
ఎన్నిసార్లు నీళ్లు తాగినా కొందరికి దాహం అసలే తీరదు. రోజంతా నీళ్లు తాగాలని అనిపిస్తూనే ఉంటుంది. మళ్లీ మళ్లీ దాహం వేస్తూనే ఉంటుంది. కానీ ఇలా అనిపించడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనికి ఎన్నో వ్యాధులు కారణం కావొచ్చు. ఇలాంటి సమస్య మీకు ఉంటే వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది.
నిపుణుల ప్రకారం.. దాహం మీ శరీరంలో ఉన్న ద్రవం స్థాయిపై ఆధారపడి ఉంటుంది. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడల్లా దాహంగా అనిపిస్తుంది. వేడి, తేమతో కూడిన వాతావరణంలో మన శరీరం నుంచి ఎక్కువ నీరు బయటకు పోతుంది. ఇది దాహానికి దారితీస్తుంది. ఇవే కాకుండా డయేరియా, డయాబెటిస్ వంటి కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కూడా మన శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. అయితే ఈ లక్షణాన్ని లైట్ తీసుకోకూడదు. వెంటనే హాస్పటల్ కు వెళ్లి చెక్ చేయించుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా తగినంత మొత్తంలో నీటిని తాగాలి.అలాగే హైడ్రేటింగ్ పండ్లు, కూరగాయలను తినాలి. ఎలాంటి అనారోగ్య సమస్యల వల్ల తరచూ దాహమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
డయాబెటిస్
శరీరంలోని కణాలు ఇన్సులిన్ నిరోధకంగా మారినప్పుడు మీ మూత్రపిండాలు రక్తం నుంచి చక్కెరను తొలగించడానికి మరింత సమర్థవంతంగా పనిచేయాలి. ఇది తరచూ మూత్ర విసర్జనకు దారితీస్తుంది. అలాగే శరీరంలో ఉన్న ద్రవం కూడా విడుదల అవుతుంది. ఫలితంగా మీ శరీరానికి నీరు ఎక్కువగా అవసరం అవుతుంది. దీనివల్ల మీకు ఎక్కువగా దాహమవుతుంది.పదేపదే మూత్ర విసర్జన చేయాలనిపించినా.. లేదా మీకు ఎక్కువ దాహంగా అనిపించినా అది డయాబెటీస్ వల్లే కావొచ్చు.
నోరు పొడిబారడం
మీ నోరు పొడిగా ఉన్నప్పుడు కూడా మీకు ఎక్కువ దాహం అనిపిస్తుంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితిలో నోటి గ్రంథులు చాలా తక్కువ పరిమాణంలో లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల తరచూ నోరు పొడిబారుతుంది. నోరు పొడిబారడానికి కొన్ని మందులు, క్యాన్సర్ చికిత్స, గొంతు , మెదడుకు నరాలు దెబ్బతినడం లేదా పొగాకు ఎక్కువగా తీసుకోవడం కూడా కారణం కావొచ్చు.
రక్తహీనత
రక్తహీనత సమస్యలో మీ శరీరం తగినంత హిమోగ్లోబిన్ అంటే ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను తయారు చేయదు. కొంతమందికి ఈ సమస్య పుట్టుకతోనే వస్తుంది. మరికొందరికి వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య బారిన పడతారు. అలాగే మధుమేహం, తప్పుడు ఆహారపు అలవాట్లు, అధిక రక్తస్రావం వంటి అనేక ఆరోగ్య సమస్యలు కూడా రక్తహీనతకు కారణమవుతాయి. రక్తహీనత ప్రారంభంలో, మధ్యలో మీకు దాహం అనిపించదు. కానీ సమస్య పెరిగేకొద్దీ మీకు ఎక్కువ దాహంగా అనిపిస్తుంది. దీనివల్ల మీరు నీళ్లను ఎక్కువగా తాగుతుంటారు.
హైపర్కాల్సెమియా
మీ రక్తంలో అవసరానికి మించి కాల్షియం ఉండే పరిస్థితిని హైపర్కాల్సెమియా అంటారు. అతి చురుకైన పారాథైరాయిడ్ గ్రంథి, క్షయ, ఊపిరితిత్తులు, రొమ్ము, మూత్రపిండాలు వంటి కొన్ని రకాల క్యాన్సర్లు ఈ సమస్యకు కారణమవుతాయి. మీకు పదేపదే దాహంగా అనిపించినా.. నీరు తాగాలనిపిస్తున్నా మీరు హైపర్కాల్సెమియాకు బలై ఉండొచ్చు.
నిర్జలీకరణం
దాహం వేయడానికి, తరచుగా నీటిని తాగాలనిపించడానికి నిర్జలీకరణం అతిపెద్ద కారణాలలో ఒకటి. నిర్జలీకరణం అంటే మీ శరీరంలో తగినంత నీరు లేకపోవడం. ఈ పరిస్థితిలో మీ నోరు పొడిబారడం, పొడి చర్మం, అలసట, తలనొప్పి, ముదురు రంగు మూత్రం వంటి అన్ని లక్షణాలు కనిపిస్తాయి. తగినంత నీటిని తాగకపోవడం, ఎక్కువ వ్యాయామం, విరేచనాలు, వాంతులు, అధిక చెమట వంటి పరిస్థితుల వల్ల నిర్జలీకరణం సమస్య వస్తుంది.