మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా హెల్తీగా ఫుడ్ ను తినాలి. ముఖ్యంగా ఉదయం ఖచ్చితంగా తినాలి. కానీ చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను ఏదో ఒక కారణంతో స్కిప్ చేస్తుంటారు. కానీ శరీరంలో మెటబాలిజంను ప్రారంభించడంలో బ్రేక్ ఫాస్ట్ యే కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు మంచి హెల్తీ ఫుడ్ మన ఏకాగ్రతను పెంచుతుంది. మానసిక స్థితి మెరుగుపర్చడానికి సహాయపడతుతుంది. ఒకవేళ మీరు ఉదయం తినకపోతే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. ఇది ఎన్నో రోగాలకు దారితీస్తుంది.
మీరు చాలా రోజుల పాటు ఇలాగే ఉదయం తినకపోతే బరువు పెరగడం, పోషకాల లోపాలతో పాటుగా ఎన్నో రోగాల ముప్పు కూడా ఉంది, కాబట్టి మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను ఖచ్చితంగా తినండి. బ్రేక్ ఫాస్ట్ ను తినేవారు తినని వారికంటే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. బ్రేక్ ఫాస్ట్ మన మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. మనల్ని షార్ప్ గా ఉంచుతుంది. ఇది మన జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాదు మనల్ని బలంగా, పదునుగా మారుస్తుందని పలు పరిశోధనలు కూడా నిరూపించాయి.
రకరకాల పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు, ప్రోటీన్ ఉన్న ఆహారాలను తింటే మన ఏకాగ్రత పెరుగుతుంది. తృణధాన్యాలు, ప్రోటీన్, ఫైబర్, మంచి కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారాలు మీ శరీరానికి శక్తిని అందించడానికి సహాయపడతాయి. అంతేకాదు బ్రేక్ ఫాస్ట్ మీ శరీరాన్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. మరి బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఏకాగ్రత
సమతుల్య అల్పాహారం మన మెదడుకు అవసరమైన గ్లూకోజ్ ను అందిస్తుంది. ఒకవేళ మీరు బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తే మీ ఏకాగ్రత, జ్ఞాపకశక్తితో పాటుగా మొత్తం అభిజ్ఞా పనితీరు తగ్గుతుంది. అలాగే మీరు పనిచేసే సామర్థ్యం కూడా తగ్గుతుంది.
బరువు పెరగడం, ఊబకాయం
ఉదయాన్నే భోజనం మానేయడం వల్ల బరువు తగ్గుతామని చాలా మంది నమ్ముతారు. కానీ ఇది ఒక అపోహ మాత్రమే. నిజమేంటంటే? ఉదయం తినకపోవడం వల్ల మీరు మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. మీరు ఉదయం తినకపోతే మధ్యాహ్నం హెవీగా తింటారు. ఇది మీ శరీర మెటబాలిజానికి అంతరాయం కలిగిస్తుంది. దీంతో మీరు విపరీతంగా బరువు పెరిగిపోతారు.
Image: Jill Willington
పోషకాహార లోపం
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అవసరమైన పోషకాలు, ఖనిజాలు ఉన్న బ్రేక్ ఫాస్ట్ ను తినాలి. మీరు ఉదయం తినకపోతే పోషక లోపాల ప్రమాదం పెరుగుతుంది. ఇది వివిధ శారీరక విధులను ప్రభావితం చేస్తుంది. అంతేకాదు ఇది మీకు ఎన్నో రోగాలు వచ్చేలా చేస్తుంది.
మూడ్ స్వింగ్స్
ఉదయం తినకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. అలాగే మూడ్ స్వింగ్స్, చిరాకు వంటి సమస్యలు కూడా వస్తాయి. సమతుల్య అల్పాహారం రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది.