పోషకాలు పుష్కలంగా ఉండే బాదం పప్పులను తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే వీటిని ఎన్నో విధాలుగా తింటుంటారు. ఎన్నో ఆహారాల్లో ఉపయోగిస్తుంటారు. బాదంతో తయారుచేసిన ఆహారాలు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే బాదం పప్పులను గార్నిషింగ్ గా కూడా వాడుతుంటారు. నిజానికి బాదం పప్పులు పోషకాలకు మంచి వనరు. వీటిలో విటమిన్ ఇ, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ కె, ప్రోటీన్, ఫైబర్, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు మెండుగా ఉంటాయి. అందుకే వీటిని రెగ్యులర్ గా తింటుంటారు. కానీ వీటిని చలికాలంలో మరి ఎక్కువగా తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి తెలుసా? అవేంటంటే?
జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు
రెగ్యులర్ గా బాదం పప్పులను ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరం, మలబద్ధకం, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. ఎందుకంటే బాదంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అయితే అవసరమైన దానికంటే ఫైబర్ ను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.
బరువు పెరగడం
అవును బాదం పప్పులు మరీ ఎక్కువగా తింటే కూడా మీరు బరువు పెరుగుతారు. నిజానికి ఈ పప్పుల్లో కేలరీలు, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. బాదంలో మోనోశాచురేటెడ్ కొవ్వు కూడా ఉంటుంది. ఇది గుండెకు మేలు చేస్తుంది. అందుకే వీటిని రెగ్యులర్ గా కొద్దిమొత్తంలోనే తినాలి.
అలెర్జీ
అవసరానికి మించి బాదం పప్పులను తింటే కొంతమంది చర్మంపై దద్దుర్లు, వాపు, అలర్జీ వంటి సమస్యలు వస్తాయి. అందుకే వీటిని తక్కువ పరిమాణంలోనే తినండి. అనాఫిలాక్సిస్ వంటి అలెర్జీలతో బాధపడేవారు బాదంను తినకపోవడమే మంచిది.
మూత్రపిండాల్లో రాళ్లు
మీకు మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే బాదం పప్పులను ఎక్కువగా తినడం మానుకోండి. వాస్తవానికి ఈ పప్పుల్లో ఆక్సలేట్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే కిడ్నీ స్టోన్స్ మరింత పెరుగుతాయి. కాబట్టి వీళ్లు తినకూడదు.
ఎక్కువ మొత్తంలో విటమిన్-ఇ
బాదం పప్పులో విటమిన్ ఇ మెండుగా ఉంటుంది. ఇది మన జుట్టు పెరిగేందుకు ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ బాదం పప్పులను ఎక్కువగా తింటే మాత్రం ఆరోగ్యం దెబ్బతింటుంది. శరీరంలో విటమిన్ -ఇ ఎక్కువగా ఉంటే రక్తస్రావం వంటి ప్రమాదకరమైన సమస్యలు వస్తాయి.