పచ్చి అల్లాన్ని తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Nov 13, 2024, 1:25 PM IST

అల్లంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని ఉపయోగించి మనం దగ్గు, జలుబు నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అయితే పచ్చి అల్లాన్ని తింటే ఏమౌతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

అల్లాన్ని మనం ప్రతి కూరలో వేస్తుంటాం. ఇది కూరలను టేస్టీగా చేస్తుంది. అంతేకాదు ఇది మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు తెలుసా? వంటలో కాకుండా.. పచ్చి అల్లాన్ని కొంచెం తినడం వల్ల బోలెడు లాభాలను పొందుతామంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 

ginger

పచ్చి అల్లంలో జింజెరోల్ అనే మూలకం పుష్కలంగా ఉంటుంది. దీనిలో కొన్ని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడం నుంచి జీర్ణక్రియను మెరుగుపర్చడం వరకు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.

ఈ రోజుల్లో చాలా మంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి మెడిసిన్స్ కు బదులుగా వంటింట్లో ఉండే పదార్థాలనే వాడుతున్నారు. ఇలాంటి వారికి అల్లం ఎంతో సహాయపడుతుంది. అసలు పచ్చి అల్లంతో మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

పచ్చి అల్లంలోని ఔషదగుణాల వల్ల దీన్ని ఒక్క వంటల్లోనే కాదు ఎన్నో ఔషదాల తయారీలోనూ కూడా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదం, సాంప్రదాయ చైనీస్ మెడిసిన్ వంటి సాంప్రదాయ వైద్య పద్ధతుల్లో దీన్ని బాగా ఉపయోగిస్తారు. 
 



జీర్ణక్రియకు మేలు 

పచ్చి అల్లం మన జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. అల్లం జీర్ణ ఎంజైమ్ల సంశ్లేషణను పెంచుతుంది. ఇది మీరు తిన్నది ఫాస్ట్ గా విచ్ఛిన్నం కావడానికి సహాయపడుతుంది.  

అంతేకాదు పచ్చి అల్లం జీర్ణవ్యవస్థలో కండరాల కార్యకలాపాలను పెంచి మీకు కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు లేకుండా చేయడానికి సహాయపడుతుంది. హెవీగా తిన్న తర్వాత చిన్న పచ్చి అల్లం ముక్కను తింటే మీకు ఎలాంటి సమస్యలు రావు. 
 

మంటను తగ్గిస్తుంది

అల్లంలో జింజెరోల్ వంటి బయోయాక్టివ్ పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తివంతమైన శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి మన శరీర మంటను తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాదు కాళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడేవారికి కూడా పచ్చి అల్లం ఎంతో ప్రయోజనకంగా ఉంటుంది. పచ్చి అల్లాన్ని తరచుగా తీసుకుంటే కీళ్ల నొప్పులు చాలా వరకు తగ్గుతాయి.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

పచ్చి అల్లంలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి బాగా సహాయపడతాయి. అంతేకాదు ఇది మీ శరీరం రక్షణ యంత్రాంగాలను బలంగా చేస్తుంది. అలాగే ఇది శరీరానికి హానికలిగించే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. జలుబు,ఫ్లూ వంటి సీజనల్ సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

వికారాన్ని తగ్గిస్తుంది

ప్రెగ్నెన్సీ లేదా శస్త్రచికిత్స తర్వాతి సమయంలో పచ్చి అల్లం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వికారం, వాంతులను చాలా వరకు తగ్గించడానికి సహాయపడుతుంది. నిపుణుల ప్రకారం.. ఇది మార్నింగ్ సిక్ నెస్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. 

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

పచ్చి అల్లం కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది రక్తపోటును, కొలెస్ట్రాల్ ను బాగా తగ్గిస్తుంది. అంతేకాదు పచ్చి అల్లం శరీరంలో  రక్త ప్రసరణను పెంచి రక్తం గడ్డకట్టే అవకాశాన్ని తగ్గిస్తుంది. దీంతో మీకు గుండె జబ్బులొచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రక్తనాళాలను కాపాడుతాయి. 
 

రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది

తాజా పరిశోధనల ప్రకారం.. పచ్చి అల్లం బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా పచ్చి అల్లం టైప్ 2 డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అల్లంలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరిచే లక్షణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Latest Videos

click me!