాలర్లకు పైగా ఉండగా, భారత వాటా ఇప్పటికీ పరిమితంగా ఉంది. ఈ ఒప్పందం భారత సేవా సంస్థలకు కొత్త అవకాశాలు తెరుస్తుంది. ఒమాన్‌లో ప్రధాన సేవా రంగాల్లో భారత కంపెనీలకు 100 శాతం విదేశీ పెట్టుబడి అనుమతి లభించడం మరో కీలక అంశం.
55
90 రోజుల నుంచి 2 ఏళ్లకు పెంపు
CEPAలో అత్యంత ముఖ్యమైన అంశం నైపుణ్య వృత్తిదారులకు సంబంధించిన సడలింపులు. ఇన్‌ట్రా కార్పొరేట్ ట్రాన్స్‌ఫరీల కోటాను 20 శాతం నుంచి 50 శాతానికి పెంచారు. కాంట్రాక్టు సేవా నిపుణులకు ఉండే కాలాన్ని 90 రోజుల నుంచి రెండేళ్లకు పెంచారు. అవసరమైతే మరో రెండేళ్లు పొడిగించే అవకాశం ఉంది. అకౌంటెన్సీ, ట్యాక్సేషన్, ఆర్కిటెక్చర్, వైద్య రంగాలకు ఇది మేలు చేస్తుంది. ప్రస్తుతం భారత్–ఒమాన్ ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 10.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఒమాన్‌లో దాదాపు 7 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఈ ఒప్పందం వాణిజ్యం, పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.