ఇవే గుండె జబ్బులొచ్చేలా చేస్తయ్..!

First Published | Nov 17, 2023, 7:15 AM IST

ఒకప్పుడు పెద్దవయసు వారికి మాత్రమే గుండె జబ్బులొచ్చేవి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఇలా గుండె జబ్బులు చిన్న వయసు వారికి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..
 

ప్రపంచ వ్యాప్తంగా హృద్రోగుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. డ్యాన్స్ చేస్తూ.. పాటలు పాడుతూ, డ్రైవింగ్ చూస్తూ గుండెపోటుతో ప్రాణాలు విడిచిన ఘటనలను మనం రోజూ చూస్తూనే ఉన్నాం. గుండె జబ్బుల బారిన పడకూడదంటే కొన్ని జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఆరోగ్యకరమైన బరువు, ఆరోగ్యకరమైన ఆహారం మనల్ని గుండెజబ్బులకు దూరంగా ఉంచుతాయని నిపుణులు అంటున్నారు. 

మీకు తెలుసో లేదో పేలవమైన ఆహారం మన ఆరోగ్యాన్నే కాదు గుండె ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. యూకేలో 11 శాతం మంది పురుషులు, తొమ్మిది శాతం మంది మహిళలు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు గుండెపోటుకు ఏవి కారణమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 


స్మోకింగ్

స్మోకింగ్ అలవాటు మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే సిగరెట్ పొగలోని రసాయనాలు మీ రక్తం చిక్కగా అయ్యేలా చేస్తాయి. అంతేకాదు సిరలు, ధమనులలో  రక్తం గడ్డకట్టడానికి కారణమవుతాయి. ఇక రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటు వస్తుంది. ఆకస్మిక మరణానికి దారితీస్తుంది. కాబట్టి ఈ స్మోకింగ్ అలవాటును వీలైనంత తొందరగా మానుకోండి. 
 

అధిక రక్తపోటు

అధిక రక్తపోటు మీరనుకున్నంత చిన్న సమస్య అయితే కాదు. ఎందుకంటే ఇది మీ గుండెను రిస్క్ లో పడేస్తుంది. అధిక రక్తపోటు స్థితిస్థాపకతను తగ్గించడం ద్వారా ధమనులను దెబ్బతీస్తుంది. ఇది గుండెకు రక్తం, ఆక్సిజన్ ప్రవాహాన్ని తగ్గిస్తుంది. దీంతో మీరు గుండెపోటు బారిన పడతారు. అందుకే మీకు ఈ సమస్య ఉంటే దీనిని నియంత్రించండి.
 

అధిక కొలెస్ట్రాల్

అధిక కొలెస్ట్రాల్ కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఎందుకంటే అధిక కొలెస్ట్రాల్ ధమనుల గోడలకు పేరుకుపోతుంది. ఇది శరీరంలోని ఇతర అవయవాలకు, గుండెకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. 
 

heart disease

డయాబెటిస్ మెల్లిటస్

రక్తంలో చక్కెర గుండెను నియంత్రించే రక్త నాళాలు, నరాలను దెబ్బతీస్తుంది. కొరోనరీ ఆర్టరీ మూసుకుపోవడం వల్ల గుండెకు ఆక్సిజన్, పోషకాలను రక్తం సరఫరా కావని నిపుణులు చెబుతున్నారు.
 

ఊబకాయం

ఊబకాయం కూడా గుండె జబ్బుల బారిన పడేస్తుంది. ఎందుకంటే దీని వల్ల ధమనుల్లో కొవ్వు విపరీతంగా పేరుకుపోతుంది. దీంతో మీ గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనులు దెబ్బతిని మూసుకుపోతాయి. దీంతో గుండెపోటు వస్తుంది. అందుకే బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి.బరువు పెరగకుండా చూసుకోవాలి.
 

వ్యాయామం లేకపోవడం

వ్యాయామం మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. గుండె జబ్బులను నివారించడానికి కూడా ఇది సహాయడపుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారికి అకస్మాత్తుగా గుండెపోటు లేదా ఇతర హృదయ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం తక్కువని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం మీ ఎనర్జీ లెవెల్స్ ను పెంచడంతో పాటుగా మీ బరువును కూడా అదుపులో ఉంచుతాయి.

Latest Videos

click me!