ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు శరీరం ఏదో రకంగా ఆ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. మన గోళ్లలో వచ్చే కొన్ని మార్పులు మన ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని వ్యాధులకు సంకేతాలని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో ఏదైనా పెద్ద వ్యాధి ఉంటే, గోళ్లలో రంగు మారుతుందట.
ఆరోగ్యకరమైన గోళ్లు
ఆరోగ్యకరమైన గోళ్లు మెరిసే రంగులో, చివర్లో తెల్లగా ఉంటాయి. గోళ్ల రంగు, ఆకారం మారుతూ ఉంటే, ఆరోగ్యంలో సమస్య ఉందని అర్థం. అప్పుడు, గోళ్లను చూసి ఆరోగ్యాన్ని ఎలా అంచనా వేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలిపోయిన గోళ్లు:
మీ గోళ్లు పాలిపోయి ఉంటే, అది పోషకాహార లోపం, రక్తహీనత, కాలేయ సమస్యలకు సూచన. వెంటనే డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవడం మంచిది.
గోళ్ల పగుళ్లు :
మీ గోళ్లు తరచుగా విరిగిపోతుంటే లేదా పగుళ్లు వస్తుంటే, అది థైరాయిడ్ సమస్యకు సూచన. శరీరంలో తగినంత పోషకాహారం లేనప్పుడు కూడా ఇలా జరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. గోళ్లు విరిగిపోయి పసుపు రంగులో ఉంటే, అది ఫంగల్ ఇన్ఫెక్షన్ గా చెప్పొచ్చు.
గోరుపై నల్ల గీతలు
మీ గోళ్లపై నల్ల గీతలు కనిపిస్తే, వెంటనే డాక్టర్‌ను కలవడం మంచిది. ఎందుకంటే ఇది చర్మ క్యాన్సర్‌కు సంకేతమని నిపుణులు చెబుతున్నారు.
గోళ్లలో పసుపు రంగు:
గోళ్లు పసుపు రంగులోకి మారడానికి ప్రధాన కారణం ఫంగల్ ఇన్ఫెక్షన్లు. దీన్ని తేలిగ్గా తీసుకుంటే, తర్వాత గోళ్లు విరిగిపోతాయి లేదా మందంగా మారుతాయి.
తెల్లటి మచ్చలు:
గోళ్లపై తెల్లటి మచ్చలు సాధారణం. మీ గోళ్లంతా తెల్లటి మచ్చలు ఉంటే, అది జింక్ లోపానికి సంకేతం. మరో కారణం అలెర్జీ, ఫంగల్ ఇన్ఫెక్షన్.