ఎక్కువ సేపు కూర్చోవడం ఇంత డేంజరా?

First Published Dec 19, 2023, 4:53 PM IST

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల శరీరక సమస్యలే కాదు మానసిక సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే  ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవారు రోజూ కొద్దిసేపైనా వ్యాయామం చేయాల్సిందే. 
 

మనలో చాలా మంది..  ముఖ్యంగా ఆఫీసుల్లో పనిచేసేవారు రెగ్యులర్ గా 7 నుంచి8 గంటలకు ఎక్కువగానే కూర్చొని వర్క్ చేస్తారు. ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం వల్ల వెన్నునొప్పి మాత్రమే వస్తుందని చాలా మంది అనుకుంటుంటారు. కానీ ఇలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మీ మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది దీర్ఘకాలిక ప్రభావాన్నిచూపుతుందని నిపుణులు అంటున్నారు. 

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిశ్చల జీవనశైలి మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది కేవలం వెన్నెముక, వీపునకు సంబంధించిన సమస్యలనే కాకుండా అధిక బరువు, టైప్-2 డయాబెటిస్, గుండె సమస్యలు, డిప్రెషన్, యాంగ్జైటీ వంటి సమస్యలకు దారితీస్తుంది.

ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు

బరువు పెరగడం, ఊబకాయం

మీ కండరాలు కదులుతున్నప్పుడు.. లిపోప్రొటీన్ లిఫేజ్ లాంటి అణువులను విడుదల చేస్తుంది. ఇది మీరు తినే కొవ్వులు, చక్కెరలను ప్రాసెస్ చేయడానికి సహాయపడుతుంది. అయితే ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం వల్ల ఈ అణువుల విడుదల తగ్గుతుంది. అధ్యయనాల ప్రకారం.. మీరు ఒకేచోట ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎక్కువగా కూర్చునే వారు ఒక గంటపాటైనా వ్యాయామం చేయాలని డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. 

కండరాల నొప్పి

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కండరాల నొప్పులు వస్తాయి. ముఖ్యంగా ఇలా కూర్చోవడం వల్ల మీ కాళ్లు, పిరుదులు, మీ వీపు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. అలాగే ఈ భాగాల కండరాలు బాగా నొప్పి పెడతాయి. అలాగే అసౌకర్యంగా కూడా ఉంటుంది. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మీ హిప్ కూడా వంగుతుంది. అలాగే మీరు కూర్చున్న స్థానం కూడా మీ వెనుకకు గాయాన్ని చేస్తుంది. 

ముఖ్యంగా చెడు భంగిమలో కూర్చున్నా, సరైన కుర్చీని ఉపయోగించకపోయినా మీ ఎముకలు బలహీనపడతాయి. అలాగే ఎముకల పగుళ్లు వస్తాయి. పలు అధ్యయనాల ప్రకారం.. పేలవమైన భంగిమ మీ వెన్నెముకలోని ప్లేట్లను కుదించగలదు. ఇది అకాల క్షీణతకు దారితీస్తుంది. అంతేకాదు విపరీతమైన నొప్పి వస్తుంది. 
 

క్యాన్సర్

ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. 

గుండె సమస్యలు

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మీ బాహ్య శరీర కూర్పు దెబ్బతినడమే కాకుండా మీ గుండె వంటి అవయవాల పనితీరుపై కూడా ఎంతో ప్రభావం పడుతుంది. 11 గంటల పాటు టీవీ చూసే పురుషులతో పోలిస్తే వారానికి 23 గంటల కంటే ఎక్కువ చూసే పురుషులు గుండె జబ్బులతో చనిపోయే ప్రమాదం 64 శాతం ఎక్కువగా ఉందని అధ్యయనం కనుగొంది. అతిగా కూర్చునేవారికి గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం 147 శాతం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

నాడీ సంబంధిత సమస్యలు

ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కాళ్లలో రక్తం, ద్రవాలు పేరుకుపోతాయి. దీనివల్ల కాళ్లలో అలసట, వాపు, నొప్పి కలుగుతాయి. కొన్నిసందర్బాల్లో కాళు సిరలో రక్తం గడ్డకట్టినప్పుడు మీకు సిర సమస్యలు రావొచ్చు. ఇది ప్రమాదకరం. అలాగే గర్భిణీలు లేదా వృద్ధులు, స్మోకింగ్ చేసేవారికి ఎక్కువ ఈ ప్రమాదం 
 

డయాబెటిస్ మెల్లిటస్

ఒక అధ్యయనం ప్రకారం.. ఎక్కువసేపు కూర్చునేవారికి డయాబెటిస్ వచ్చే అవకాశం 112 శాతం ఎక్కువగా ఉంటుంది. నిశ్చల జీవనశైలి మీ శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. అందుకే ఎక్కువసేపు కూర్చునేవారు ప్రతి 20 నిమిషాలకు రెండు నిమిషాల పాటు నడవండి. ఈ నడక గ్లూకోజ్ స్థాయిలు, ఇన్సులిన్ ప్రతిస్పందనను నియంత్రించడానికి సహాయపడుతుంది. దీంతో మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. 

కూర్చున్నప్పుడు కంటే నిలబడి ఉన్నప్పుడు 30 శాతం ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇది కాలక్రమేణా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

click me!