ప్రస్తుత జీవన విధానంలో మనం తరచుగా ఒత్తిడికి గురవుతూ ఉంటాము. ఒత్తిడి విపరీతంగా ఉంటే అది తలనొప్పికి దారితీస్తుంది, అలాగే జన్యుపరమైన కారణాల వల్ల కూడా చాలామందికి తలనొప్పి వస్తుంది. రక్తనాళాలలో రక్తప్రసరణ సరిగ్గా జరగకపోతే తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి.
అలాగే సరైన నిద్ర లేకపోయినా, విపరీతంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వినియోగిస్తున్న కూడా తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే తలనొప్పి వచ్చిన ప్రతిసారి మెడిసిన్ వాడటం మంచిది కాదు అంటున్నారు నిపుణులు.
నొప్పి స్థాయి తక్కువగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలతోనే నొప్పిని తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చు. అది ఎలాగో చూద్దాం. తలనొప్పి వచ్చినప్పుడు ముందుగా వెలుతురు తక్కువగా ఉండే గదిలో విశ్రాంతి తీసుకోండి. సరియైన నిద్ర లేకపోవడం వలన కూడా తలనొప్పి వస్తుంది.
అంతేకాకుండా ఒక మంచి నిద్ర తలనొప్పి తగ్గటానికి ఉపయోగపడుతుంది. తలనొప్పి ఎక్కువగా ఉంటే నిమ్మకాయ రసంతో కూడా కొంతమేరకు ఉపశమనం లభిస్తుంది. గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం వేసి దానిని తీసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.
అంతేకాదు కొన్ని సందర్భాలలో డీహైడ్రేషన్ కూడా తలనొప్పికి కారణం అవుతుందని చెబుతున్నారు వైద్యులు. అందుకే శరీరానికి కావలసిన నీటిని తప్పనిసరిగా తాగాలి. రోజుకి కనీసం నాలుగు నుంచి ఐదు లీటర్ల నీరు తాగటం ఒంటికి మంచిది. అలాగే అరటిపండు, పైనాపిల్ జ్యూస్ కలిపి తాగడం వలన కూడా తలనొప్పి కంట్రోల్ అవుతుంది.
గోరువెచ్చని ఆవు పాలు తాగటం వలన కూడా తలనొప్పి తగ్గుతుంది. అల్లాన్ని నమిలినా సరే తలనొప్పి తగ్గుతుంది. అలాగే నుదుటిమీద చందనం పూత వేసినా తలనొప్పి తగ్గుతుంది. స్ట్రాంగ్ కాఫీ లేదా టీ కూడా తలనొప్పిని కంట్రోల్ చేస్తుంది. అయితే నొప్పి భరించలేనిదిగా ఉన్నప్పుడు మాత్రం కచ్చితంగా వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.