
లైఫ్ స్టైల్ మారినంత మాత్రాన హెల్తీగా ఉన్నట్లు కాదు. పరిసరాలు కూడా క్లీన్ గా, నీట్ గా ఉండాలి. ఇంట్లో ఉండేవారు కూడా శుభ్రత పాటించాలి. పీల్చే గాలి, తాగే నీరు, నివసించే స్థలం, వేసుకునే బట్టలు, పడుకునే బెడ్ రూం...ఇలా ప్రతీ విషయంలో జాగ్రత్తలు అవసరం. ఒకవేళ ఏమాత్రం గాడి తప్పినా కూడా ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అందులోనూ చిన్న పిల్లల పట్ల మరింత భద్రత ముఖ్యం. ఇక సిగరెట్ తాగే వారి ఇళ్లల్లో కుటుంబం మొత్తం అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే సిగరెట్ తాగనంత మాత్రాన సురక్షితంగా ఉన్నామనుకోవడం కూడా చాలా పొరపాటు. మీరు సిగరెట్ తాగకపోయినా, మీ ఇంట్లో లేదా మీరు కూర్చున్న ప్రదేశంలో వాటి అవశేషాలు ఉంటే, మీ ఆరోగ్యానికి ముప్పు తప్పదని నిపుణులు చెబుతున్నారు. సిగరెట్, బీడీ, చుట్ట తాగిన వ్యక్తి అక్కడినుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ స్థలంలో విషపదార్థాల ప్రభావం ఉంటుందంటున్నారు. దాన్నే థర్డ్-హ్యాండ్ స్మోకింగ్ అంటారు. ఇది కంటికి కనిపించదు, వాసన ఉండకపోవచ్చు, కానీ నెమ్మదిగా శరీరంలో ప్రవేశించి ప్రమాదంగా మారుతుందంటున్నారు.
థర్డ్-హ్యాండ్ స్మోక్ అంటే సిగరెట్ పొగలోని నికోటిన్, కార్సినోజెన్స్, ఇతర విష రసాయనాలు గాల్లో కరిగిపోకుండా గోడలు, ఫర్నిచర్, కర్టెన్లు, కార్పెట్లు, బట్టలపై అంటుకుని ఉంటుంది. పొగ తాగడం ఆగిపోయిన తర్వాత కూడా ఈ అవశేషాలు ఇంట్లోనే మిగిలిపోతాయి. సిగరెట్ వాసన లేకపోతే ప్రమాదం లేదనుకోవడం తప్పు. ఈ రసాయనాలు కాలక్రమంలో మళ్లీ గాల్లోకి విడుదల అవుతాయి. దీని వల్ల ఇంట్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ స్వల్ప మోతాదులో అయినా పీల్చే ప్రమాదం ఉంటుంది. శ్వాస ద్వారానో లేదా తాకడం వల్లనో శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఒక్కసారిగా ప్రభావం చూపదు. కానీ దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని నష్టం చేస్తుంది.
చిన్న పిల్లలు ఈ ప్రమాదానికి అత్యధికంగా గురవుతారు. వారు నేలపై పాకుతారు, వస్తువులను నోట్లో పెడతారు. బాల్యదశలో వారి ఊపిరితిత్తులు, రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండటం వల్ల థర్డ్-హ్యాండ్ స్మోక్ ప్రభావానికి లోనవుతారు. తరచూ దగ్గు, వీజింగ్, ఆస్తమా, చెవి, ఛాతీ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం పెరుగుతుంది.
వృద్ధుల విషయంలో కూడా ఈ ప్రమాదమేమి లేదనుకోకూడదు. ఊపిరితిత్తులు, గుండె సమస్యలు ఉన్నవారిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పెరుగుతాయి. COPD వంటి దీర్ఘకాలిక వ్యాధులు ముదురుతాయి. గుండెపై ఒత్తిడి పెరిగి ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడతారు.
గర్భిణీ మహిళలు థర్డ్-హ్యాండ్ స్మోక్‌కు పదే పదే గురైతే, గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. తక్కువ బరువుతో శిశువు పుట్టడం, ముందస్తు ప్రసవం, శిశువు ఊపిరితిత్తుల అభివృద్ధి దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
ఈ సమస్య తీవ్రతను గుర్తించిన కాలిఫోర్నియా రాష్ట్రం థర్డ్-హ్యాండ్ స్మోక్‌పై ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. ఇల్లు అమ్మేటప్పుడు లేదా అద్దెకు ఇచ్చేటప్పుడు అక్కడ పొగ తాగారా లేదా అనే విషయాన్ని ముందుగా చెప్పాలి. థర్డ్-హ్యాండ్ స్మోక్‌ను అక్కడి ప్రభుత్వం పర్యావరణ ప్రమాదంగా గుర్తించింది.
భారత్‌లో ఇలాంటి చట్టం ఇంకా లేకపోయినా, చిన్న ఇళ్లు, జనసాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల థర్డ్-హ్యాండ్ స్మోక్ ప్రమాదం ఇక్కడ మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బాల్కనీలో లేదా వేరే గదిలో పొగ తాగినా కుటుంబ సభ్యులపై ఎఫెక్ట్ చూపిస్తుంది. బస్టాండ్ లు, కెఫెలు, రోడ్డు, కారు, ఇంట్లో...ఇలా ఎక్కడపడితే అక్కడ పొగ తాగడం అది గాల్లో కలిసిపోవడం వల్ల పరిసర ప్రజలకు సమస్యగా మారుతోంది. అందుకే థర్డ్-హ్యాండ్ స్మోక్‌పై ప్రత్యేక చట్టం భారత్ లోనూ తీసుకొస్తే ఫలితం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
థర్డ్-హ్యాండ్ స్మోక్ నుంచి పూర్తిగా రక్షించుకోవాలంటే ఒకటే మార్గం ఉంది. ముందుగా మీ నుంచే ప్రక్షాళన మొదలు పెట్టాలి. తొలుత ఇంటి లోపల, కారులో పూర్తిగా పొగ తాగడం మానేయాలి,. క్లీనింగ్ కొంతవరకు సహాయపడినా, పొగ తాగడం కొనసాగితే ముప్పు తప్పదంటున్నారు. పొగ కనిపించకపోయినా, దాని ప్రభావం ఉంటుంది. మీరు పొగ తాగకపోయినా, పొగ తాగే వారి దగ్గర ఉంటే మీరు కూడా బాధితులే.