అసిడిటీ.. కడుపులో ఉబ్బరం.. ఇది చాలా మందిని వేధిస్తుంది. కాస్త ఆయిల్ ఫుడ్ తిన్నా, ఏదైనా పడనిది తిన్నా చుక్కలు చూపిస్తుంది. అయితే చాలామంది అసిడిటీని పెద్దగా కేర్ చేయరు కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్రసమస్యలకు దారి తీస్తుంది.
గుండెల్లో మంటగా ఉండడం, సరిగా జీర్ణం కాకపోవడం, పొట్టలో గ్యాస్, పుల్లటి తేన్పులు రావడం, ఛాతిలో నొప్పి, నోటి అల్సర్లు ఇవన్నీ అసిడిటీ లక్షణాలే.
అసిడిటీ నుండి బైటపడాలంటే ముందు మీరు చేయాల్సిందల్లా నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండడమే. ఫైబర్ కలిగిన కూరగాయలు, పండ్లు ఆహారంలో చేర్చాలి. హెల్తీ డైట్ ను ఫాలో కావాలి.
ప్రతీరోజు ఒకే సమయంలో తినడం అలవాటు చేసుకోండి. ఒకేసారి అనేక రకాల ఆహారాన్ని, ఎక్కువ మోతాదులో తీసుకోకుండా జాగ్రత్త పడండి.
ఒబేసిటీ వల్ల కూడా అసిడిటీ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే నిరంతర వ్యాయామం, బరువును అదుపులో పెట్టుకోవడం వల్ల కూడా అసిడిటీని దూరం పెట్టొచ్చు.
తినగానే పడుకోవడం అస్సలు మంచిది కాదు. రాత్రుళ్లు ఆలస్యంగా తినడం వల్ల జీర్ణక్రియ మందగించి అసిడిటీకి కారణమవుతుంది.
చాలామంది భోజనం చేసేటప్పుడు గబగబా తినేస్తుంటారు. ఇది అస్సలు మంచిది కాదు మెల్లగా తినడం వల్ల అసిడిటీకి చెక్ పెటొచ్చు. అలాగే ఒకేసారి ఎక్కువ మోతాదులో తినకుండా కాస్త కాస్త తినడం కూడా అసిడిటీకి మంచి మందులా పనిచేస్తుంది.
నీళ్లు ఎక్కువ తాగాలి.ఎక్కువ మోతాదులో నీటిని తాగడం వల్ల కడుపులో ఊరే ఆసిడ్లను కంట్రోల్ లో పెట్టవచ్చు.
మసాలా వంటకాలు, పచ్చళ్లు, టిన్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహారపదార్థాలు, మైదా, ఆర్టిఫిషియల్ రంగులున్న పదార్థాలు కూడా అసిడిటీని పెంచుతాయి.
పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్ లాంటి మందులు కూడా అసిడిటీని పెంచుతాయి.