గుండెపోటు.. ఈ మాటను ప్రస్తుత కాలంలో చాలా అంటే చాలా తరచుగా వింటున్నాం. ఎందుకంటే చిన్న వయసు పిల్లలు కూడా గుండెపోటుతో చనిపోతున్నారు. ముఖ్యంగా యువకులు ఉన్నపాటుగా గుండెపోటుతో కుప్పకూలి చనిపోతున్నారు. ఇది ఎప్పుడు ఎవరిని బలితీసుకుంటుందో తెలియడం లేదు. ఒకప్పుడు వయసు మీద పడ్డ వారికి మాత్రమే గుండెజబ్బులు, గుండెపోటు వచ్చేది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా దీని బారిన పడుతున్నారు. యూఎస్ జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ డయాగ్నోస్టిక్ రీసెర్చ్ లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. 2015 నాటికి.. భారతదేశంలో సుమారు 6.40 కోట్ల మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. వీరిలో 2.5 కోట్ల మంది 40 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్నట్టు కనుగొనబడింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రకారం.. గత పదేండ్లలో భారతదేశంలో గుండె సంబంధ వ్యాధుల కారణంగా.. మరణాల సంఖ్య 75 శాతం పెరిగింది. 2019 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరొక నివేదిక ప్రకారం.. 2019లో ప్రపంచవ్యాప్తంగా 1.80 మిలియన్ల మరణాలు గుండె సంబంధిత వ్యాధుల కారణంగా సంభవించాయి. వీటిలో 85 శాతం మరణాలు కేవలం గుండెపోటు కారణంగానే సంభవించాయని నివేదికలో పేర్కొంది.
గుండెపోటు అంటే ఏంటి?
గుండెపోటు పరిస్థితిని 'మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్' అని పిలుస్తారని నిపుణులు అంటున్నారు. అంటే దీనిలో గుండెలోని ఒక భాగానికి రక్తం సరఫరా ఆగిపోతుంది. దీనివల్ల గుండెలోని ఆ భాగానికి అవసరమైన రక్తం, ఆక్సిజన్ లు అందవు. దీనివల్ల గుండెలోని ఆ కొంత భాగం పనిచేయడం ఆగిపోతుంది. ఇది మరణానికి దారితీస్తుంది.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గుండెపోటుకు ప్రధాన కారణం రక్తం గడ్డకట్టడం. రక్తం గడ్డకట్టడానికి ప్రధాన కారణం ధమనుల్లో కొవ్వు నిల్వలు. అలాగే గుండె కండరాలలోని ఒక భాగానికి రక్త ప్రవాహానికి అంతరాయం కలిగినప్పుడు గుండెలోని ఆ భాగానికి తగినంత ఆక్సిజన్ అందదు. దీనివల్ల కూడా చనిపోయే అవకాశం ఉంటుంది.
heart attack
యువతలో హార్ట్ ఎటాక్ రిస్క్ ఎందుకు పెరుగుతోంది?
ఈ మధ్య కాలంలో యువత గుండెపోటుతో చనిపోతున్న ఘటనలను మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్నప్పుడు, పార్టీలు, ఫంక్షన్ లో డ్యాన్స్ చేస్తున్నప్పుడు గుండె పోటు బారిన పడుతున్నారు.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వ్యాయామం చేసేటప్పుడు గుండెపోటు రావడం చాలా అరుదు. అయితే ప్రస్తుత కాలంలో యువతకు తెలియని గుండె సమస్యలు, సరైన శిక్షణ లేకుండా జిమ్ లో ఎక్కువగా కష్టపడటం, డీహైడ్రేషన్, మందును ఎక్కువగా తాగడం, కెఫిన్ తీసుకోవడం వల్ల గుండెపోటు కేసులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Heart Attack
గుండెపోటు లక్షణాలు
గుండె నొప్పి లేదా ఒత్తిడి
గుండెపోటుకు ప్రధాన లక్షణం గుండె నొప్పి లేదా గుండె పై బరువుగా అనిపించడం. ఈ నొప్పి ఎడమ చేతి వైపు లేదా ఛాతీ కింద వస్తుంది.
ఛాతీలో నొప్పి
గుండెపోటు వస్తే ఛాతీలో విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి క్రమంగా పెరుగుతుంది.
శ్వాస ఆడకపోవడం
గుండెపోటు లక్షణాలలో శ్వాస ఆడకపోవడం కూడా ఉంది. గుండెపోటుతో శ్వాస ఆడకపోవడం వల్ల ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది.
మూర్ఛ: గుండెపోటు సమయంలో కొంతమంది మూర్ఛపోతారు కూడా.
వికారం, వాంతులు: గుండెపోటు వచ్చే ముందు కొంతమందికి వికారం, వాంతులు సమస్యలు కూడా వస్తాయి.