ఉప్పుకప్పురంబు నొక్క పోలికనుండు... ఈ పద్యం నేర్చుకోని వారు ఎవరూ ఉండరు. ఉప్పు, కర్పూరం ఎలా అయితే ఒకటి కావో.... కర్పూరాలన్నీ కూడా ఒకటి కావు. అంటే మీకు తెలిసిన కర్పూరాలన్నీ మంచివి కావు. ముఖ్యంగా ఆలయాల్లో వెలిగించే కర్పూరం నుంచి నల్లని పొగతో పాటు, ధూళి వెలువడుతుందన్న ముచ్చట మీకు తెలుసా? కర్పూరం నుంచి వచ్చే పొగను బాగా గమనిస్తే దీనిలో నల్లటి రేణువులు కనిపిస్తాయి.
కర్పూరం చెట్టు....
కర్పూరం కాంఫర్ లారెల్ అనే చెట్టు నుంచి ఉత్పత్తి అవుతుంది. ఈ చెట్టు ఆకులు, కొమ్మలు, బెరడు నుంచి కర్పూరాన్ని తయారుచేస్తారు. కర్పూరం చెట్టు సుమారుగా 100 అడుగుల వరకు పెరుగుతుంది. ఈ చెట్లు ఎక్కువగా చైనా, జపాన్ దేశాల్లో పెరుగుతాయి. ఇక మన దేశంలో అయితే ఈ చెట్లు మైసూరు ప్రాంతం, మలబార్,నీలగిరి కొండల్లో కనిపిస్తాయి. కర్పూరం సుమారుగా 20 రకాలుగా ఉంటుంది. వీటిల్లో పచ్చ కర్పూరం చాలా ఫేమస్. వంటల్లో, ఆయుర్వేద మందుల తయారీలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పచ్చ కర్పూరాన్ని చెట్టు వేర్లు కాండం ఉపయోగించి సేంద్రీయ విధానాల్లో తయారు చేస్తారు.
camphor
అయితే గుళ్లో ఇచ్చే హారతే మనకు ప్రమాదకరం. కానీ మిగిలిన అన్ని కర్పూరాలు మంచివే. ఎందుకంటే వీటిని సేంద్రీయ విధానాల్లో తయారు చేస్తారు. ఒక్క గుడిలో వెలిగించే హారతి కర్పూరం తప్ప. ఎందుకంటే దీన్ని టర్పంటైన్ ఆయిల్ ఉపయోగించి రసాయన పద్ధతిలో తయారు చేస్తారు. అందుకే వీటిని వెలిగించినప్పుడు నల్లటి పొగతో పాటుగా ప్రమాదకరమైన రేణువులు వెలుపడతాయి. వీటిలో కాలిన కర్బన పదార్థాలు ఉంటాయి. దీని పొగను పీల్చడం వల్ల అది నేరుగా మన ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోతుంది. దీంతో ఉబ్బసం, ఆయాసంతో పాటుగా కొన్ని రకాలు క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఆలయాల్లో నిషేధించాలని...
రసాయన పద్దతిలో తయారుచేసే కర్పూరాన్ని హారతిగా ఇవ్వడం వల్ల భక్తులు, అర్చకులు అనారోగ్య సమస్యల బారినపడాల్సి వస్తుందని హిందూ, అర్చక, ధర్మదాయ శాఖలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు 2014 నుంచే అనధికారికంగా పలు ఆలయాల్లో కర్పూర హారతిని నిషేధించారు. దీప హారతిని మాత్రమే ఇస్తున్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనీ చాలా ప్రాంతాల్లో దీప హారతులు మాత్రమే ఇస్తున్నారు. కర్పూర హారతిని ఇవ్వడం పూర్తిగా మానేశారు. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇంట్లో కానీ, దేవాలయాల్లో గానీ కర్పూర హారతిని తీసుకోకండి. కర్పూరాన్ని వెలిగించకండి.