మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగాల్లో నాలుక ఒకటి. నాలుకను ప్రతిరోజూ శుభ్రం చేయడం చాలా అవసరం అని నిపుణులు చెబుతున్నారు. నోటి ఆరోగ్యం, శారీరక ఆరోగ్యంతో సహా అనేక విషయాలు నాలుకపై ఆధారపడి ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే పళ్లు తోముకునేటప్పుడు నాలుకను కూడా శుభ్రం చేసుకోవాలి.
కానీ చాలా మంది ఉదయం పళ్లు తోముకుంటారు కానీ నాలుకను శుభ్రం చేసుకోరు. ఇలా రోజుల పాటు నాలుకను శుభ్రం చేయకపోతే ఏం జరుగుతుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
నాలుక శుభ్రత
చాలా మంది నాలుకను శుభ్రం చేయడాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఈ అలవాటు మీ మొత్తం ఆరోగ్యంపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. నిపుణుల ప్రకారం నాలుకను ప్రతిరోజూ శుభ్రం చేస్తే దానిపై సహజంగా పేరుకుపోయే బ్యాక్టీరియా, ఆహార పదార్థాలు, మృత కణాలు తొలగించబడతాయి.
నెల రోజుల పాటు..
ఒక నెల పాటు నాలుకను శుభ్రం చేయకపోతే.. పై భాగంపై బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో పాటు మందమైన, జిగట బయోఫిల్మ్ ఏర్పడుతుంది. దీనివల్ల నోటి దుర్వాసన, రుచి జ్ఞానం మందగించడం, నోటిలో అసౌకర్యం, తెల్లటి మచ్చలు, ఫంగల్ ఇన్ఫెక్షన్, మృత కణాల వల్ల నాలుక నల్లగా మారడం లాంటివి జరుగుతాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి.
అంతేకాకుండా, నాలుకపై ఉండే బ్యాక్టీరియా చిగుళ్లకు వ్యాపించి చిగుళ్ల ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. కొన్నిసార్లు జీర్ణ సమస్యలకు కూడా దారితీస్తుంది. రోజు నాలుకను శుభ్రం చేయకపోతే చిగుళ్ల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, వాపు వంటి సమస్యలు వస్తాయి. కాలక్రమేణా అవి ప్రేగులు, రక్త ప్రసరణకు చేరి మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
నాలుకను శుభ్రం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
- ప్రతిరోజూ నాలుకను శుభ్రం చేస్తే నోటి దుర్వాసన రాదు.
- మీ రుచి జ్ఞానం మెరుగుపడుతుంది.
- నోటిలోని హానికరమైన బ్యాక్టీరియా తగ్గుతుంది.
- ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది.
- నాలుకను శుభ్రంగా ఉంచుకుంటే నోరు తాజాగా ఉండటమే కాకుండా.. ఆరోగ్యంగా కూడా ఉంటుంది. నోటి పూత రావడం తగ్గుతుంది.