
కాబూలీ సెనగలతో చేసుకునే మసాలా కూర పూరీ, చపాతీ, రైస్ ఇలా ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది. దీని తయారీ విధానం కూడా సులభం. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం కాజుకొబ్బరి చోలే మసాలా కూర తయారీ విధానం గురించి తెలుసుకుందాం
కావలసిన పదార్థాలు: ఒక కప్పు కాబూలీ సెనగలు (Kabuli Senagalu), ఒక పెద్ద ఉల్లిపాయ (Onion), రెండు పెద్ద టమోటాలు (Tomatoes), పావు కప్పు జీడిపప్పు (Cashew), పావు కప్పు ఎండుకొబ్బరి (Coconut) తురుము, రెండు పచ్చిమిరపకాయలు (Chilies), ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste).
పావు స్పూన్ పసుపు (Turmeric), సగం స్పూన్ గరం మసాలా (Garam masala), ఒక టీస్పూన్ ధనియాల పొడి (Coriander powder), ఒక టీస్పూన్ జీలకర్ర పొడి (Cumin powder), ఒక టేబుల్ స్పూన్ కారం పొడి (Chili powder), రుచికి సరిపడా ఉప్పు (Salt), కొన్ని కరివేపాకులు (Curries), కొద్దిగా కొత్తిమీర (Coriander) తరుగు, పావుకప్పు నూనె (Oil).
తయారీ విధానం: ముందుగా కుక్కర్ తీసుకొని అందులో రాత్రంతా నానబెట్టిన (Soaked) ఒక కప్పు కాబూలీ సెనగలు, మూడు కప్పుల నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి బాగా మెత్తగా ఉడికించుకోవాలి (Cook until soft). సెనగలు ఎంత మెత్తగా ఉడికితే కూర అంత రుచిగా ఉంటుంది. కాబట్టి సెనగలను బాగా మెత్తగా ఉడికించుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో జీడిపప్పులను వేసి తక్కువ మంట (Low flame) మీద ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో కొబ్బరి తురుము కూడా వేసి మంచి కలర్ వచ్చేంత వరకూ ఫ్రై చేసుకోవాలి. ఇవి చల్లారాక తగినన్ని నీళ్లు, పచ్చిమిరపకాయలు వేసి బాగా మెత్తగా గ్రైండ్ (Grind finely) చేసుకోని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె పోసి వేగిన తరువాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగును వేసి మంచి కలర్ వచ్చేంత వరకూ ఫ్రై (Fry) చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ను (Ginger garlic paste) వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
తరువాత ఇందులో పసుపు, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసి బాగా కలుపుకోవాలి (Mix well). మసాలాలన్నీ బాగా వేగిన తరువాత కొన్ని నీళ్లు పోసి రెండు మూడు నిముషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొన్ని కరివేపాకులు, టమోటో పేస్ట్ ను వేసి కూర నుంచి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి.
ఇప్పుడు ఇందులో మెత్తగా గ్రైండ్ చేసుకున్న కాజుకొబ్బరి మసాలాను వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకొవాలి. తరువాత మెత్తగా ఉడికించిన సెనగలను నీళ్లతో సహా వేసి తక్కువ మంట మీద కూర నుంచి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకొని చివరిలో కొత్తిమీర (Coriander) తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన కాజుకొబ్బరి చోలే మసాలా (Kajukobbari Chole Masala) రెడీ.