మీరు HMPV బారిన పడకుండా వుండాలంటే ... ఏం చేయాలి, ఏం చేయకూడదు

First Published | Jan 7, 2025, 7:26 PM IST

HMPV వైరస్ భారత్ లోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో మీరు ఈ వైరస్ బారిన  పడకుండా వుండాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసుకొండి?  మీ ఆరోగ్యాన్ని కాపాడుకొండి.  

HMPV

HMPV : మనమంతా ఏది జరగకూడదని కోరుకున్నామో అదే జరుగుతోంది. కరోనా పరిస్థితి మళ్లీ జీవితంలో చూడకూడదని అనుకున్నాం... కానీ ఇప్పుడు అచ్చం కోవిడ్-19 లక్షణాలో మరో మహమ్మారి HMPV (Human metapneumovirus) వచ్చింది. వస్తే వచ్చింది కానీ ఇది చైనాకే పరిమితం అయితే బాగుండని అనుకున్నాం... కానీ అదిప్పుడు ఇండియాకు చేరింది. ఇలా HMPV వ్యాప్తి కోవిడ్-19 తొలిరోజులను గుర్తుచేస్తోంది. దీంతో మళ్లీ కరోనా సమయంలో పరిస్థితులు పునరావృతం అవుతాయా? అన్న అనుమానం ప్రజల్లో మొదలయ్యింది. 

అయితే కరోనా లాంటి కష్టకాలం మళ్లీ రాకుండా చూసుకునే బాధ్యత మనపైనే వుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా, గతంలో మాదిరిగా లాక్ డౌన్ విధించినా ప్రజల సపోర్ట్ లేకుంటే ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం కష్టం. కాబట్టి పరిస్థితి చేయదాటకుండా చూడటం దేశ ప్రజలుగా మన చేతుల్లోనే వుంది. 

ఇప్పటికే దేశంలో నిన్నటి నుండి HMPV కేసులు ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి. కేవలం నిన్న, ఈరోజు (సోమ, మంగళవారం)కలిపి మొత్తం 10 వైరస్ కేసులు బైటపడ్డాయి. ఇందులో బెంగళూరులో 2,  చెన్నైలో 2, కలకత్తాలో 3, అహ్మదాబాద్ లో 1, నాగ్ పూర్ లో 2 కేసులు వున్నాయి. ఇలా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతుండటం మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 

ప్రజలు ఇప్పుడు అప్రమత్తం కాకుంటే మరోసారి కరోనా రోజులు రావడం ఖాయంగా కనిపిస్తోంది. కరోనా మాదిరిగా ఈ వైరస్ కూడా విజృంభిస్తే ఏ పరిస్దితులు ఏర్పడతాయో ఏమో?. కాబట్టి ముందే జాగ్రత్తపడటం మంచిది.  అందువల్లే మనం HMPV బారిన పడకుండా వుండాలనే ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం.  
 

HMPV

HMPV బారిన పడకుండా ఏం చేయాలి?

హెచ్ఎంపివి అనేది కోవిడ్-19 నే పోలివుంది. ఇదికూడా ఒకరినుండి ఒకరికి గాలిద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి గతంలో కరోనా బారినుండి కాపాడుకునేందుకు ఉపయోగించిన జాగ్రత్తలే పాటించాల్సి వుంది.  

1. ఇంటినుండి బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలి. మాస్కు మన ముక్కు, నోటికి అడ్డంగా వుండి వైరస్ వీటిద్వారా శరీరంలోకి వెళ్లకుండా అడ్డుపడుతుంది. అంతేకాదు మాస్కు ధరించడం వల్ల వాతావరణ కాలుష్యం బారినుండి కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇలా మాస్కు ధరించడం వల్ల ఎన్నో లాభాలున్నాయి... కాబట్టి మళ్ళీ మాస్కులవైపు మళ్ళాల్సిందే. 

2. ఇక HMPV వైరస్ ఒకరినొకరు తాకడం, ముద్దుల వల్ల కూడా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకినవారికి ముక్కు కారడం, దగ్గు,తుమ్ములు వస్తాయి... కాబట్టి చేతితో ముక్కు తుడుచుకోవడం చేస్తుంటారు, దగ్గు,తుమ్ములు వచ్చినపుడు చేతులు అడ్డు పెట్టుకుంటారు. అలాంటివారితో కరచాలనం లేదా దగ్గరగా వుండటం వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. కాబట్టి భౌతికదూరాన్ని పాటించాలి. శానిటైజర్లను మళ్లీ చేతులు శుభ్రం చేసుకోవడం ప్రారంభించాలి.

