వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం సున్నితత్వం కోల్పోతుంది. యవ్వనపు నిగారింపు, మెరుపూ, బిగుతూ తగ్గి నిర్జీవంగా తయారవుతుంది. అయితే పెరుగుతున్న వయసుతో పాటు చర్మం నిగారింపు కోల్పోకుండా, యవ్వనంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
చాలామందికి బాగా వేడి నీటితో స్నానం చేయడం ఇష్టం. అయితే ఇది అస్సలు మంచిది కాదంటున్నారు చర్మ నిపుణులు. స్నానం చేసే నీటి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉండాలి. మరీ వేడిగానూ, మరీ చల్లగానూ లేకుండా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం మంచిది.
గాఢమైన వాసన వచ్చే సుగంధబరితమైన సబ్బులు వాడకూడదు. సబ్బు మైల్డ్ గా ఉంటే అది శరీర నిగారింపును కాపాడుతుంది.
మాయిశ్చరైజేషన్ లోషన్స్‌తో చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. పొగతాగే అలవాటుంటే వెంటనే మానేయాలి. పొగలోని రసాయనాలు ఏజింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తాయి. వృద్ధాప్యంలో వచ్చే మార్పులన్నీ త్వరగా వచ్చేస్తాయి.
ఎండలోకి వెళ్లేప్పు్డు మంచి సస్‌స్క్రీన్ లోషన్స్ ఉపయోగించాలి. మీ శరీర తత్వానికి సరిపోయే సన్‌స్క్రీన్ డాక్టర్ సలహాతో ఎంచుకుని వాడడం మంచిది.
ఎండకు, చలికి, వర్షానికి చర్మం పాడవకుండా సౌకర్యవంతంగా ఉండే, శరీరాన్ని పూర్తిగా కప్పిఉంచే దుస్తులు వేసుకోండి.
అన్ని రకాల పోషకాలు ఉండే సమతుల ఆహారం తీసుకోవడం వల్ల వయసు ప్రభావం చర్మంపై పడకుండా చేయవచ్చు. ఆహారంలో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్‌లో ఈ పోషకాలు ఎక్కువ.
ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండటం తో పాటు శరీరంలోని లవణాలను కోల్పోకుండా చూసుకోండి. దీనివల్ల హైడ్రేటెడ్‌గా ఉంటారు. ఫలితంగా చర్మం ఆరోగ్యకరమైన మేని మెరుపుతో నిగారిస్తూ ఉంటుంది.
చర్మంపై ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా, వెంటనే చికిత్స తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే అవి పెరిగి, ఇతర సమస్యలకు దారితీయవచ్చు.
డయాబెటిస్, థైరాయిడ్, పోషకాహారలోపాలు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో చర్మం పొడిబారిపోయి మరికొన్ని సమస్యలు రావచ్చు.