మానవ శరీర నిర్మాణంలో ఎముకలు కీలక పాత్రని పోషిస్తాయి. అందుకే చిన్న వయసు నుంచే బలమైన ఆరోగ్యకరమైన ఎముకల నిర్మాణం కోసం జాగ్రత్తలు తీసుకోవటం అవసరం అంటున్నారు వైద్యులు. అందుకే వయసు పైబడినా ఎముకలు దృఢంగా ఉండటం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం.
విటమిన్-డి ఇది శరీరంలోని రకరకాల విధులను నిర్వహిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి కీలకమైన ఖనిజాలు, క్యాల్షియం మరియు సూక్ష్మ పోషకాలను శరీరం గ్రహించడంలో సహాయపడటం ద్వారా ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాల్షియం మరియు విటమిన్ డి సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తినటం ద్వారా ఎముకలు బలంగా తయారవుతాయి.
కాల్షియం చిక్కుళ్ళు, సాల్మన్ చేప, పాలు వంటి వాటిలో ఎక్కువగా లభిస్తుంది. అలాగే పెరుగు, చీజ్ వంటి వాటిలో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తి వారానికి రెండు నుంచి మూడు రోజులు కనీసం ఐదు నుంచి పది నిమిషాల పాటు సూర్యకాంతిలో ఉండేలాగా చూసుకోండి.
దీనివలన ఎముకలు పట్టుత్వాన్ని కోల్పోకుండా దృఢంగా ఉంటాయి. అలాగే సమతుల్య భోజనం ఆరోగ్యకరమైన ఎముకలను నిర్మించడంలో సహాయపడుతుంది. మంచి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చిన్న వయసు నుంచే ప్రారంభం అవ్వాలి. అయితే నిర్దిష్ట వయసు తర్వాత ఎముక బలహీన పడుతుంది.
కాబట్టి ఎముకల అభివృద్ధికి చిన్న వయసులోనే జాగ్రత్తలు తీసుకోవాలి. క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం మరియు ప్రతిరోజూ ఒక గంట వ్యాయామంతో సరి అయిన సమతుల్య ఆహారం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. అలాగే శరీరానికి అవసరమైన శారీరక శ్రమని కల్పించండి.
వేగంగా నడవడం ట్రేకింగ్, జాగింగ్ లేదా మెట్లు ఎక్కడం వంటి వ్యాయామాలు ఎముకల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే 40 ఏళ్లు పైబడిన వ్యక్తులు తప్పనిసరిగా ఆరోగ్యకరమైన జీవనశైలి పద్ధతులను కలిగి ఉండాలి. ఎముకల సాంద్రత పరీక్షలు మరియు వైద్యులతో వైద్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవటం అవసరం.