ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడనివారు ఎవరూ ఉండటం లేదు. ఇది వాస్తవం. చిన్న పిల్లల దగ్గర నుంచి... ముసలివాళ్ల వరకు అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ఇంటర్నెట్ సదుపాయం ఉండటంతో.... ఒంటరిగా ఉన్నా కూడా బోర్ కొట్టకుండా ఆ ఫోన్ తో గడిపేయవచ్చు. మనం ఇంట్లోనే కూర్చొని.. ప్రపంచ నలుమూలల్లో జరిగే విషయాలను కూడా తెలుసుకోవచ్చు. ఫోన్ చూడటంలో ఎలాంటి తప్పులేదు. కానీ.. మనం ఆ ఫోన్ చూసే సమయంలో మన బాడీ ఏ పొజిషన్ లో ఉంటుంది అనేది చాలా ముఖ్యం.
ఎందుకంటే... ఎక్కువ మంది కూర్చున్నప్పుడు మెడలు వంచేసి మరీ ఫోన్ చూస్తారు. కొందరు.. పడుకొని మరీ ఫోన్ చూస్తారు. కూర్చొని ఉన్నప్పుడు మెడ వంచి మరీ ఫోన్ చూడటం వల్ల.. తల బరువు మొత్తం మెడపై పడుతుంది. దాని వల్ల స్పాండిలైటిస్ వచ్చే ప్రమాదం ఉంది. అది కాదు అని పడుకొని చూస్తున్నాం కదా.. అప్పుడు మా మెడపై ఎలాంటి ఒత్తిడి పడదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ.. పడుకొని ఫోన్ చూడటం వల్ల కూడా చాలా సమస్యలు వస్తాయని నిపుణులు హఎచ్చరిస్తున్నారు.
కేవలం ఫోన్ చూడటం మాత్రమే కాదు... పడుకొని టీవీ చూసినా, పుస్తకాలు చదివినా కూడా.. చాలా సమస్యలు వస్తాయట. పడుకొని చూడటం వల్ల కూడా మెడపై నొప్పి వస్తుందట. మెడ దగ్గర ఎముకలు అరిగిపోతాయట. అంతేకాదు... చెవులు కూడా దెబ్బ తింటాయట. చెవుల్లో గుంయ్ అనే శబ్దం వస్తుందట. కాబట్టి.. వీలైనంత వరకు పడుకొని టీవీలు, ఫోన్ లు చూడకపోవడమే మంచిది.
ఇక కూర్చొని ఫోన్ వాడే సమయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కుర్చీలోనో, సోఫాలోనో కూర్చున్నప్పుడు ఫోన్ టీవీ చూడటానికి మీ మెడను ఉపయోగించకూడదు. కేవలం కంటిని మాత్రమే ఉపయోగించాలని వైద్యులు అంటున్నారు. మనం వెన్ను నిటారుగా కూర్చోవాలని , ఫోన్ చూడడానికి లేదా టెక్స్ట్ చేయడానికి మెడలు వంచకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
పడుకున్నప్పుడు ఫోన్ వాడే సమయంలోనూ...కచ్చితంగా దిండు ఉపయోగించాలి. ఫోన్ పట్టుకునే సమయంలో కూడా మోచేతికి దిండు సపోర్ట్ ఇవ్వాలి. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే.. చాలా రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి.. కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం ఉత్తమం..