3. గాలి ద్వారా ఈ HMPV వైరస్ వ్యాప్తి చెందుతుంది. అంటే జనాల రద్దీ ఎక్కువగా వుండే ప్రాంతాల్లో దీన్ని వ్యాప్తి ఎక్కువగా వుంటుంది. కాబట్టి రద్దీ ప్రాంతాలకు వెళ్లకపోకుండా వుండటం మంచిది. వెళ్లినా అక్కడ మాస్కు ధరించే వుండాలి.

4. స్కూలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారు రోజులో ఎక్కువసమయం ఇతరులతో కలిసి వుండాల్సి వస్తుంది. ఇలాంటివారు ఇతరులతో తగిన దూరం పాటించాలి. ముఖ్యంగా జలుబు, దగ్గు, శ్వాస సమస్యలతో బాధపడేవారితో దూరంగా వుండాలి. 

5. ఇప్పుడిప్పుడే HMPV కేసులు బైటపడుతున్నాయి. కాబట్టి కొన్నిరోజులు జాగ్రత్తగా వుండాలి. అవసరం వుంటేనే బయటకు వెళ్ళాలి. అలాగే జలుబు, దగ్గు,తుమ్ములు, జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి HMPV లక్షణాలుంటే కుటుంబసభ్యులకే కాదు ఇతరులకు దూరంగా వుండాలి. ఇంట్లోనే వుంటూ రెస్ట్ తీసుకోవాలి. 

ఇలా కరోనా సమయంలో తీసుకున్న ముందుజాగ్రత్తలు తీసుకోవడం  ద్వారా HMPV బారిన పడకుండా వుండవచ్చు. 


HMPV

HMPV బారిన పడకుండా వుండాలంటే ఏం చేయకూడదు? 

ఈ హెచ్ఎంపివి వైరస్ బారిన పడకుండా వుండాలంటే ముందుజాగ్రత్తలు తీసుకోవడం ఎంత అవసరమో కొన్ని తప్పులు చేయకుండా వుండటం కూడా అంతే ముఖ్యం. కొన్ని పనులకు దూరంగా వుండటంవల్ల ఈ వైరస్ కు కూడా దూరంగా వుండవచ్చు.  

1. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాదు ఇతర దేశాలో కూడా HMPV వేగంగా వ్యాప్తి చెందుతోంది. కాబట్టి ఎక్కువగా దేశీయంగా ప్రయాణించేవారు, విదేశాలకు వెళ్లేవారు కొద్దిరోజులు వీటిని తగ్గించుకుంటే మంచింది. అంటే ప్రయాణాలు ఎక్కువగా చేయకూడదన్న మాట. దీనివల్ల ఈ వైరస్ బారినపడే అవకాశం వుంటుంది. 

2. జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడేవారు ఆరోగ్యం పట్లు నిర్లక్ష్యంగా వుండకూడదు. వెంటనే హాస్పిటల్ కు వెళ్లి వైద్యం పొందాలి. ఎక్కువరోజులు అనారోగ్యంతో వుంటే ఓ సారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

3. చాలామంది ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణిస్తుంటారు. ఇలా మెట్రోలు, ఆర్టిసి బస్సుల్లో ప్రయాణించేటపుడు జాగ్రత్తగా వుండాలి. ఎవరైనా జలుబు, దగ్గుతో బాధపడుతుంటే వారికి దూరంగా వుండాలి. 

4. వృద్దులు, చిన్నారులపై ఈ HMPV వైరస్ ప్రభావం ఎక్కువగా వుంటుంది. కాబట్టి కుటుంబాల్లోని వృద్దులు, చిన్నారులను బయటకు తీసుకురాకూడదు. ఒకవేళ ఏదైనా అవసరం వుండి తీసుకువవచ్చినా మాస్కులు ధరించి, శానిటైజర్లు వాడేలా చూడాలి. 

5. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యారోగ్య సిబ్బంది, వైద్య నిపుణులు సూచనలు పాటించాలి. ఏవయినా ఆంక్షలు విధిస్తే పాటించాలి. నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. వీటిని విస్మరిస్తే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే. 

ఇలా hmpv వైరస్ బారిన పడకుండా వుండాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది తెలుసుకోండి. తద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకొండి. 

ఇవి కూడా చదవండి :

వేగంగా పెరుగుతున్న HMPV కేసులు: మళ్లీ లాక్‌డౌన్ చేస్తారా?

HMPV వైరస్ ప్రమాదకరమా? ఇప్పటివరకు ఇండియాలో కేసులెన్ని? తెలంగాణ, ఏపీ పరిస్థితి?

Latest Videos

click me!